కిడ్నీ కౌన్సెలింగ్స్
నా వయసు 58 ఏళ్లు. ఈమధ్య బాగా నీరసంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించాను. క్రియాటినిన్ పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాంతో నాకు డయాలసిస్ చేస్తారేమోనని ఆందోళన పడ్డాను. కానీ డయాలసిస్ చేయడం లేదు. మందులే ఇస్తున్నారు. ఎందుకిలా? క్రియాటినిన్ ఎంత ఉంటే డయాలసిస్ చేస్తారు? – డి. రామేశ్వరరావు, విజయవాడ
కిడ్నీ రోగికి డయాలసిస్ మొదలుపెట్టడానికి క్రియాటినిన్ కేవలం కౌంట్ మాత్రమే ఆధారం కాదు. ఇంకా చాలా రకాల పరీక్షలు చేసి డయాలసిస్ ఎప్పుడు చేయాలో నిర్ధారణ చేస్తారు. ఇటీవలి నూతన పరిశోధనల ఆధారంగా క్రియాటినిన్ కౌంట్ 6 – 8 మధ్యలో ఉన్న రోగులకు కొందరికి డయాలసిస్ చేశారు. అయితే క్రియాటినిన్ కౌంట్ 10 – 12 మధ్య ఉన్నవారికి డయాలసిస్ ప్రారంభించినప్పుడు ఇచ్చినన్ని సత్ఫలితాలు ఈ 6 – 8 మధ్య ఉన్నవారిలో కనిపించలేదు. దీని వల్ల కేవలం క్రియాటినిన్ మాత్రమే డయాలసిస్ చేయాలనడానికి ఒక నిర్దిష్ట పరీక్ష కాదని స్పష్టంగా తేలిపోయింది. క్రియాటినిన్ ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల రోగి ఊపిరి తీసుకోలేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోక సన్నబడిపోవడం, ఆకలిని కోల్పోవడం, వాంతులు కావడం (ఈ లక్షణాలన్నింటినీ యూరెమిక్ సింప్టమ్స్ అంటారు) వంటివి కనిపించనప్పుడు మాత్రమే డయాలసిస్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ విషయానికి వస్తే మీకు ఎప్పుడు డయాలసిస్ ప్రారంభించాలన్న అంశాన్ని మీ నెఫ్రాలజిస్టు నిర్ణయిస్తారు.
క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏమిటి?
నా వయసు 52 ఏళ్లు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. పనిలో భాగంగా తరచూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటాను. ఈ కారణంగా నెలలో మూడువారాలు బయటే తింటుంటాను. మద్యపానం అలవాటు కూడా ఉంది. అప్పుడప్పుడూ సిగరెట్లు తాగే అలవాటు కూడా ఉంది. కొద్ది నెలలనుంచి బలహీనంగా అనిపిస్తోంది. వీపు దిగువ భాగాన నొప్పిగా ఉంటోంది. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో మొదలయ్యిందని అనిపించి డాక్టర్‌కు చూపించగా కిడ్నీకి సంబంధించిన వ్యాధి సీకేడీ ఉన్నట్లు చెప్పి చికిత్స చేస్తున్నారు. అసలు ఇదేం వ్యాధి? ఎందుకు వస్తుంది? దయచేసి వివరంగా తెలపండి. – జి. గుర్నాధరెడ్డి, కొడంగల్
క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే మాటకు సంక్షిప్త రూపమే సీకేడీ. ఇది మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఆహారపు అలవాట్లలో లోటుపాట్ల కారణంగా మనదేశంలో చాలామందికి ఈ వ్యాధి వస్తున్నది. డయాబెటిస్, హైబీపీ వ్యాధిగ్రస్తుల్లో మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. ఆ రెండూ ప్రధాన కారణాలే అయినప్పటిMీ గ్లోమెరులార్ డిసీజ్, వారసత్వ (జన్యు) కారణాల వల్ల కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. పదే పదే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కు గురవుతుండటం, మూత్రపిండాలలో రాళ్లు, మద్యపానం, పొగతాగడం, ఊబకాయం కూడా సీకేడీ ముప్పును మరింత అధికం చేస్తాయి. సీకేడీ నెమ్మదిగా కబళించే వ్యాధి. దీనిలో మూత్రపిండాలకు జరిగే నష్టం తీవ్రమైనదీ, శాశ్వతమైనది. సీకేడీ వల్ల కొద్ది నెలల నుంచి కొద్ది సంవత్సరాల కాలంలో నెఫ్రాన్లకు నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉంటుంది. సీకేడీలో అధికరక్తపోటు, ఛాతీలో నొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం, అకారణంగా కనిపించే అలసట, కడుపులో వికారం, వాంతులు, వీపు దిగువభాగాన నొప్పి, చర్మంపై దురదలు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా వ్యాధి ముదిరిన దశలో మాత్రమే వ్యక్తమవుతాయి. చాలా సందర్భాలోల వ్యాధిగ్రస్తులను కాపాడటానికి అవకాశం లేని దశలోనే ఇవి వెల్లడి అవుతుంటాయి. నెఫ్రాన్లలో అధిక శాతం పూర్తిగా నష్టం జరిగి, ముదిరిన తర్వాతే వ్యాధి గురించి తెలుస్తుంది కాబట్టి సీకేడీని సైలెంట్ కిల్లర్ అంటున్నారు. దేశంలో ఆరోగ్యంగా కనిపిస్తున్న ప్రతి 5 నుంచి 10 మందిలో ఒకరు ఇంకా బయటపడని సీకేడీ బాధితులే అని అంచనా. ప్రారంభదశలోనే దీఇ్న గుర్తించినట్లయితే వ్యాధి మరింతగా విస్తరించకుండా చర్యలు తీసుకోడానికి వీలవుతుంది.
మందులు ఉపయోగించి చికిత్స చేయడంలో భాగంగా మొదట అధికరక్తపోటును అదుపు చేయడం, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని స్థితిలో మిగిలిన అవకాశాలు రెండే. మొదటిది డయాలసిస్ చేస్తుండటం. అయితే ఇది మూత్రపిండాల వ్యాధులను నయం చేసే చికిత్స ఎంతమాత్రమూ కాదు. తాత్కాలికంగా మూత్రపిండాల బాధ్యతను స్వీకరించి, శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోకుండా చూసే మార్గమిది. ఇది మరో ప్రత్యామ్నాయం (మూత్రపిండాల మార్పిడి) దొరికే దాక అనుసరించాల్సి మార్గం మాత్రమే. డయాలసిస్ చేయడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు శాశ్వత పరిష్కారంగా మూత్రపిండాల మార్పిడిని సూచిస్తారు. ఇందుకు రోగి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులెవరైనా తమ మూత్రపిండాలలో ఒకదాన్ని దానం చేయడమో లేక బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి (రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని జీవన్‌దాన్ సంస్థ సాయంతో) సేకరించిన మూత్రపిండాన్ని అమర్చడమో చేస్తారు.
డాక్టర్ కె.ఎస్.నాయక్,
సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment