ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్
అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్‌లు
అధిక రేట్లున్నా తగ్గేదేలే అంటున్న కస్టమర్లు
తక్కువ కొలెస్ట్రాల్ గల నెయ్యి, వంట నూనెలు.. రోగనిరోధక శక్తిని పెంచే గోధుమ పిండి, బియ్యం.. విటమిన్లతో కూడిన టీ పొడి.. ఐరన్–విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉప్పు.. ఇలా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలన్నీ ఇప్పుడు ఆరోగ్య మంత్రం జపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను నివారించే ప్రీమియం ప్రోడక్టులకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలకు దండిగా అదనపు ఆదాయం సమకూరుతోంది.
గజిబిజి నగర జీవితం.. జీవనశైలి ఆరోగ్య సమస్యల ప్రభావంతో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధపెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ప్రోడక్టులు, చిరు ధాన్యాలకు తోడు ఆరోగ్యాన్ని కాపాడే ఉత్పత్తుల పేరుతో ఫంక్షనల్ ఫుడ్స్‌పై ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. తమ ప్రస్తుత ప్రోడక్ట్ జాబితాలో ఈ ప్రీమియం ఉత్పత్తులను చేర్చడం ద్వారా సరికొత్త వ్యూహానికి తెరతీశాయి.
ఐటీసీ, అదానీ విల్మర్, టాటా కన్జూమర్, బిగ్‌బాస్కెట్, ఇమామీ ఆగ్రోటెక్ సహా పలు బడా కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఐటీసీ ‘రైట్ షిఫ్ట్’ అనే కొత్త ఫుడ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 40వ పడిలోకి అడుగుపెట్టిన వారి కోసం ప్రత్యేకంగా మీల్స్, డ్రింక్స్, స్నాక్ ఉత్పత్తులను అందిస్తోంది. దీంతోపాటు తక్కువ కొలె్రస్టాల్ నెయ్యి వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సాధారణంగా విక్రయించే ఉత్పత్తుల రేంజ్‌తో పోలిస్తే వీటి రేటు 26 శాతం మేర ఎక్కువ కావడం విశేషం.
అయినాసరే, కస్టమర్ల నుంచి డిమాండ్ బాగానే ఉండటం గమనార్హం. ఇక మధుమేహం (డయాబెటిక్) విషయంలో అప్రమత్తంగా ఉండేవారు, ఇమ్యూనిటీ బూస్టర్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని అదానీ విల్మర్ కొత్త వంటనూనెను తీసుకొచి్చంది. సాధారణ సన్‌ఫ్లవర్ నూనె కంటే దీని ధర 22–46 శాతం అధికం! అలాగే డయాబెటిక్ వినియోగదారుల కోసం త్వరలోనే తక్కువ గ్లయిసెమిక్ ఇండెక్స్ బియ్యం, గోధుమ పిండి వంటి ప్రీమియం ప్రోడక్టులను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది.
ఫిట్‌నెస్.. లైఫ్ స్టయిల్...
నగరాల్లో బిజీగా ఉంటూ... లైఫ్ స్టయిల్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసే కన్జూమర్లు ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఆరోగ్యకరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మాలిక్ చెబుతున్నారు. ‘ప్రీమియం ఆహారోత్పత్తుల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఇటువంటి ప్రత్యేకతను కోరుకునే సంపన్న కన్జూమర్ల సంఖ్య 3 కోట్లకు పైగానే ఉంది.
పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, రుచి, నాణ్యత వంటి ప్రయోజనాలను అందించే విలువ చేకూర్చిన, వినూత్న ఉత్పత్తులకు అధిక రేట్లను చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ కంపెనీ బిగ్ బాస్కెట్ తక్కువ జీఐ గల బంగాళాదుంపలను 21% ఎక్కువ రేటుతో విక్రయిస్తోంది. ఇక జీఐ తక్కువగా ఉన్న చక్కెర రేటయితే ఏకంగా 120 శాతం అధికం కావడం విశేషం. ఖపాలీ గోధుమ లేదా ఎమ్మర్ గోధుమలో ఫైబర్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. పలు బ్రాండ్‌లు ఈ గోధుమ పిండిని కేజీ రూ.150–250 మధ్య విక్రయిస్తున్నాయి. అంటే సాధారణ గోధుమ పిండితో పోలిస్తే 3–5 రెట్లు ఎక్కువ.
డిమాండ్ ఫుల్.. సరఫరా డల్
కొన్నిసార్లు తగినంత సరఫరా లేకపోవడం వల్ల కూడా రేటు భారీగా పెరిగేందుకు దారితీస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఉదాహరణకు చాలా తక్కువ మంది రైతులు మాత్రమే తక్కువ జీఐ గల బంగాళాదుంపలను పండిస్తున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ధరకు అమ్మాల్సి వస్తోందని బిగ్‌బాస్కెట్ చీఫ్ మర్చెండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ చెప్పారు. మరోపక్క, ఇటువంటి ప్రీమియం ప్రోడక్టుల తయారీ కోసం టెక్నాలజీ వినియోగం వల్ల కూడా ధర పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రీమియం బ్రాండ్ల పేరుతో జేబు గుల్ల చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, అమూల్ బ్రాండ్ రూ.650కి కేజీ నెయ్యిని విక్రయిస్తుండగా... వేరే బ్రాండ్‌లు ‘ఏ2 నెయ్యి’ పేరుతో కేజీ రూ.2,500కి పైగా ధరకు విక్రయిస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇలాంటి ప్రోడక్టులపై ఉక్కుపాదం మోపుతోంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment