కిడ్నీ కౌన్సెలింగ్స్
నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించగా ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. లేదంటే నాకు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నేను మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? – విశాల్, హైదరాబాద్
మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి.
కాళ్ల వాపులు వస్తున్నాయి... కిడ్నీల సమస్యా?
నాకు 67 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్‌లో ప్రొటిన్ విలువ 3 ప్లస్‌గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా? – ఎల్. కృష్ణమూర్తి, జనగామ
మీరు తెలిపిన వివరాలను, మీ రిపోర్టుల్లో నమోదైన అంశాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రొటిన్లు ఎక్కువగా పోతున్నాయి. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మూత్రంలో ప్రొటిన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి. బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పినివారణ మందుల (పెయిన్‌కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా అమ్మగారు, వారి తండ్రిగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. జన్యుపరమైన అంశాలు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలే చదివాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు నివారణ మార్గాలున్నాయా? దయచేసి నాకు సలహా ఇవ్వండి.
– డి. రమేష్‌కుమార్, కాకినాడ
మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 50 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్స్‌గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్‌ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబంలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రం నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment