ఏపీ వ్యవసాయ వర్సిటీ ఎక్కడ?
ఏపీ వ్యవసాయ వర్సిటీ ఎక్కడ?
Published Sat, Jun 7 2014 1:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ప్రభుత్వ పరిశీలనలో గుంటూరు ‘లాం’ పరిశోధనా కేంద్రం
నూతన పరిశోధనలకు అనువైన ప్రాంతమంటున్న శాస్త్రవేత్తలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ (రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్) విభజన కారణంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వర్సిటీ ఏర్పాటు అనివార్యమైంది. అయితే దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ అనువైన ప్రాంతం కోసం ప్రభుత్వం అన్వేషణ మొదలు పెట్టింది.
రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశాలున్న కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగం కూడా యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతరత్రా అర్హతలున్న ప్రదేశాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిసింది. తిరుపతిలో పశు వైద్య విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి)లో ఉద్యాన విశ్వవిద్యాలయం ఉండటంతో ఈ రెండింటికీ మధ్యలో ఉన్న గుంటూరు ‘లాం’ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కొత్తగా వ్యవసాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం మంచిదన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం.
అనువైన ప్రాంతమే...
లాం కేంద్రానికి 500 ఎకరాల భూములున్నాయి. ఇప్పటికే ఇక్కడ 45 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి, పత్తి, మిరప, కంది పంటల నూతన వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు. నీటి వసతి, ప్రయాణానికి అనువైన రోడ్డు కనెక్టివిటీ బాగుంది. సీమాంధ్రలోని 13 జిల్లాలకూ సరిగ్గా మధ్యలో ఉండటం అదనపు అర్హతగా అధికారులు భావిస్తున్నారు.
మేం ప్రభుత్వాన్ని కోరాం..
‘‘గుంటూరు లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నూతన వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని పెడితే బాగుంటుందని ఉన్నతాధికారుల్ని కోరాం. ఖాళీ భూములతో పాటు అనువైన భవనాలు, లేబొరేటరీలు, విశాలమైన కాన్ఫరెన్స్ హాళ్లు ఉన్నాయి. గుంటూరు కేంద్రానికి చాలా దగ్గర. మంచి పేరున్న శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. గుంటూరులో వర్సిటీని పెడితే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.’’
- డాక్టర్ నారాయణ,
ఏడీఆర్, లాం పరిశోధనా కేంద్రం, గుంటూరు
Advertisement