సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కుంభకోణంలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ కీలక పాత్రధారిగా వ్యవహరించాడు. నలుగురు మేనేజర్ల హయాంలో అవినీతికి అంతా తానై సూత్రధారిగా నిలిచాడు. అప్పనంగా డబ్బు సంచులు ఇంటికి చేరుతుండడంతో జిల్లా మేనేజర్‌గా విధుల్లో ఉన్న వారు కిమ్మనకుండా భాగస్వామ్యులయ్యారు. మొత్తం విషయం బహిర్గతం కావడంతో తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. తమకేమి తెలియదంటూ ఉన్నతాధికారుల ఎదుట నంగనాచి కబుర్లు చెబుతున్నారు. డీఎం ఓటీపీల ద్వారానే శివకుమార్ నిధులు పక్కదారి పట్టించారు. రూ.40 కోట్లు ప్రజాధనం స్వాహా కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం సీఐడీకి బదలాయించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ లావాదేవీలు ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చెల్లింపులు ఉండాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు అనుమతించారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి తమ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలు మేనేజర్లు నిర్బయంగా చెప్పడంతో కంప్యూటర్ ఆపరేటర్ ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక అకౌంట్లకు ప్రభుత్వ నగదు బదలాయించాడు. ఐదేళ్లుగా ప్రజా«ధనాన్ని పక్కదారి పట్టించి కొల్లగొట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే, మరో 24 మంది ప్రైవేట్ వ్యక్తులు ప్రమేయం ఉండడం విశేషం.
నిస్సంకోచంగా దోపిడీ
ప్రజాధనం దోపిడీ వ్యవహారం ఎప్పటికైనా బహిర్గతం అవుతుందనే విషయం తెలిసీ కూడా నిస్సంకోచంగా దోపిడీ చేయడంలో డీఎంలు కీలకంగా నిలిచారు. ఈ తరహా అవినీతికి తెర తీసిన కృష్ణారెడ్డి నుంచి కొండయ్య, రోజ్‌మాండ్, పద్మ ఇలా ఒకరి తర్వాత మరొకరు నలుగురు డీఎంలు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఇంటర్నల్ ఆడిటర్లను మేనేజ్ చేయవచ్చనే ధీమా, రికార్డులు అందుబాటులో లేకుండా చేస్తామనే ధైర్యంతో ఈ దోపిడీకి తెరతీశారు. కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ చెప్పినట్లు నడుచుకోవడంతో అత్యంత సులువుగా స్వాహా సాధ్యమైంది. ఒక వైపు బ్యాంకర్ల సహకారం, మరో వైపు ఇంటర్నల్ ఆడిటర్లు దన్నుగా నిలవడంతో బయటకు దోపిడీకి మార్గం సుగమం అయింది.
12 డ్యాకుమెంట్లు ఫ్రీజ్
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఫ్రీజ్ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రోణింకి కూర్మనాథ్ ప్రకటించారు. వాస్తవంగా 32 మంది ప్రత్యక్ష పాత్రధారులున్నారు. అయితే వీరిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, మిగతావారంతా ప్రైవేట్ వ్యక్తులే. ఇందులో చేజర్ల దయాకర్ (9 డాక్యుమెంట్లు), సూర్యపవన్ (3 డాక్యుమెంట్లు) పేరిట ఉన్న 12 డాక్యుమెంట్లు మాత్రమే ఫ్రీజ్ చేశారు. నెల్లూరు, కోవూరు, బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న ఆ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం రూ.3 కోట్లు మాత్రమే. బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్లు విలువైన ఆస్తులుగా పలువురు చెబుతున్నారు. పాత్రధారులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తే మిగతా వారి ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయాల్సి ఉంది.
జల్సాలకు అలవాటు పడి..
కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ ఏర్పాటు చేసే పార్టీలకు అలవాటు పడడంతోనే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఊబిలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. మరి కొందరికి వ్యక్తిగత అవసరాలు, బంధువులు శుభకార్యాలకు సైతం డబ్బులు వెచ్చించినట్లు సమాచారం. మరో వైపు బ్యాంకర్లకు కూడా అదే స్థాయిలో ట్రీట్ ఇవ్వడంతో ఎనీటైమ్‌మనీ (ఏటీఎం) లాగా ఉపయోగపడినట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు ఎవరెవరికి ఎంత మొత్తం, ఎక్కడెక్కడ అందించింది.. ఎవరి అకౌంట్లకు ఎంత మొత్తం బదిలీ చేసిందనే వివరాలు పోలీసులకు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.
సీఐడీకి కేసు బదలాయింపు
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నిధులు స్వాహా వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 14న క్రైమ్ నంబర్ 527/2022గా ఐసీపీ సెక్షన్లు 120బీ, 409 మేరకు 11 మందిపై కేసు నమోదు చేశారు. తాజా నివేదిక ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది ప్రమేయం ఉందని వెల్లడియ్యింది. వీరిలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్, పవన్, రాజాం అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరు పరిచారు.
నిందితుల్లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, దాదాపు రూ.40 కోట్లకుపైగా స్వాహాకు గురైనట్లు గుర్తించడంతో మరింత లోతైన విచారణ చేపట్టి కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు సీబీసీఐడీ విభాగాన్ని జిల్లా యంత్రాంగం ఆశ్రయించింది. ఆ మేరకు శుక్రవారం ఎస్పీ విజయారావుతో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న వ్యవహారాన్ని వివరిస్తూ లేఖ రాస్తూనే, ఎఫ్‌ఐఆర్‌తో పాటు, అధికారిక నివేదిక సీబీసీఐడీ ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు లభించిన తర్వాత కేసును బదలాయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment