Radhamohansing
-
కొత్తగా 16 ఈ–నామ్ మార్కెట్లు
- రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 మార్కెట్లకు అదనం.. కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ వెల్లడి - తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందుకు ప్రశంసలు - ఈ–నామ్లో ఇంటర్ మార్కెటింగ్ ప్రవేశపెట్టింది తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా 16 ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్లు (ఈ–నామ్) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ–నామ్‌ను అమలు చేస్తున్న రాష్ట్రాల మంత్రులతో కేంద్ర మంత్రి బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా 16 మార్కెట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 ఈ–నామ్ మార్కెట్లలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందుకు ప్రశంసించారని తెలిపారు. మార్కెట్లను మెరుగ్గా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై సమావేశంలో చర్చించామన్నారు. ఉత్పత్తుల అమ్మకాల సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించినట్లు హరీశ్‌రావు తెలిపారు. రైతులు రెండు, మూడు పంటలు తెస్తే ఒకే లాట్లో అమ్ముకునే సౌకర్యం కల్పించాలని సూచించామన్నారు. ఈ–నామ్ మార్కెట్ల నిర్వహణకు ఒక్కో మార్కెట్‌కు ఏటా రూ. 30 లక్షలు ఇస్తున్న కేంద్రం ఈ ఏడాది నుంచి రూ. 75 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ–నామ్ ద్వారా ఇంటర్ మార్కెటింగ్‌ను ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. జడ్చర్ల–మహబూబ్‌నగర్, కరీంనగర్– చొప్పదండి మార్కెట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తూ వరి కొనుగోళ్లు జరుపు తున్నట్లు వివరించారు. గోడౌన్ల నిర్మాణానికి కేంద్రం తరఫున రెండో విడతగా ఇవ్వాల్సిన రూ. 183 కోట్లను విడుదల చేయాలని రాధామోహన్ సింగ్‌ను కోరినట్లు హరీశ్ చెప్పారు. తెలంగాణలో రూ. 1,024 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోడౌన్లను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణలో ఈ– నామ్‌ను సక్రమంగా అమలు చేయట్లేదంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన విమర్శలను హరీశ్‌రావు కొట్టిపారేశారు. ఈ–నామ్ మార్కెట్లు సరిగ్గా పనిచేయకపోతే నిజామాబాద్ మార్కెట్‌కు జాతీయ స్థాయి అవార్డు ఎలా దక్కిందని ప్రశ్నించారు. మరో 66 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: హరీశ్‌రావు తెలంగాణలో ఈ ఏడాది పత్తి సాగు 20 శాతం అధికంగా ఉన్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోళ్ల కోసం ఇప్పటికే ఉన్న 84 కేంద్రాలకు అదనంగా 66 కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కలసి మంత్రి హరీశ్‌రావు కోరారు. వర్షాల వల్ల రంగు మారిన పత్తికి నిర్దిష్ట ధరను నిర్ణయించి సీసీఐ ద్వారానే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్ర జౌళిశాఖ అదనపు కార్యదర్శి పుష్పా సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు. రైతులకు బార్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డులను జారీ చేసి కోనుగోళ్లు చేస్తుండటంపై కేంద్రం ప్రశంసించినట్లు హరీశ్‌రావు తెలిపారు. -
వారంలో తెలంగాణకు కరువు నిధులు
కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు వారంలో కరువు నిధులను విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ నిధులే ఇస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ బుధవారం కరువు సహాయంపై రాధామోహన్‌సింగ్‌ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం దత్తాత్రేయతో కలసి సింగ్ విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణలో కేంద్ర బృందాలు పర్యటించాయి. ఆ సమయంలో టీ సర్కార్ కరువు నష్టం అంచనా రూ.2,500 కోట్లుగా పేర్కొంది. తర్వాత రూ.3 వేల కోట్లని లేఖ పంపింది. దీనిపై అధ్యయనం జరుగుతోంది. నివేదికను ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి అందజేస్తాం. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి వారంలో తెలంగాణకు నిధులు కేటాయిస్తాం’ అని చెప్పారు. ఆరోపణల్లో నిజం లేదు: దత్తాత్రేయ తెలంగాణలో కరువు నివారణకు కేంద్రం ఎలాంటి సహాయం చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని దత్తాత్రేయ అన్నారు. త్వరగా కరువు నిధులు విడుదల చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను ఫోనులో కోరగా ఆయన అందుకు హామీ ఇచ్చారన్నారు. కాగా తెలంగాణకు వెంటనే కరువు సాయం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గురువారం ఉదయం ఆయన రాధామోహన్‌సింగ్‌ను కలిసి కరువుసాయం కోరనున్నారు. -
వర్సిటీ బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం
రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు: రాధా మోహన్‌సింగ్ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీకి శంకుస్థాపన సాక్షి, గుంటూరు: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా కల్పించి నిర్వహణ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని లాం ఫాంలో సోమవారం ఉదయం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాన్ని 500 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,505 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో పోస్టుగ్రాడ్యుయేట్ సెంటర్, సీడ్ అండ్ రీసెర్చ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, వాటర్ టెక్నాలజీ, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, పెస్టిసైడ్ రీసెర్చ్ లేబోరేటరీ, ఫుడ్ ప్రొసెసింగ్, ట్రైనింగ్ కమ్ ఇన్క్యూబేషన్ సెంటర్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చేనెలలో మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. బీపీటీ వరి వంగడంతో ఘనకీర్తి.. కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం బీపీటీ వరి వంగడాన్ని పరిశోధన ద్వారా రూపొందించి రైతాంగానికి అందించిన ఘనత ఈ వర్సిటీకే దక్కుతుందన్నారు. దేశంలో ఉన్న రైతులకు వారి భూమి స్వభావం తెలిపే సాయిల్ హెల్త్ కార్డు ప్రతిరైతు జేబులో ఉండేలా రూ.580 కోట్లతో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాలు చూసే సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు రాధామోహన్‌సింగ్ ప్రకటించారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న పలు ఇన్స్టిట్యూషన్స్ గురించి వాటికి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు.