రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అధికార పార్టీ సంకల్పిస్తే సభలను సక్సెస్ చేయడం ఓ లెక్కా! గుంటూరు జిల్లాలో సోమవారం జరిగే మహా సంకల్పం సభకు భారీగా తరలిరండని బాబుగారు పిలుపివ్వడంతో అటు తమ్ముళ్లు ఇటు అధికారులు నిబంధనలకు నీళ్లొదిలేశారు. దర్జాగా స్కూలు బస్సుల్లో జనాన్ని తరలించేశారు. అధికారులేమో ఏర్పాట్లలో తలమునకలై పాలన సంగతి మరచిపోయారు. పోలీసులైతే జిల్లాలో శాంతిభద్రలను గాలికొదిలేసి బందోబస్తు పేరుతో తండోపతండాలు తరలిపోయారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాష్ట్ర ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట మహాసంకల్పం పేరిట తలపెట్టిన బహిరంగసభకు జిల్లా నుంచి పెద్దఎత్తున అధికార పార్టీ శ్రేణులు తరలివెళుతున్నాయి. ఇందులో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు గానీ ప్రజలు, పార్టీ శ్రేణుల తరలింపునకు టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జరిగిన మహానాడుకు కూడా జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హైదరాబాద్‌కు తరలివెళ్లాయి.
అప్పుడు ఎక్కడా ఎటువంటి విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు మహాసంకల్పం పేరిట చేపట్టే అధికారిక కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అధికార లాంఛనాలతో తరలివెళ్లడమే వివాదాస్పదంగా మారుతోంది. మహాసంకల్ప సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోటాపోటీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను పెద్దసంఖ్యలో తరలిస్తున్నారు. ఇందుకు మళ్లీ స్కూలు బస్సులను వినియోగిస్తున్నారు. బహిరంగ సభలకు జనాలను స్కూలు బస్సుల్లో తరలించొద్దంటూ ఇటీవలే రవాణాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ విషయమై చాలా కఠినంగా ఉంటున్నారు. రెండు నెలల కిందట సీఎం చంద్రబాబు పట్టిసీమ శంకుస్థాపన సభకు వచ్చినప్పుడు కూడా స్కూలు బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులనే వినియోగించారు. అయితే ఈ మహాసంకల్ప సభకు మళ్లీ స్కూలు బస్సులనే వినియోగిస్తున్నారు. ఒక్కో ఆర్టీసీ బస్సుకు సుమారు రూ.13వేల చొప్పున రూ.లక్షల్లో అవుతున్న ఖర్చును భరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ నేతలు కార్పొరేట్ స్కూలు బస్సులను ఎంచుకున్నారు. ప్రైవేటు యాజమాన్యాలతో ఉన్న పరిచయాల నేపథ్యంలో కేవలం డీజిల్ ఖర్చులు భరించేలా మాట్లాడుకుని ఆ బస్సులను వినియోగిస్తున్నారు. ఈ మేరకు జిల్లా నుంచి సుమారు వెయ్యి స్కూలు బస్సులు సోమవారం గుంటూరుకు తరలివెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఏలూరు నుంచే ఇంజినీరింగ్ కాలేజీల బస్సులతో సహా 150 స్కూలు బస్సులు తరలివెళుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
629 మంది పోలీసుల తరలింపు
ఇక మునుపెన్నడూ లేని విధంగా జిల్లా నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు గుంటూరుకు తరలివెళ్లారు. రెండురోజుల ముందుగానే పోలీసులు అక్కడికి వెళ్లిపోవడంతో జిల్లాలో చాలా పోలీస్‌స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నలుగురు డీఎస్పీలు, 17మంది సీఐలు, 48 మంది ఎస్సై, 100 మంది ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు 330 మంది, హోంగార్డులు 130 మంది కలిపి మొత్తం 629 మంది ఈ నెల ఐదవ తేదీనే గుంటూరు వెళ్లారు. తిరిగి వీరంతా ఈ నెల 9న జిల్లాకు చేరుకుంటారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో రెండురోజులుగా పోలీస్ సిబ్బంది లేకపోవడంతో శాంతిభద్రతల పరంగా, వ్యక్తిగత, ఇతర సమస్యలతో వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పోలీస్‌స్టేషన్లు ఖాళీ అయిన పరిస్థితుల్లో ఈలోగా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పరిస్థితేమిటన్న ఆందోళన పోలీసు శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది.
మీ కోసం కూడా అంతేనా
ప్రతి సోమవారం కలెక్టరేట్, ఆర్టీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే మీ కోసం కార్యక్రమం కూడా ఈ 8వ తేదీన నామమాత్రంగానే జరగనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు మహా సంకల్ప బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లలో తలకమునకలయ్యేందుకు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. దీంతో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించే వేదికైన మీకోసం కార్యక్రమం ఈ సోమవారం తూతూ మంత్రంగానే జరగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అంతా అక్కడికేనా! పాలన గాలికేనా?
Published Mon, Jun 8 2015 1:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement