పౌర సరఫరాల సంస్థలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లలో అక్రమాలు
చక్రం తిప్పుతున్న ఓ మహిళా మేనేజర్.. భారీగా ముడుపులు
కూటమి ప్రభుత్వ అనుకూల వ్యక్తులకుటెండర్లు దక్కేలా పావులు
ఓ మంత్రి, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రమేయం
టెక్నికల్ బిడ్‌లో క్వాలిఫై చేసిన సంస్థను ఆ తర్వాత డిస్‌క్వాలిఫై చేసిన వైనం
పలు జిల్లాల్లో సింగిల్ టెండర్లతోనే కాంట్రాక్టులకు రంగం సిద్ధం
పౌర సరఫరాల సంస్థకు ఆర్థికంగా భారీ నష్టం
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల టెక్నికల్ బిడ్‌లో క్వాలిఫై అయినట్టు ప్రకటించిన కాంట్రాక్టర్లను మళ్లీ డిస్‌క్వాలిఫై చేయడం పెను దుమారం రేపింది. ఓ మహిళా మేనేజర్ నేతృత్వంలో ఈ కాంట్రాక్టులను అధికార కూటమి నేతల అనుంగులకు అప్పజెప్పేందుకు నిబంధనలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు.
పౌర సరఫరాల సంస్థ బఫర్ గోడౌన్‌ల నుంచి మండల గోడౌన్‌లకు నిత్యావసరాలు రవాణా చేసేందుకు పిలిచిన ఈ టెండర్లలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు సమాచారం. ఈ మేనేజర్, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కలిసి టెండర్ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టించి, వీలైనన్ని జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్‌తోనే అనుకూలమైన వారికి కాంట్రాక్టు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత క్వాలిఫై చేసిన ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీని తర్వాత డిస్‌క్వాలిఫై చేసినట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురంలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లు వేసింది.
రోజులు గడిచినా టెక్నికల్ బిడ్‌లో ఎటువంటి రిమార్క్ చూపించని అధికారులు ఫైనాన్షియల్ బిడ్‌కు వచ్చేసరికి సంస్థ నిర్వహకులపై పోలీసు కేసులు ఉన్నాయంటూ ఊహాజనిత సాకును చూపించి తొలుత కర్నూలు జిల్లాలో డిస్‌క్వాలిఫై చేశారు. తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి, టెండర్లలో పాల్గొనేలా ఆర్డరు తెచ్చుకొంది.
రీ టెండర్‌కు ఎందుకు వెళ్లట్లేదు?
నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ వస్తే రీ టెండర్‌కు వెళ్లాలి. టెండర్లలో టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్‌కు వెళ్తాయి. సరైన పత్రాలు, అర్హతలు లేని టెండర్లు డిస్‌క్వాలిఫై అవుతాయి. ఇక్కడే అధికారులు చాకచక్యంగా చాలా జిల్లాల్లో ఫైనాన్షియల్ బిడ్‌కు అర్హత పొందిన టెండర్లు ఒక్కటే (సింగిల్) ఉండేలా చక్రం తిప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటెండర్‌కు వెళ్లకుండా టెక్నికల్ బిడ్‌లో డిస్‌క్వాలిఫై అయిన టెండర్లను కూడా కలిపి చూపించి, ఎక్కువ టెండర్లు వచ్చినట్టు మాయ చేస్తున్నారు.
పోటీ ఉంటే షెడ్యూల్ ఆఫ్ రేట్ల (ఎస్‌వోఆర్) కంటే తక్కువ రేట్లకు కోట్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ బిడ్‌లో సింగిల్ టెండర్ ఉంటే అసలు పోటీనే ఉండదు. ఫలితంగా కాంట్రాక్టరు అధిక రేట్లను కోట్ చేస్తారు. ఇప్పుడు స్టేజ్–1 టెండర్లలోనూ ఎస్‌ఓఆర్‌కు మించి 20 నుంచి 25 శాతం అధికంగా రేట్లు కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సింగిల్ టెండర్లు ఖరారైతే పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
దీన్ని పట్టించుకోని ఆ మేనేజర్.. సింగిల్ టెండర్లను ఒకే చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడితో ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ టెండర్లు దాఖలు చేసిన నాలుగు జిల్లాలతో పాటు కర్నూలు, వైఎస్సార్‌లో జిల్లాల టెండర్లను టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పేందుకు సర్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ట్రాన్స్‌పోర్టు సంస్థకు సరైన ఫర్మ్ అంటూ లేదు. అసలు యజమాని పేరుపై ఒక్క వాహనం కూడా లేదు.
ఆమెదంతా క్విడ్ ప్రోకోనే..
ఈ టెండర్ల ప్రక్రియలో మహిళా మేనేజర్‌తో పాటు ఇటీవల బదిలీపై ప్రధాన కార్యాలయానికి వచ్చిన గ్రేడ్–1 ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆ ఉద్యోగికి టెండర్లతో సంబంధం లేకపోయినా, మేనేజర్‌కు సహకరిస్తూ ముడుపులు మూటగడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి.
ఇలా సింగిల్ టెండర్లను ఖరారు చేయించేందుకు రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి తోడు ఆ మహిళా మేనేజర్ కోనసీమ జిల్లాకు డీఎంగా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు ఉండటంతో.. తూర్పుగోదావరి జిల్లాకు డీఎంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లాలో మునుపటి స్టేజ్–1 టెండర్ కాంట్రాక్టర్, తాడేపల్లిగూడేనికి చెందిన కూటమి నాయకుడొకరు సహకరిస్తున్నట్లు తెలిసింది.
ఇందుకు ప్రతిగా ఆయనకు తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో సింగిల్ టెండర్ ద్వారా రవాణా కాంట్రాక్టును అప్పజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అన్నమయ్య, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ సింగిల్ టెండర్లనే ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment