బాణసంచా విక్రయాలు నేలచూపు
75 శాతం అమ్మకాలు తగ్గాయంటున్న వ్యాపారులు
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి నెట్‌వర్క్: దీపావళి పర్వదినం సమీపిస్తోంది. ఈ పండుగ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టపాసులే. కానీ.. ఈ ఏడాది బాణసంచా మార్కెట్‌లో పండుగ సందడి అసలు కనిపించడం లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్‌లో 90 శాతం టపాసులు అమ్ముడయ్యేవి. దీపావళికి మూడు రోజులే సమయం ఉండగా.. కనీసం 25 శాతం బాణసంచా కూడా అమ్ముడుపోలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు అనేక దశాబ్దాలుగా టపాసుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరినుంచి 150 మంది రిటైల్ వ్యాపారులు బాణసంచా కొనుగోలు చేస్తారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజులపాటు విక్రయాలు జరుపుతుంటారు. కానీ.. ఈ ఏడాది రిటైలర్లు హోల్‌సేలర్ల వద్ద బాణసంచా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
దీపావళిని కమ్మేసిన వరద, భారీ వర్షాలు
సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ జిల్లాను బుడమేరు వరద ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో వరద చేరింది. లక్షలాది మంది ముంపునకు గురై ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో రూ.లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం అందక లబోదిబోమంటున్నారు. వరద ప్రభావం బాణాసంచా విక్రయాలపై తీవ్రంగా పడిందని, అందువల్లే హోల్‌సేల్ వ్యాపారానికి గండిపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో..
భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితులను దిగజార్చాయి. ఈ ప్రభావం బాణాసంచా విక్రయాలపై అధికంగా కనిపిస్తోంది. వంటనూనె, ఇతర నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ప్రజల దగ్గర డబ్బులు లేవని.. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సంక్షేమం లేదు.. సంక్షోభమే
గత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతుభరోసా వంటి పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సాయం అందేది. కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమ పథకాల సాయం అందటం లేదు. మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం పండుగపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ టపాసుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ ఏడాది సరైన వ్యాపారమే జరగలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా దసరా నుంచి మొదలై.. ఈ సమయానికి 90%వ్యాపారం పూర్తయ్యేదని.. ఈ ఏడాది దానికి భిన్నమైన పరిస్థితులు వల్ల 75% అమ్మకాలు తగ్గాయని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
విక్రయాలు భారీగా తగ్గాయి
ఈ ఏడాది బాణాసంచా విక్రయాలు భారీగా తగ్గాయి. వర్షాలు, వరదలు దీపావళి సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఏటా దీపావళికి నెల ముందే బాణసంచా తీసుకెళ్లే రిటైల్ వ్యాపారులు ఈ ఏడాది కొనుగోళ్లకు ముందుకు రాలేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. పండుగకు ముందు జరిగే వ్యాపారంలో 50 శాతం కూడా జరగలేదు. – గర్రె బాబూరావు, బాణసంచా వ్యాపారి, చిలకలూరిపేట
ఎక్కడా కనిపించట్లేదు
ఈసారి దీపావళికి టపాసులు పేలేలా కనిపించడం లేదు. టపాసుల విక్రయాలు ఎక్కడా జరగటం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ముందుగానే టపాసులు కొనేవారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. షాపులు నెలకొల్పేందుకు కూడా వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. – ఎస్.రాజారావు, బైరివానిపేట, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment