ఖరీఫ్ ప్రారంభంలోనే జిల్లా అంతా మంచి వర్షాలు పడిన నేపథ్యంలో విత్తుకు తొందరపడొద్దని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త ఎం.జాన్‌సుధీర్ సూచించారు.
ఖరీఫ్ ప్రారంభంలోనే జిల్లా అంతా మంచి వర్షాలు పడిన నేపథ్యంలో విత్తుకు తొందరపడొద్దని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త ఎం.జాన్‌సుధీర్ సూచించారు. మంగళవారం ఆయన న్యూస్‌లైన్ తో మాట్లాడుతూ.. ఈ సమయంలో పొలాలను బాగా దుక్కులు చేసుకోవడం మంచిదన్నారు. దీని వల్ల పంటకాలంలో పైర్లకు ఆశించే తామర పురుగులు, ఆకుమచ్చ తెగుళ్లు, నల్లదోమ, వేరుకుళ్లు వంటి చీడపీడలను నివారించుకునే అవకాశం ఉందన్నారు. వేరుశనగ విత్తుకునేందుకు జూలై మాసమంతా మంచి అదునన్నారు. జూన్ 15 తర్వాత ముందస్తు విత్తు చేపట్టవచ్చన్నారు. జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కదిరి-6, కదిరి-9, నారాయణి, ధరణి రకాలు మంచివన్నారు. వీటి పంట కాలం 100 నుంచి 110 రోజులుంటుందని, బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయన్నారు. కే 6 రకం అందుబాటులో ఉన్నందున 50 నుంచి 60 శాతం మంది రైతులు ఈ రకం విత్తనాలు సిద్ధం చేసుకున్నారని, తిరుపతి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అభివ ృద్ధి చేసిన ధరణి రకాన్ని కొంత వరకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆముదం, పత్తి, కంది, పెసర, అలసంద, కొర్ర, సజ్జ వంటి పంటలు కూడా జూన్ 15 తర్వాత విత్తుకోవడం మేలన్నారు.
ఆముదం పంటపై రైతులు దృష్టి పెట్టిన నేపథ్యంలో క్రాంతి, హరిత, జ్యోతి, జ్వాల వంటి సూటి రకాలు వేసుకోవచ్చన్నారు. జీసీహెచ్4, పీసీఎస్111, పీసీఎస్222 అనే కొత్త హైబ్రిడ్ రకాలు నీటి ఆధారంగా వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కందుల్లో ఎఆర్‌జీ 41, పీఆర్‌జీ-158 రకాలు మంచివన్నారు. నల్లరేగడి భూముల్లో ప్రస్తుతం దుక్కులు చేసుకుని జూన్ రెండో వారంలో స్వల్పకాలిక రకాలైన కొర్రపంటను వేసుకుంటే రెండు పంటలు తీసుకునే వీలుందన్నారు. సూర్యనంది (75 రోజులు), శ్రీలక్ష్మి (80-83 రోజులు) రకాలు మంచివన్నారు. సెప్టెంబర్ మొదట్లో పంట తొలగించి అక్టోబర్‌లో రెండో పంటగా పప్పుశనగ వేసుకోవచ్చన్నారు.