మానవాభివృద్ధిలో విద్య కీలకం
Published Sun, Dec 29 2013 2:22 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :మానవాభివృద్ధిలో విద్య చాలా కీలకమని, విద్యతో ఏదైనా సాధించవచ్చని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చి డెరైక్టర్, ఉపకులపతి ఆచార్య ఎస్. మహేంద్రదేవ్ అన్నారు. శనివారం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం 2010-2011, 2011-2012 విద్యా సంవత్సరాల స్నాతకోత్సవాన్ని ఒకేసారి వర్సిటీలో నిర్వహించారు. ఆచార్య మహేంద్రదేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో మానవాభివృద్ధి, బడుగు వర్గాలకు అవకాశాలు, ప్రాథమిక , ఉన్నత విద్య అనే అంశాలపై ప్రసంగించారు. మానవాభివృద్ధికి మానవ స్వేచ్ఛ ముఖ్యమన్నారు. మానవ అభివృద్ధి పేదరికాన్ని నిర్మూలించేందుకు దోహదం చేస్తుందన్నారు. మహిళల జీవిత కాలం, అక్షరాస్యత విషయంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తీవ్రమైన అంతరాలు వున్నాయన్నారు. మహిళా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 25వ రాష్ట్రంగా ఉందన్నారు. చైనాతో పోల్చితే మన దేశంలో నిపుణుల సంఖ్య తక్కువ అన్నారు. అక్కడ 50 శాతం మంది నిపుణులు ఉంటే మన దేశంలో పది శాతం మంది మాత్రమే ఉంటున్నారని వివరించారు. ఇక్కడ సాధారణ నిరుద్యోగం కంటే యువ నిరుద్యోగం అధికంగా ఉందని చెబుతూ దానిని నిర్మూలించకపోతే మానవాభివృద్ధి సాధ్యం కాదన్నారు.
జపాన్, సౌత్‌కొరియా, తైవాన్ తదితర దేశాలు ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిస్తుంటే మన దేశం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మన దేశంలో ఐదవ తరగతి విద్యార్థి రెండో తరగతి పాఠ్యాంశాన్ని చదివే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండటం లేదన్నారు. విద్యారంగ ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువకులకు ఉపాధి కల్పించటంలో కీలకమైన ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రపంచస్థాయిలో మొదటి రెండు వందల యూనివర్సిటీల్లో మనదేశ విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించకపోవటం విచారకరమన్నారు. ఉన్నత విద్యలో సంఖ్య కంటే నాణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సొంతం చేసుకోవచ్చని తెలిపారు.
గౌరవ డాక్టరేట్ ప్రదానం..
అనంతరం వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు మహేంద్రదేవ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. రెక్టార్ ఆచార్య వైపీ. రామసుబ్బ య్య, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్. కాంతం, డీన్‌లు ఆచార్య ఎం. మధుసూదనరావు, ఆచార్య ఏవీ. దత్తాత్రేయరావు, ఆచార్య బి. సాంబశివరావు, ఆచార్య పి. చంద్రశేఖరరావు, ఆచార్య ఎల్. జయశ్రీ, ఆచార్య వై. కిషోర్, డాక్టర్ డి. భాస్కరరావు, ఆచార్య మహా లక్ష్మి , పలువురు అధికారులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థి దశను గుర్తు చేసుకుంటూ..
స్నాతకోత్సవ ముఖ్య అతిథి, గౌరవ డాక్టరేట్ గ్రహీత ఆచార్య మహేంద్రదేవ్ ఈ సందర్భంగా తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్నారు. తాను ఏఎన్‌యూ పూర్వ విద్యార్థినేనని, యూనివర్సిటీ ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని తెలిపారు. ఆ రోజుల్లో తన స్వగ్రామమైన దుగ్గిరాల మండలం తుమ్మపూడి నుంచి రోజూ స్కూటర్‌పై వచ్చే వాడినన్నారు. ఆ రోజుల్లో తరగతులు రేకుల షెడ్డుల్లో సాగాయని ఇప్పుడు భవనాలు అందుబాటులోకి రావటం మంచి పరిణామమన్నారు.
Advertisement