సాక్షి, విజయవాడ : చౌకధరల దుకాణదారులు పోరుబాట పట్టనున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. తొలిదశలో తెల్లకార్డుదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
బకాయిల మాటేమిటి?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీలర్లకు ప్రభుత్వం రూ.80 కోట్ల బకాయిలు ఉంది. మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం సరఫరా చేస్తే దాని కమిషన్ ప్రభుత్వం చెల్లించట్లేదు. ఏడాదికాలంగా బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం విడుదలచేసి ఆర్థికంగా ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు.
దుకాణాల వద్దకే ఉచితంగా సరకు రావాలి
నిత్యావసర వస్తువులను గోదాము నుంచి రేషన్ దుకాణానికి ట్రాన్స్‌పోర్టు ద్వారా తెచ్చుకోవాలంటే డీలర్లకు రూ.వందల్లో ఖర్చు అవుతోంది. తగినంత ఆదాయం లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో బియ్యం, ఇతర సరకులను గోదాముల నుంచి రేషన్ దుకాణాల వరకు ఉచితంగా (డోర్ స్టెప్ ఫ్రీ డెలివరీ) సరఫరా చేయాలని డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.
ఈ–పోస్ టెక్నీషియన్లను ఏర్పాటుచేయాలి
డీలర్లకు సరకు ఇచ్చే ఎంఎల్‌ఎస్ పాయింట్లు (గోదాముల్లో) ఈ–పోస్ టెక్నీషియన్లు లేకపోవడంతో సరకు డెలివరీలో జాప్యం జరుగుతోంది. ఈ–పోస్ మిషన్ మూడు నాలుగు గంటలు స్తంభించిపోతే సరకు తీసుకునేందుకు డీలర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్లు బాగుచేసే టెక్నీషియన్లను గోదాముల వద్ద అందుబాటులో ఉంచాలి.
గౌరవ వేతనం మంజూరు
ప్రస్తుతం బియ్యం మినహా ఇతర సరకుల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో డీలర్లకు క్వింటా బియ్యానికి రూ.70 కమీషన్ సరిపోవట్లేదు. ఆ స్థానంలో ప్రతినెలా కనీసం రూ.15వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరుతున్నారు. మూడేళ్లుగా అభ్యర్థిస్తున్నా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించలేదు.
- ఇక రేషన్ డీలర్ల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందజేయాలి.
- రేషన్ డీలర్లపై అక్రమంగా బనాయిస్తున్న 6ఏ కేసుల వల్ల వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆ కేసులు సత్వరమే పరిష్కరించాలి.
- కారుణ్య నియామకాల ద్వారా చనిపోయిన రేషన్ డీలర్ల కుటుంబాలకు న్యాయం చేయాలి. ఆర్థికంగా ఆదుకోవాలి.
- చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం రుణంగా ఇప్పించాలి.
ఈనెల నుంచే నిరసనలు
గతనెల నుంచే నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. అయితే, క్రిస్మస్, సంక్రాంతికి ప్రభుత్వం ఇస్తున్న కానుక పేదలకు అందజేయాలని, జన్మభూమిలో భాగస్వామ్యం కావాలని వాయిదా వేశాం. గొల్లపూడిలోని రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం వద్ద కానీ, డీఎం ఆఫీసుల వద్ద కానీ త్వరలోనే నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కాగిత కొండ, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment