చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ | Andhra Pradhesh ranks seventh in the exports of small grains | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ

Published Mon, Aug 21 2023 5:39 AM | Last Updated on Mon, Aug 21 2023 5:56 AM

AP ranks seventh in the exports of small grains - Sakshi

సాక్షి, అమరావతి : చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్‌ ఉందని కూడా పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. దేశం నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్‌ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది.ఇందులో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు 17.8 శాతం, సౌదీ అరబ్‌కు 13.7 శాతం, నేపాల్‌కు 7.4 శాతం, బంగ్లాదేశ్‌కు 4.9 శాతం, జపాన్‌కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది.

ఇతర దేశాల్లో వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు స్థానిక వినియోగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని వివరించింది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్‌–ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్టస్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఈడీఏ) చిరుధాన్యాల ఎగుమతిని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు  ఎగుమతుదారులకు సహాయం అందిస్తుందని తెలిపింది. 

అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం..
ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు, అకడమిక్‌–రీసెర్చ్‌ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్‌ ఫోరమ్‌ (ఈపీఎఫ్‌)ను ఏర్పాటుచేసినట్లు కూడా తెలిపింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది.

 

ఉత్పత్తి, వినియోగం పెంపు..
అలాగే, స్థానికంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేప­ట్టాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్య­ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి రాష్ట్ర మిల్లెట్‌ మిషన్లను అమలుచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత రాయబార కార్యాల­యాలు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది.

అలాగే, ప్రభుత్వోద్యో­గులు, అధికారుల్లో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాల్లో మిల్లెట్‌ స్నాక్స్‌ను, డిపార్ట్‌మెంటల్‌ క్యాంటీన్లలో మిల్లెట్‌ ఆధారిత ఆహార పదార్థాలను చేర్చాలని సూచించినట్లు కేంద్రం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement