చిరుధాన్య పంటల్లో 180 రోజుల పంట అరిక. అరికను ఆరుద్ర కార్తెలో విత్తుకుంటే మేలని చెబుతారు. పుష్యమి కార్తె వచ్చి కూడా వారమైంది. చలికాలానికి ముందే అరిక పంట నూర్పిడి చేయాలి. లేదంటే మంచుకు బూజు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. తగినంత వర్షం పడి, దుక్కి చేసి సిద్ధంగా ఉన్న భూమిలో అయితే ఒకటి, రెండు రోజుల్లో అయితే అరిక విత్తుకోవచ్చు. ఇంకా ఆలస్యమైతే అరిక విత్తుకోకుండా ఉంటేనే మంచిదని వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్ తెలిపారు.
అరిక విత్తనాలు ఉంటే గుడ్డ/గోనె సంచిలో కట్టి భద్రంగా దాచుకుంటే వచ్చే ఏడాది విత్తుకోవచ్చన్నారు. కొర్ర, సామ, ఊద, అండుకొర్ర వంటి సిరిధాన్యాలు స్వల్పకాలిక పంటలు కాబట్టి ఇప్పుడు నిస్సందేహంగా విత్తుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పంటలు కోసిన తర్వాత గూడు వేసి.. కనీసం 20 రోజుల నుంచి 2 నెలల వరకు మాగనిచ్చిన తర్వాతే నూర్చుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేయడం ద్వారా కర్రలో బలాన్ని కూడా పీల్చుకోవడం వల్ల సిరిధాన్యాల నాణ్యత, బరువు కూడా పెరుగుతుందని, గడ్డి సైతం పశువులు తినడానికి బాగుంటుందని విజయకుమార్ (98496 48498) చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment