నా వయసు 35. ఈ వేసవిలో ఆఫీసులో ఎక్కువగా ఏసీలోనే ఉంటున్నాను. నేను గమనించినదేమిటంటే... ఇటీవల నేను తీవ్రమైన అలసటతో బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. – ప్రణీత, హైదరాబాద్
ఎయిర్ కండిషన్‌డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలామందికి మంచి సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి కొన్ని రకాలఅనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి...
తీవ్రమైన అలసట : చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు.
పొడి చర్మం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.
అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం : గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేరు. వేసవిలో బయటకు రావడమే కష్టంగా అనిపిస్తుంది.
శ్వాస సమస్యలు : చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండటం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు.
అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment