ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది. వీసీ ఆచార్య కె.వియన్నారావు అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాలకమండలి సమావేశం వివరాలను ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య ఎ.వి.ఎ.దత్తాత్రేయరావు వర్సిటీలో విలేకర్లకు వెల్లడించారు. బ్యాక్‌లాగ్ అధ్యాపక, అధ్యాపకేతర నియమకాలకు సాంఘిక సంక్షేమశాఖ అనుమతి తీసుకుని నోటిఫికేషన్ జారీ చేయాలని పాలకమండలి సూచించింది. అవుట్ సోర్సింగ్ విధానంలో 20 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐదుగురు స్టెనోగ్రాఫర్ల నియామకాలను నిబంధనలకు అనుగుణంగా చేపట్టేందుకు అనుమతినిచ్చారు. వర్సిటీ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొత్త కాంట్రాక్ట్‌కు పాలకమండలిలో ఆమోదం లభించింది. ఏఎన్‌యూ ఒంగోలు పీజీ సెంటల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎమ్మెస్సీ మాథమాటిక్స్, బీపీఈడీ కోర్సుల నిర్వహణకు అనుమతించారు. లైఫ్‌లాంగ్ లెర్నింగ్ విభాగాధిపతి ఆచార్య పి.శ్యామత్రిమూర్తి, విశ్రాంతాచార్యులు వి.సుందరరామశాస్త్రిలు ఏఎన్‌యూకి రాక ముందు ఇతర విశ్వవిద్యాలయాల్లో పని చేసిన సర్వీసును కలిపేందుకు ఆమోదం తెలిపారు.
నివేదికల పరిశీలన దాటవేతే!
వర్సిటీలో వివిధ కుంభకోణాలు, అవినీతి ఘటనలతో సంబంధం ఉన్న ఉద్యోగులపై శాఖాపరమైన విచారణకు వర్సిటీ కమిటీలను నియమించింది. ఆ కమిటీల నివేదికలపై పాలకమండలిలో ఎలాంటి చర్చ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగానే వీటిపై నిర్ణయాన్ని సాగదీస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మౌలిక వసతుల కల్పనకు ఆమోదం..
రూ. 13.52 కోట్లతో విదేశీ విద్యార్థుల వసతిగృహం నిర్మాణానికి, రూ. 1.25 కోట్లతో వర్సిటీలోని హిందీ భవన్‌పై రెండో అంతస్తు నిర్మాణానికి, రూ. 40 లక్షలతో ఆర్ట్స్ బ్లాక్, రూ. 31.2 లక్షలతో కెమిస్ట్రీ భవనం, రూ. 36 లక్షలతో ఇందిరా ప్రియదర్శిని బాలికల వసతిగృహం ఆధునికీకరణకు ఆమోదం తెలిపారు. రూ. 33 లక్షలతో ఒంగోలు పీజీ సెంటర్లో లైబ్రరీ భవనంపై అంతస్తు నిర్మాణానికి, రూ. 1.30 కోట్లతో ఒంగోలులోని పేర్నమిట్టలో ఉన్న ఏఎన్‌యూ పీజీ సెంటర్ స్థలంలో అకడమిక్ బిల్డింగ్ నిర్మాణానికి, ఏఎన్‌యూలో సోలార్ పవర్ జనరేషన్ స్టేషన్ ఏర్పాటుకు, రూ. 26.51 లక్షలతో డైక్‌మెన్ ఆడిటోరియంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసేందుకు పాలకమండలి అనుమతిచ్చింది.