చలికాలం జ్వరాల కాలం. చలికాలం కీళ్లనొప్పుల కాలం కూడా. జ్వరాలను, కీళ్లనొప్పులను విడివిడిగా ఎదుర్కొనడం ఒక పద్ధతి. కాని జ్వరం వల్ల కీళ్లనొప్పులు వస్తే? జ్వరం తర్వాత కూడా కీళ్లనొప్పులు వస్తే?
ఈ సీజన్‌లో ఈ సమాచారం తెలుసుకొని ఉండాలి. జ్వరంతో వచ్చే కీళ్లనొప్పులకు పరిష్కారం తెలుసుకొని ఉండాలి. అందుకే ఈ కథనం.
కాలం మారింది. దాంతో వాతావరణం మారిపోయింది. బయటి ఉష్ణోగ్రతలకు తగినట్లు ఒళ్లు తనను తాను మార్చుకోవడంలో ఒడిదొడుకులకు లోనవుతుంది. వైరస్‌లు ఈ సీజన్‌కి ‘జ్వరాల సీజన్’ అని పేరు పెట్టిస్తాయి. ఒంటికి టెంపరేచర్ తగ్గాక ధర్మామీటర్‌కి అందని కీళ్లజ్వరం మొదలవుతుంటుంది.
జ్వరం తర్వాత...
జ్వరం మనిషిని నేరుగా పీల్చివేయడం కంటే ఆ తర్వాత పీడించడమే ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు జ్వరాన పడితే పూర్తిగా కోలుకోవడానికి ఓ వారం పడుతుంది. నాలుగు రోజులు జ్వరంతో మంచం పడితే కోలుకోవడానికి నెల రోజులు పడుతుంది. అలాంటి జ్వరానికి అనుబంధంగా వచ్చి పడేదే కీళ్ల జ్వరం. జ్వరం తగ్గిన తర్వాత హుషారుగా లేచి తిరుగుదామంటే ఒళ్లు సహకరించదు. కీళ్లు ఒక పట్టాన కదలవు. అప్పటి వరకు దేహంలో ఉన్న జాయింట్స్ గురించి మనకు పెద్దగా పట్టింపు ఉండదు. జాయింట్ మెకానిజం ఒకటి ఉంటుందని అవి కదలడం మానేసినప్పుడు గుర్తుకు వస్తుంది. కీళ్ల నొప్పి అని సింపుల్‌గా చెప్పుకునే ఈ సమస్యకు కారణాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా ఒక రకం కాదు, అనేక రకాలుగా ఉంటాయి. కీళ్ల సమస్యకు దారి తీసిన కారణాన్ని బట్టి, కీళ్ల సమస్యల లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది.
వైరల్ ఆర్థరైటిస్
నార్మల్ ఫీవర్ నుంచి కానీ, వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి కానీ కోలుకుంటున్నప్పుడు కీళ్ల నొప్పులు విడవకుండా పీడించవచ్చు. ఈ లక్షణానికి కారణం ‘వైరల్ ఆర్థరైటిస్’ లేదా వైరస్ ద్వారా వచ్చిన ‘కీళ్లవాతం’. రోగకారక వైరస్ సోకడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కొన్ని వైరస్‌లు సోకడం వల్ల సంక్రమించే వ్యాధి ఇది. దీని వల్ల కీళ్లలో వాపు వస్తుంది. వైరల్ జ్వరం తగ్గిన తర్వాత కీళ్లనొప్పి రావడం సర్వసాధారణంగా తలెత్తే చికిత్స సంబంధ సమస్య. వైరస్ ద్వారా సంక్రమించిన కీళ్లనొప్పుల్లో చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. కొన్నింటికి వైరస్ నిరోధక చికిత్స చేయవలసి ఉంటుంది. సాధారణంగా వచ్చే కీళ్ల వాపు, వైరస్ ద్వారా సంక్రమించే కీళ్ల వాపు మధ్య తేడాలను నిర్ధారించడం కొంచెం కష్టమే. వైరస్‌ప్రేరేపిత కీళ్ల వాపు సంభవించడం, వ్యాప్తి చెందడాన్ని గురించి నిర్దుష్ట సమాచారం అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష మందిలో 0.6 నుంచి 27 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు అంచనా. అయితే వార్ధక్యంలో ఉన్న వారిలో ఈ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అరవై దాటిన వారిలో చూస్తే ప్రతి లక్షమందిలో 30 నుంచి 40 మందికి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జ్వరం అనంతరం బయటకు కనిపిస్తున్నప్పటికీ ఈ వ్యాధి వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వస్తుంది. వైరల్ ఆర్థరైటిస్‌కు కారణమవుతున్న వైరస్‌ల జాబితా ఇలా ఉంది. అవి...
∙జఠర సంబంధ వైరస్
∙డెంగ్యూ వైరస్,
∙హెపటైటిస్ ఎ,బి,సి,
∙హెచ్‌ఐవి,
∙పాలిచ్చే పశువుల నుంచి సంక్రమించే బి19 వైరస్
∙గవద బిళ్లలు, రుబెల్లా వైరస్, ఆల్ఫా వైరస్,
∙జీవకణాల ద్వారా సంక్రమించే వైరస్,
∙సువాసనల నుంచి వచ్చే వైరస్
∙రెట్రో వైరస్‌లు.
వ్యాధి నిరోధానికి రుబెల్లా వ్యాక్సిన్ టీకాలు వేసినప్పుడు కూడా వైరల్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇది పిల్లల్లో సర్వసాధారణం. అప్పుడు కూడా పిల్లలు కీళ్ల నొప్పులతో బాధపడతారు. అయితే చాలా మందికి వ్యాక్సిన్ల రూపంలో వైరస్ సోకినప్పటికీ, కొద్దిమందికి మాత్రమే వైరస్ సంబంధ కీళ్ల వాతం వస్తుంది.
మల్టిపుల్ జాయింట్ పెయిన్స్
విషక్రిమి సంబంధ కీళ్లవాతం వచ్చిన రోగులు బహుళ కీళ్ల నొప్పుల (మల్టిపుల్ జాయింట్ పెయిన్స్)తో బాధపడుతుంటారు. కేవలం కీళ్ల నొప్పులు లేక కీళ్ల వాపు, కీళ్ల దగ్గర చర్మం ఎరుపెక్కడం, వాతం వల్ల వచ్చిన కీళ్లనొప్పిని పోలి ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నట్లుండి రావడమే కాక దద్దుర్లు కూడా వస్తాయి. జ్వరం, చలిపెట్టడం, దద్దుర్ల వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా కేసుల్లో వైరల్ ఆర్థరైటిస్‌గా రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంటుంది. వైరల్ ఆర్థరైటిస్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి... అని ఇదమిత్ధంగా చెప్పడానికి ఒక్క నమూనా కూడా లేకపోవడం ఇందుకు కారణం.
∙ఈ రోగానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ప్రత్యేకంగా ఏమీలేవు (ఉదాహరణకు జ్వరం, కీళ్లనొప్పులు, దద్దుర్లు). ఎందుకంటే ఇవన్నీ ఇతర వ్యాధులతో కూడా కనిపిస్తాయి.
∙ఒక్కొక్కసారి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు సోకడానికి ముందు సూచనగా కీళ్ల నొప్పులు రావచ్చు (ఉదాహరణకు హెపటైటిస్ బి వైరస్, పచ్చకామెర్లు రావడానికి ముందు)
∙వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన రుజువులను తరచుగా కనిపెట్టడం కష్టం.
వైరల్ ఇన్‌ఫెక్షన్ అనంతర ఆర్థరైటిస్ చికిత్సజ్వరం లేదా వైరస్ జ్వరం నుంచి కోలుకుని కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారికి అవుట్ పేషెంట్‌గా చికిత్స చేయవచ్చు. హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య వల్ల శాశ్వత అంగవైకల్యం వస్తుందని రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి తగ్గుముఖం పడుతుంది.వైరల్ ఆర్థరైటిస్‌ను తగ్గించే కొన్ని మందులు
పారాసిటమాల్: ఇది మంచి బాధ నివారిణి. దీనిని సరైన మోతాదులో క్రమం తప్పకుండా వేయాల్సి ఉంటుంది.
నిద్రకు ఉపయోగపడే మందులు : ట్రమాడాల్ మంచి ఎంపిక. 30–100 మిల్లీగ్రాముల మోతాదులో ఆరు గంటలకొకసారి వాడాలి.
ఎసిటిల్ సాలిసైక్లిక్ యాసిడ్: మందులు వాడడం వల్ల వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందువల్ల వాటి తీవ్రత తగ్గిన తరవాత మాత్రమే వాడాలి.మూర్ఛ నిరోధక మందుల, ఉత్సాహ పరిచే మందులు,కార్టికో స్టెరాయిడ్స్: కొద్దిపాటి నొప్పి నుంచి తీవ్రమైన నొప్పి ఉన్న ప్పుడు కూడా వాడవచ్చు. దీనికి ప్రెడ్నిసోన్ మాత్రలను సూచించడం జరుగుతుంది. ఈ మందుల వాడకం వల్ల తగిన గుణం కనిపిస్తున్నట్లయితే మధుమేహం, హైపర్ టెన్షన్, గతంలో ఎముకలు విరిగిన దాఖలాలు, మానసిక స్థితి ఉన్నట్లుంది మారిపోవడం, స్థూలకాయం, హృద్రోగం ఉన్నవారికి ఈ మందులను ఇవ్వరాదు. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు ఉన్న రోగులకు హైడ్రో క్లోరోక్వైన్, సల్ఫాసాలాజైన్, మెథోట్రెక్సేట్ కూడా వాడవచ్చు.కీళ్లనొప్పులతో బాధపడే వారికి మూడు దశల్లో భౌతిక చికిత్స చేయించవచ్చు. అయితే వ్యాధి తీవ్రత ముదరక ముందు, విడవకుండా పీడిస్తున్నప్పుడే భౌతిక చికిత్సకు ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే ఎలాంటి ప్రత్యేక వైరస్ నిరోధక చికిత్స చేయాల్సిన అవసరం లేదు. డెంగ్యూ వ్యాధి ఉన్న రోగుల్లో ఆస్పిరిన్ వంటి కొన్ని ఇతర మందులు వాడరాదు. డెంగ్యూ తీవ్రత సంకేతాలు లేనప్పుడు మాత్రం వాటిని వాడవచ్చు.సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చే సూచనలున్నప్పుడు మినహా మిగిలిన సందర్భాల్లో సర్జికల్ డ్రైనేజ్ (రక్తంలో చీమును తీసేయడం) కూడా అవసరం లేదు. ఆహార నియమాల మీద పెద్దగా ఆంక్షలు లేవు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా కదలడం మొదలు పెట్టాలి.
అనుమానించాల్సిన ఇతర కారణాలు
సర్వ సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు ఇతర ఇన్‌ఫెక్షన్‌ల వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతర ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వచ్చిందేమోనని పరిశీలించి ఒక అంచనాకు రావడం తప్పనిసరి. వ్యాధిని తీవ్రం చేయగల ఇన్‌ఫెక్షన్‌లలో సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్, కీళ్లవాపు జ్వరం, క్షయ, కీళ్లవాతం, కడుపులో మంట, రక్తంలోకి వివిధ రసాలను విసర్జించు గ్రంథులు జరిగ్గా పనిచేయకపోవడం మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించుకుని నిర్ధారించుకోవాలి.సాధారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత ప్రకృతి సిద్ధమైన కాల్షియం, మెగ్నీషియం మూలకాలు, డి, బి12, ఈ విటమిన్‌ల లోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. మంచి ఆహారం తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు.
గమనిక: వ్యాధికి గురైన వాళ్లు తప్పని సరిగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వైద్యం చేయించుకోవాలి. ఈ కథనం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే.
చికున్ గున్యా
చికున్ గున్యా వ్యాధి సోకిన వారిలో వివిధ దశల్లో కీళ్ల నొప్పులు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా లేచి మామూలుగా తిరగడం ఇబ్బంది కావడం వల్ల వ్యాధి సోకిన రోగుల దైనందిన జీవనంపై ప్రభావం పడుతుంది. వస్తువులు తీసుకోవడం, కుర్చీలు ఎత్తడం, నడవడం మొదలగునవి కూడా సాధ్యం కాదు. వ్యాధి సోకడం వల్ల దాని ప్రభావం కేవలం నొప్పులకే పరిమితం కాదు. రోగుల్లో చాలామందికి సరిగ్గానిద్రపట్టకపోవడం, మనసు స్థిమితంగా ఉండవకపోవడం, మూడ్ మారిపోతుండడం జరుగుతుంటుంది.చికున్ గున్యా సోకిన వారికి చిన్న, పెద్ద కీళ్లు నొప్పులు వస్తాయి. చికున్ గున్యా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతర వైరస్‌లకు ముఖ్యంగా డెంగ్యూకు దానికి ఉన్న తేడాను కనిపెట్టలేం. ఈ వ్యాధి సోకిన వారికి దీర్ఘకాలం కీళ్లనొప్పులు ఉంటాయి. ఒక్కొక్కసారి మూడేళ్ల పాటు కూడా కీళ్ల నొప్పులు బాధించవచ్చు. ఈ నొప్పులు సాధారణంగా వేళ్లు, చేతి మణికట్టు, మోకాళ్లు, కాలి చీలమండల దగ్గర కనిపిస్తాయి. అరవై నుంచి ఎనభై శాతం మంది రోగుల్లో ఈ నొప్పులు వస్తూ పోతూ ఉంటాయి. ఇరవై నుంచి నలభై శాతం మంది రోగుల్లో నిరంతరం ఉంటాయి. వయసు పైబడిన వారిలో, మహిళల్లో, ఇది వరకే కీళ్ల నొప్పులు ఉన్న రోగుల్లో ఎక్కువ రోజులు కీళ్ల నొప్పులు ఉండే ప్రమాదముంది.
ఇన్‌పుట్స్: డా‘‘ రాహుల్ అగర్వాల్ (ఎం.డి, జనరల్ మెడిసిన్)
సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్,
డయాబెటాలజిస్ట్ మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాధాపూర్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment