ఏసీబీ వలలో సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్
Published Tue, Sep 17 2013 12:12 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
సాక్షి, సంగారెడ్డి: పౌర సరఫరాల సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి.. సహోద్యోగి నుంచి భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని పౌరసరఫరాల సంస్థ డీఎం కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్(జనరల్) ఎ.సత్యనారాయణ సోమవారం స్థానిక సిమ్లా బేకరీలో రూ.1.25 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. నారాయణఖేడ్‌లోని మండల్ లెవల్ స్టాక్(ఎంఎల్‌ఎస్) పాయింట్ ఇన్‌చార్జి, అసిస్టెంట్ గ్రేడ్-2 అధికారి ఆర్. నరసింహం నాలుగు నెలల కింద హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. పౌర సరఫరాల సంస్థ ఎండీ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులనే ఏఎం ఎ.సత్యనారాయణ తొక్కిపెట్టి ఆయనను రిలీవ్ చేయకుండా మోకాలడ్డు పెట్టారు. కోరుకున్న చోటికి బదిలీ చేయించుకున్న అధికారిని రిలీవ్ చేయడానికే ఏఎం సత్యనారాయణ ఏకంగా రూ.2 లక్షలు డిమాండు చేయడం.. జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో పరాకాష్టకు చేరుకున్న అవినీతికి అద్దం పడుతోంది.
బేరసారాల తర్వాత రూ.లక్షా 25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న నరసింహం.. చివరి క్షణంలో ఆదివారం ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. రెండేళ్లుగా ఈ కార్యాలయం లో ఏఎంగా పనిచేస్తున్న సత్యనారాయణ హయంలో వెలుగుచూసిన, వెలుగుచూడని అక్రమాలు ఎన్నో జరిగాయి. రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉన్నతాధికారులకు వాటాలు పంచి మచ్చిక చేసుకోవడంతో ఫిర్యాదులు బుట్టదాఖలైనట్లు విమర్శలున్నాయి. ఐకేపీ కేంద్రాల నుంచి రైస్ మిల్లుల మధ్య దూరాన్ని భారీగా పెంచేసి రవాణా కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా బిల్లులు చెల్లించినట్లు ఫిర్యాదులు వెళ్లినా కనీసం విచారణ జరగలేదు. రూపాయికే కిలో బియ్యం పథకం వచ్చిన తర్వాత పీడీఎస్‌లో అక్రమాలు తారస్థాయికి చేరుకున్నాయి. అసంఖ్యాకంగా ఉన్న బోగస్ కార్డులకు కేటాయిస్తున్న బియ్యం కోటాను రేషన్ డీలర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జీలు సిండికేట్‌గా మారి దొడ్డిదారిన రైస్ మిల్లులకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
అదే బియ్యాన్ని డబుల్ పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించడం ద్వారా మిల్లర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నెల నెల మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. పక్కదారి పట్టించిన బియ్యాన్ని మళ్లీ ప్రభుత్వానికే రూ.13కు రిసైక్లింగ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి. పది నెలల కింద ఓ మిల్లులో 2,400 టన్నుల పీడీఎస్ బియ్యం దొరికినా పునర్విచారణ పేరుతో మళ్లీ అదే మిల్లర్‌కు తిరిగి సరుకును అప్పగించడం దీనికి సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇలా అవినీతి పెచ్చురిల్లిపోవడంతోనే.. సంపాదన రేంజ్ బాగా తెలిసే ఓ కిందిస్థాయి అధికారిని రిలీవ్ చేయడానికి ఏఎం సత్యనారాయణ ఏకంగా రూ.2 లక్షల డిమాండు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఒక చిన్న కారణానికి ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడడం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని దాడులకు నేతృత్వం వహించిన ఏసీబీ డీఎస్పీ ఎన్. సంజీవ్‌రావు విలేకరుల ముందు ఆశ్చర్యం ప్రకటించడం గమనార్హం.
Advertisement
Advertisement