సమాజంతో చెలిమి.. పరిశోధనలకు బలిమి
ఏఎన్‌యూ : విశ్వవిద్యాలయాలు, సమాజం సమన్వయంతో ముందుకు సాగితే ఉత్తమ పరిశోధనలకు అవకాశం ఉంటుందని, ఆ పరిశోధనల ద్వారా సాధించే ఫలాలు సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటాయని డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, చెన్నైకి చెందిన డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్’ సమావేశాల్లో భాగంగా రెండవరోజు మంగళవారం ‘టెక్నాలజీ-రీసెర్చి’ అనే అంశంపై స్వామినాథన్ మాట్లాడారు.
ప్రస్తుతం వైద్యరంగంలో మెడికల్ బయోటెక్నాలజీ అభివృద్ధి చెంది క్లోనింగ్ వంటి వినూత్న ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే వీటివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. క్లోనింగ్ విధానంలో వస్తున్న నైతిక సమస్యలను అధిగమించే దిశగా యువ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలన్నారు.
కొన్ని యూనివర్సిటీల్లో హ్యూమన్ జెనిటిక్స్ వంటి విభాగాల్లో ప్రాజెక్టులు జరుగుతున్నాయన్నారు. ఇవి మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అన్ని విశ్వవిద్యాలయాలు గుర్తించాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతున్న న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల ఆవశ్యకత ఆధునిక పరిజ్ఞానం దృష్ట్యా తప్పనప్పటికీ వాటి వల్ల సంభవించే దుష్పరిణామాలను ఎదుర్కొనే దిశగా పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు.
టెక్స్‌టైల్స్ తదితర పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలను తగ్గించే అంశాలపై పరిశోధనలు జరగాలన్నారు.
జీవరాశుల మనుగడపై యువత దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన జీవరాశులు అభివృద్ధి చెందే విధంగా యువ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆనంద్‌చక్రి వంటి వారిని ఈ రంగంలో యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు , పరిశోధనా కేంద్రాల నుంచి యువతీయువకులు పాల్గొన్నారు.