కొత్తగా 16 ఈ–నామ్‌ మార్కెట్లు | The newly created 16 e-Nam markets | Sakshi
Sakshi News home page

కొత్తగా 16 ఈ–నామ్‌ మార్కెట్లు

Published Thu, Jul 6 2017 3:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

కొత్తగా 16 ఈ–నామ్‌ మార్కెట్లు

కొత్తగా 16 ఈ–నామ్‌ మార్కెట్లు

- రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 మార్కెట్లకు అదనం.. కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ వెల్లడి
తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందుకు ప్రశంసలు
ఈ–నామ్‌లో ఇంటర్‌ మార్కెటింగ్‌ ప్రవేశపెట్టింది తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు  
 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా 16 ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్లు (ఈ–నామ్‌) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ–నామ్‌ను అమలు చేస్తున్న రాష్ట్రాల మంత్రులతో కేంద్ర మంత్రి బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా 16 మార్కెట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 ఈ–నామ్‌ మార్కెట్లలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందుకు ప్రశంసించారని తెలిపారు. మార్కెట్లను మెరుగ్గా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై సమావేశంలో చర్చించామన్నారు. ఉత్పత్తుల అమ్మకాల సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించినట్లు హరీశ్‌రావు తెలిపారు.

రైతులు రెండు, మూడు పంటలు తెస్తే ఒకే లాట్‌లో అమ్ముకునే సౌకర్యం కల్పించాలని సూచించామన్నారు. ఈ–నామ్‌ మార్కెట్ల నిర్వహణకు ఒక్కో మార్కెట్‌కు ఏటా రూ. 30 లక్షలు ఇస్తున్న కేంద్రం ఈ ఏడాది నుంచి రూ. 75 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ–నామ్‌ ద్వారా ఇంటర్‌ మార్కెటింగ్‌ను ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. జడ్చర్ల–మహబూబ్‌నగర్, కరీంనగర్‌– చొప్పదండి మార్కెట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తూ వరి కొనుగోళ్లు జరుపు తున్నట్లు వివరించారు. గోడౌన్ల నిర్మాణానికి కేంద్రం తరఫున రెండో విడతగా ఇవ్వాల్సిన రూ. 183 కోట్లను విడుదల చేయాలని రాధామోహన్‌ సింగ్‌ను కోరినట్లు హరీశ్‌ చెప్పారు. తెలంగాణలో రూ. 1,024 కోట్లతో 17 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోడౌన్లను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణలో ఈ– నామ్‌ను సక్రమంగా అమలు చేయట్లేదంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన విమర్శలను హరీశ్‌రావు కొట్టిపారేశారు. ఈ–నామ్‌ మార్కెట్లు సరిగ్గా పనిచేయకపోతే నిజామాబాద్‌ మార్కెట్‌కు జాతీయ స్థాయి అవార్డు ఎలా దక్కిందని ప్రశ్నించారు.
 
మరో 66 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: హరీశ్‌రావు 
తెలంగాణలో ఈ ఏడాది పత్తి సాగు 20 శాతం అధికంగా ఉన్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోళ్ల కోసం ఇప్పటికే ఉన్న 84 కేంద్రాలకు అదనంగా 66 కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కలసి మంత్రి హరీశ్‌రావు కోరారు. వర్షాల వల్ల రంగు మారిన పత్తికి నిర్దిష్ట ధరను నిర్ణయించి సీసీఐ ద్వారానే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్ర జౌళిశాఖ అదనపు కార్యదర్శి పుష్పా సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు. రైతులకు బార్‌ కోడ్‌ ఆధారిత గుర్తింపు కార్డులను జారీ చేసి కోనుగోళ్లు చేస్తుండటంపై కేంద్రం ప్రశంసించినట్లు హరీశ్‌రావు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement