ఒత్తిడి తగ్గదు సరికదా... ఎక్స్‌ట్రా డేంజర్స్
పల్మనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 49 ఏళ్లు. చాలా ఒత్తిడి ఉండే వృత్తిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాను. ఆ ఒత్తిడి తగ్గించుకోడానికి రోజూ సిగరెట్లు కాలుస్తుంటాను. రోజూ దాదాపు మూడు నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శామ్యూల్, కరీంనగర్
సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. రోజుకు మూడు పాకెట్ల సిగరెట్లు కాల్చడం అంటే చాలా పెద్ద విషయం. అది ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే ధూమపానం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది.
డాక్టర్ పి. నవనీత్
సాగర్‌రెడ్డి,సీనియర్ పల్మునాలజిస్ట్, యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ, హైదరాబాద్
ఐబీఎస్... భయపడాల్సిందేమీలేదు!
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 38. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. మలంలో జిగురు కనిపిస్తోంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. ఆత్మన్యూనతతో బాధపడుతున్నాను.
– మహేశ్‌కుమార్, తాడేపల్లిగూడెం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు.
వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. రోగ లక్షణాలను బట్టి, కడుపులో పరాన్నజీవులు ఉన్నాయా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ పరీక్షలు నిర్ధారణకు తోడ్పడతాయి.
వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే... జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్‌స్టిట్యూషనల్ సిమిలియమ్ చికిత్స ద్వారా చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్
డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి
విజయవాడ, వైజాగ్