రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లో అవినీతి వ్యవహారంలో లెక్క తేలింది. రూ.40 కోట్లను స్వాహా చేశారు. 2017–2022 కాలంలో పనిచేసిన నలుగురు డీఎంలకు ప్రత్యక్షపాత్ర ఉంది. మొత్తం 32 మంది స్వాహా పర్వంలో భాగస్వాములయ్యారు. వారిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు. మిగిలిన వారంతా ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు. ఈ తతంగం మొత్తం బ్యాంకు ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైంది. ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సిస్టం ఓటీపీ ద్వారా నగదు కాజేశారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లో అవినీతి వ్యవహారానికి సంబంధించి మూడువారాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రజాధనం స్వాహా విషయం ఒక కొల్కికి వచ్చింది. అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు 2017–2022 వరకూ రూ.40 కోట్లు దారి మళ్లించారని నిర్ధారణైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు పాత్రధారులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చారు. డీఎం స్థాయి అధికారుల బరితెగింపే అందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ప్రభుత్వ చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడం విశేషం. జిల్లా మేనేజర్‌గా పనిచేసిన కృష్ణారెడ్డి, కొండయ్య, రోజ్‌మాండ్, పద్మ ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నట్లు స్పష్టమైంది.
సరైన సమాచారం ఇవ్వకపోవడంతో..
సెప్టెంబర్‌లో ఇంటర్నల్ ఆడిటర్ అక్రమ చలాన్‌ను గుర్తించారు. దానికి చెందిన రికార్డులు కోరడంతో డీఎం కార్యాలయం సక్రమంగా స్పందించలేదు. ఆడిటర్ అనుమానాల నివృత్తి కోసం ప్రయత్నించారు. ఈక్రమంలో డీఎం కార్యాలయాన్ని విజిట్ కోసం వచ్చిన ఎండీ వీరపాండ్యన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన 2021 సంవత్సరం వరకూ ఆడిట్ చేయాలని ఆదేశించారు. దీంతో మరిన్ని దుర్వినియోగ వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. ఇలా ఒక్కో ఏడాది ఆడిట్ చేసుకుంటూ వెళ్తే రూ.40 కోట్లు స్వాహా జరిగినట్లు గుర్తించారు. అదే కాకుండా మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ (బీజీ) తీసుకోవాల్సింది ఉంది. అయితే ఆ స్థానంలో రూ.14.91 కోట్లు పోస్టు డేటెడ్ చెక్కులు తీసుకున్నారు. ఆ మొత్తం కూడా స్వాహా చేశారా? ఆ స్థానంలో చెక్కులు మాత్రమే తీసుకున్నారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇదివరకే 11 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో 32 మందికి ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తేలింది.
నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు
ప్రభుత్వ లావాదేవీలు ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారానే జరగాలి. పైగా వివిధ లావాదేవీలకు అనుగుణంగా డీఎం బ్యాంకు అకౌంట్లు విడివిడిగా ఉండడం తప్పనిసరి. ఇవేమీ పట్టించుకోకుండా సింగిల్ అకౌంట్ మీద లావాదేవీలు నడిపారు. ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీతో నిమిత్తం లేకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా పక్కదారి పట్టించారు. ఆ సమయంలో పనిచేసిన డీఎం స్థాయి అధికారి, బ్యాంకర్ కుమ్మకై ఓటీపీ ద్వారా నగదును పక్కదారి మళ్లించారు. పెద్దమొత్తంలో చెల్లింపు చేపట్టగా దీనికి బ్యాంకర్లు పక్కాగా సహకరించారు. వారి ప్రమేయం ఎంత ఉందో పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
ఇంటర్నల్ ఆడిటర్ల సహకారం
డీఎం కార్యాలయంలో ఇంటర్నల్ ఆడిటర్ల సహకారంతో ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అవినీతి వ్యవహారం నడించింది. డీఎం తన ఖాతాకు వచ్చిన మొత్తం, ఆ ఖాతా నుంచి చేపట్టిన చెల్లింపులకు సంబం«ధించి అందించిన నివేదిక ఆధారంగా ఇంటర్నల్ ఆడిటర్లు సంతకాలు చేసుకుంటూ వెళ్లారు. నిబంధనలు మేరకు చెల్లింపులు చేశారా? ఆ మేరకు ఆక్విడెన్స్‌లు ఉన్నాయా? అర్హులకే ఆ మొత్తం చేరిందా? ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు. దీనిని బట్టి ఇంటర్నల్ ఆడిటర్ల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
ముగ్గురి అరెస్ట్
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి వ్యవహారానికి సంబంధించి పోలీసులు గురువారం రాత్రి సూత్రధారితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు గతనెల 14వ తేదీన 11 మందిపై కేసు నమోదు చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఏఎస్పీ, వేదాయపాళెం పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురు అధికారులు, సిబ్బంది పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలు వారికోసం గాలించాయి. ప్రధాన సూత్రధారి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శివకుమార్‌తోపాటు కేసుతో సంబంధం ఉన్న పవన్, రాజాలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో కీలక సమాచారాన్ని సేకరించారు. ఆ ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.
సీఐడీ లేదా విజిలెన్స్ విచారణకు సిఫార్సు
‘సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లో రూ.40 కోట్లు స్వాహా చేశారు. 2017–2022 వరకూ ఆడిట్ పూర్తి చేసి నివేదిక అందించాం. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ లేదా సీఐడీ విచారణ చేపట్టాల్సిందిగా కోరాం.’ అని జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో 32 మందికి ప్రత్యక్ష్య ప్రమేయం ఉందన్నారు. వారిలో నలుగురు డీఎంలతో సహా 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, ఇదివరకే 11 మందిపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఫ్రీజ్ చేయించామని చెప్పారు. ఎలాంటి క్రయవిక్రయాలు చేపట్టకుండా కట్టడి చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు సిఫార్సు చేశామన్నారు. ఇంత పెద్దఎత్తున గోల్‌మాల్ వ్యవహారాన్ని గుర్తించుకుండా చూసీచూడనట్లు వ్యవహరించిన, గతంలో ఆడిట్ నిర్వహించిన ఇంటర్నల్ ఆడిటర్లపై చర్యలకు సిఫార్సులు చేశామన్నారు. అందుబాటులో రికార్డుల మేరకు ఇప్పటి వరకూ రూ.40 కోట్ల మేర అవినీతి జరిగిందని బహిర్గతమైందన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి, ఎంత మొత్తం దేనికి మంజూరైంది, ఎవరికి చెల్లించారు? ఇంకా ఏమైనా నిధులు స్వాహా అయ్యాయా? తదితర విషయాలు బహిర్గతం కావాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment