సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాలశాఖలో సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 19 నెలల క్రితం ఆ శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలు మొదలయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన చేపట్టిన సంస్కరణలు పలువురి ప్రశంసలు పొందాయి. ఆన్‌లైన్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, కమాండ్ కంట్రోల్ సెంటర్, గోదాముల్లో సీసీ కెమెరాలు, టీ–రేషన్ యాప్, రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలు, జిల్లాల్లో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రేషన్ పోర్టబిలిటీ వంటి చర్యలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ఈ సంస్కరణలతో 19 నెలల్లో ఏకంగా రూ. 1,900 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా జరిగింది. నిఘా బృందాలతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు.
కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాకు ముగింపు పలికారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్ముకుంటున్న ఆరుగురు వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించారు. రేషన్ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చారు. 171 గోదాముల్లో 17,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కేంద్రాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, హైదరాబాద్‌లోని కేంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో అక్రమాలకు చెక్ పెట్టారు. రేషన్ లబ్ధిదారులు తమ జిల్లాలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని తీసుకొచ్చారు.
త్వరలో రాష్ట్రంలో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని విస్తరించనున్నారు. రాష్ట్రంలో 17,200 రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 800 కోట్ల వరకు ఆదా అవుతోంది. కార్డుదారులకు త్వరితగతిన సరుకులు అందించడానికి వీలుగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌లో కనీస మద్దతు ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు, చెల్లింపుల విధానం ప్రాచుర్యం పొందింది. 2016–17 ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో 15 లక్షల మంది రైతుల నుంచి రూ. 11 వేల కోట్ల విలువ చేసే 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట వేశాం
రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్ఫలితాలను సాధించాం. సరుకుల సరఫరా నుంచి పంపిణీ వరకు మొత్తం ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. అర్హులైన పేదలందరికీ సక్రమంగా సరుకులు అందివ్వగలుగుతున్నాం. సాంకేతికతతో అక్రమాలను అరికడుతూనే నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం.
– సీవీ ఆనంద్, పౌర సరఫరాలశాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment