
ఏసీ కొనుగోళ్లపై అకాల వర్షాల ప్రభావం
15 శాతం పడిపోయిన రిఫ్రిజరేటర్ విక్రయాలు
20% తగ్గిన శీతల పానీయాల అమ్మకాలు
కొనుగోలుదారులు లేక డీలాపడిన వ్యాపారులు
గతేడాదితో పోలిస్తే 40–50% తగ్గిన ఏసీ విక్రయాలు
గత ఏడాది దేశవ్యాప్తంగా 1.50 కోట్ల ఏసీల అమ్మకం
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు వేసవి అమ్మకాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే ఎయిర్ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయాయి. మే నెలలో భానుడు భగభగల స్థానంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లపడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న 13,117 మెగా వాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదు కాగా అది ఇప్పుడు 10,700 మెగావాట్ల స్థాయికి పడిపోయిందంటే వాతావరణం ఏ స్థాయిలో మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఫలితంగా వరుసగా నాలుగేళ్ల నుంచి గణనీయంగా పెరుగుతూ వచి్చన ఏసీల అమ్మకాలు తొలిసారి తిరుగమన దశలో నడుస్తున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 1.50 కోట్ల ఏసీల విక్రయాలు జరగ్గా ఈ ఏడాది కనీసం 30 నుంచి 35 శాతం వృద్ధి నమోదవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. మొత్తం ఏసీల అమ్మకాల్లో 70 శాతం అమ్మకాలు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోనే జరుగుతాయి. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలలు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని, గతేడాదితో పోలిస్తే 40–50 శాతం అమ్మకాలు తగ్గాయని సోనోవిజన్ ఫౌండర్ భాస్కర మూర్తి తెలిపారు. వాతావరణంలో వచ్చిన అకాల మార్పులతో వినియోగదారులు ఏసీ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
జూన్‌లోనూ పెరిగే ఆస్కారం లేదు..!
సాధారణంగా వేసవిలో 1600 నుంచి 1800 ఏసీలను విక్రయిస్తామని, ఈసారి ఇంత వరకు ఉక్కపోత అనేది మొదలు కాకపోవడంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని విశాఖకు చెందిన ప్రముఖ రిటైల్ సంస్థ ఒకటి పేర్కొంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తున్నాయన్న వార్తలతో జూన్‌లోనూ విక్రయాలు పెరిగే అవకాశాలు కనపించడం లేదంటున్నారు. గతేడాది హీట్‌వేవ్స్ ఎక్కువగా ఉండటంతో ఏసీ అమ్మకాలు ఆగస్టు వరకు కొనసాగాయన్నారు. మొత్తం ఏసీల అమ్మకాల్లో 23 శాతం వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి అంతా ఇదే విధంగా ఉందని, ఉత్తరాది మార్కెట్ మాత్రమే కొంత వృద్ధిని నమోదు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకోవడానికి వివిధ ఆఫర్లు ప్రకటించడంతో పాటు ధరలు పెంచాలన్న నిర్ణయాన్ని ఏసీ తయారీ సంస్థలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికీ మన రాష్ట్రంలో వ్యక్తిగత ఏసీలు 8.1 శాతం కుటుంబాలకు మాత్రమే ఉన్నాయి.
మిగిలిన వేసవి ఉత్పత్తులపైనా ప్రభావం
ఎయిర్ కండీషనర్లే కాకుండా కూలర్లు, రిఫ్రిజరేటర్లు, శీతల పానీయాల అమ్మకాలను అకాల వర్షాలు దెబ్బతీశాయి. గతేడాదితో పోలిస్తే రిఫ్రిజిరేటర్ల అమ్మకాల్లో 10 నుంచి 15 శాతం తగ్గుదల కనిపిస్తోంది. శీతల పానీయాల విషయంలో 15 నుంచి 20 శాతం వరకు తగ్గుదల ఉంది. వాతావరణ మార్పులే కాకుండా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం కూడా అమ్మకాలు తగ్గడానికి కారణంగా కొంతమంది రిటైలర్లు పేర్కొంటున్నారు. టీవీలు, వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు వంటి అమ్మకాలు కూడా గతేడాది పోలిస్తే తక్కువగానే జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.