
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున ఏడాది పొడవునా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ చెప్పారు. అందుకు తగినట్టుగా 100 హెక్టార్లకు ఒకటి చొప్పున పంటల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆయన మంగళవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణనిస్తూ, భవిష్యత్‌లో మంచి ధర లభించేలా కృషిచేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాల ఏర్పాటు కోసం జిల్లాల్లోని జిల్లా పర్చేజింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీపీఎంసీ) ద్వారా యంత్ర పరికరాల సూచిక ధరలను ఖరారు చేయాలని చెప్పారు.
పీఎం కిసాన్ 13వ విడత ఆర్థికసాయాన్ని సాధ్యమైనంత ఎక్కువమందికి అందించేందుకు వీలుగా రైతుల ఈ–కేవైసీని ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. రబీలో సాగుచేసి కోతకు వచ్చే శనగలు, మినుములు, పెసలు, ఇతర పంటల ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉన్న ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 30వ తేదీలోగా, మిగిలిన జిల్లాల్లో 15వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.