యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోంది... బాబుకు కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉందా?
మా బాబుకు ఐదేళ్లు. వాడికి ఇటీవల రెండుమూడు సార్లు జ్వరం వచ్చింది. మందులు ఇచ్చిన వెంటనే తగ్గింది. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అయితే డాక్టర్‌గారు అతడికి మూత్రంలో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. మా బాబు కొద్దిగా నీరసంగా కూడా ఉన్నాడు. ఇటీవల మూత్రపరీక్ష చేయిస్తే అతడికి యూరిన్‌లో కొద్దిగా ప్రోటీన్స్ పోతున్నట్లుగా రిపోర్టు వచ్చింది. మా దూరపు బంధువుల్లో ఒకరికి కిడ్నీ రుగ్మత ఉంది. ఆయనకు కూడా ఇలాగే ప్రోటీన్స్ పోతుంటాయి. దాంతో మావాడి విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇదేమైనా మావాడికి రాబోయే కిడ్నీ రుగ్మతకు సూచనా? దయచేసి వివరంగా చెప్పండి.
- అవనిజ, నిజామాబాద్
మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మీ అబ్బాయికి రెండుమూడు సార్లు మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం, అలాగే ఇటీవలికాలంలో మీ అబ్బాయికి మూత్రంలో ప్రోటీన్ పోవడం (ప్రోటీన్ యూరియా) ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. పిల్లల్లో పదిశాతం మందిలో ఎనిమిది, పదిహేనేళ్ల మధ్యవారిలో జీవితకాలంలోని ఏదో సమయంలో ఇలా మూత్రంలో ప్రోటీన్ పోవడం అన్నది చాలా సాధారణమైన విషయం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే... ఇలా పోతున్న ప్రోటీన్ అన్నది కిడ్నీకి సంబంధించినదా లేక తాత్కాలికంగా నష్టపోతున్నదా లేదా ఇతరత్రా హానికరం కాని కారణాల వల్ల పోతున్నదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, అధికంగా వ్యాయామం చేసినప్పుడు, జలుబు చేసినప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, తాము ఉన్న స్థితి నుంచి మారడం (పొజిషనల్ వేరియేషన్) వంటి సాధారణమైన కారణాలు మొదలుకొని కిడ్నీజబ్బులు, ట్యూబ్యులార్ డిసీజెస్, పాలిసిస్టిక్ కిడ్నీ, రిఫ్లక్స్ నెఫ్రోపతి వంటి తీవ్రమైన, దీర్ఘకాలిక జబ్బుల వరకు ప్రోటీన్ పోవడం సంభవించవచ్చు.
ప్రోటీన్ పోవడంలోని తీవ్రత ఆధారంగానే పేషెంట్ విషయంలో భవిష్యత్తులో తీసుకో వలసిన చర్యలను నిర్ణయించడం జరుగుతుంది. పిల్లల్లో యూరిన్‌లో ప్రోటీన్ పోవడంలోని తీవ్రత - నిత్యం, గుర్తించేంత మోతాదులో అంటే కన్సిస్టెంట్‌గా, సిగ్నిఫికెంట్‌గా పోతుంటే అప్పుడది ఏదైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకు దారితీసే కండిషన్స్‌కు సూచికా అని తెలుసుకోవడం ముఖ్యం. అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మూత్రంలో ప్రోటీన్స్ చాలా తక్కువ మోతాదులో పోతుంటాయి. దీన్నే మైక్రో ఆల్బ్యుమిన్ యూరియా అంటారు. ఈ అంశంలో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్, 24గంటల్లో మూత్ర విసర్జన పరిమాణం, ఇమ్యునలాజికల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ వంటి మరిన్ని అదనపు పరీక్షలు చేయించాలి. అవసరమైతే కిడ్నీ బయాప్సీ మొదలైన పరీక్షల ద్వారానే ఇదేమైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణమా అని తెలుసుకోవచ్చు.
ఇక మీ అబ్బాయి విషయానికి వస్తే రెండు మూడు సార్లు జ్వరం తప్ప మరే ఇతర లక్షణాలూ కనిపించలేదు కాబట్టి అతడి విషయంలో కనిపిస్తున్న ప్రోటీన్ పోవడం అన్నది తీవ్రమైన, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణం కాకపోవచ్చు. అయినా మీ బంధువుల్లో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని రాశారు కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించడం వల్ల మీ అబ్బాయి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉంది. మీరేమీ ఆందోళన చెందకుండా మీ అబ్బాయికి సంబంధించిన యూరిన్ టెస్ట్ రిపోర్టులు, ప్రోటీన్ పోతున్న రిపోర్టులతో మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు నెఫ్రాలజిస్టును కలిసి తగు సలహా తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్