
వర్సిటీ బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం
రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు: రాధా మోహన్‌సింగ్
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీకి శంకుస్థాపన
సాక్షి, గుంటూరు: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా కల్పించి నిర్వహణ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని లాం ఫాంలో సోమవారం ఉదయం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాన్ని 500 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,505 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో పోస్టుగ్రాడ్యుయేట్ సెంటర్, సీడ్ అండ్ రీసెర్చ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, వాటర్ టెక్నాలజీ, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, పెస్టిసైడ్ రీసెర్చ్ లేబోరేటరీ, ఫుడ్ ప్రొసెసింగ్, ట్రైనింగ్ కమ్ ఇన్‌క్యూబేషన్ సెంటర్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చేనెలలో మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
బీపీటీ వరి వంగడంతో ఘనకీర్తి..
కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం బీపీటీ వరి వంగడాన్ని పరిశోధన ద్వారా రూపొందించి రైతాంగానికి అందించిన ఘనత ఈ వర్సిటీకే దక్కుతుందన్నారు. దేశంలో ఉన్న రైతులకు వారి భూమి స్వభావం తెలిపే సాయిల్ హెల్త్ కార్డు ప్రతిరైతు జేబులో ఉండేలా రూ.580 కోట్లతో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాలు చూసే సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు రాధామోహన్‌సింగ్ ప్రకటించారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న పలు ఇన్‌స్టిట్యూషన్స్ గురించి వాటికి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు.