న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలు పరిష్కారం కాగలవని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అంతేగాక తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రోగాలను కూడా ఇవి దూరం చేస్తాయన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో చిరుధాన్యాల వాడకం 5 నుంచి 6 శాతమే ఉంది. దీన్ని ఇతోధికంగా పెంచి, ఆహారంలో చిరుధాన్యాలు తప్పనిసరిగా మారేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు.
శనివారం ఇక్కడ ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును ఆయన ప్రారంభించారు. అందులో పాల్గొంటున్న దేశ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం నేడు రెండు రకాల ఆహార సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దక్షిణార్ధ గోళంలోని దేశాల్లోనేమో పేదలకు తినడానికి తిండి దొరకని దుస్థితి! ఉత్తరార్ధ గోళంలోనేమో తప్పుడు ఆహారపుటలవాట్ల వల్ల రోగాలు కొనితెచ్చుకుంటున్న పరిస్థితి. ఒకచోట ఆహార సంక్షోభం. మరోచోట అలవాట్ల సమస్య.
సాగులో రసాయనాల మితిమీరిన వాడకంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. వీటన్నింటికీ చిరుధాన్యాలు చక్కని పరిష్కారం’’ అని వివరించారు. పలు రాష్ట్రాలు ప్రజా పంపిణీ పథకంలో చిరుధాన్యాలను కూడా చేర్చాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలూ దీన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా చిరుధాన్యాలకు స్థానం కల్పించాలన్నారు. అలాగే పొలం నుంచి మార్కెట్ దాకా, ఒక దేశం నుంచి మరో దేశం దాకా చిరుధాన్యాలకు పటిష్టమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
చిన్న రైతులకు భాగ్యసిరి
చిరుధాన్యాలు గ్రామాలు, పేదలతో ముడిపడి ఉన్నాయని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు అవి సిరులు కురిపించగలవని అభిప్రాయపడ్డారు. ‘‘దాదాపు 2.5 కోట్ల మంది రైతులు వీటిని పండిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన చిరుధాన్యాల ప్రచారం వారికి ఎంతో మేలు చేయనుంది. వీటిని రసాయనాల అవసరం లేకుండా, తక్కువ నీటితో పండించవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల సమస్యకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. గనుకనే వీటికి శ్రీ అన్న అని నామకరణం చేశాం’’ అని చెప్పారు.
చిరుధాన్యాలు దేశమంతటా సమగ్ర ఆహారపుటలవాట్లకు మాధ్యమంగా మారుతున్నాయన్నారు. భారత్ తన వ్యవసాయ పద్ధతులను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. చిరుధాన్యాలపై 500కు పైగా స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో అందుకు గుర్తుగా పోస్టల్ స్టాంపును, 75 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment