రాష్ట్ర మంత్రికి తేల్చి చెప్పిన కేంద్ర వ్యవసాయ మంత్రి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రీయ వ్యవసాయ విశ్వ విద్యాలయం వస్తోందని ఇప్పటివరకు జరిగిన ప్రచారం, పాలకులు చేసిన హడావుడి అంతా ఉత్తదేనని స్పష్టమైంది. యూనివర్సిటీ అక్కడ, ఇక్కడ అంటూ స్థల పరిశీలనలు, క్షేత్ర స్థాయి నివేదికలంటూ చేసిందంతా కేవలం హంగామా మాత్రమేనని వెల్లడైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయమే ఏర్పాటు కాబోతుందని తేలింది. ఇంత గందరగోళం ఎందుకు జరిగిందనే దానిపై అధికార వర్గాలు చెబుతున్న దాని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకోసం తొలి విడతగా 200 కోట్ల రూపాయలను కూడా ప్రతిపాదించారు. దీంతో పాలకులు రాష్ట్రానికి మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం వస్తుందనుకున్నారు. దీని ఏర్పాటుపై మల్లగుల్లాలు పడ్డారు.
చివరకు గుంటూరు జిల్లా లాంఫారంలో పెట్టబోతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈలోగా కేంద్రం తన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రాలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 50 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వ్యవహారమై స్పష్టత లేకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మంత్రి దృష్టికీ విషయాన్ని తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యవసాయ సమస్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాథామోహన్‌సింగ్‌తో భేటీ అయినప్పుడు చర్చిద్దామని మంత్రి చెప్పిన మీదట అధికారులు ఇటీవల ఢిల్లీలో సంబంధిత శాఖాధికారులను వివరణ కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండు కానుందని, ఆంధ్రప్రదేశ్‌లో దాని భవనాల నిర్మాణానికే రూ.50 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న అంశాన్ని తమరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో రాష్ర్ట మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అవాక్కయ్యారు.
కేంద్ర వ్యవసాయ వర్సిటీ ఉత్తదే!
Published Sat, Aug 2 2014 12:46 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement