గ్యాస్‌ట్రబుల్‌కూ, గుండెనొప్పికీ తేడా ఏమిటి?  | family health counciling | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ట్రబుల్‌కూ, గుండెనొప్పికీ తేడా ఏమిటి? 

Published Fri, Apr 27 2018 12:37 AM | Last Updated on Fri, Apr 27 2018 12:37 AM

family health counciling - Sakshi

నా వయసు 46 ఏళ్లు. నాకు తరచూ గ్యాస్‌తో ఛాతీమీద మంట వస్తుంటుంది. ప్రతిసారీ ఇది గ్యాస్‌ నొప్పే కదా అని అనుకుంటూ ఉంటాను. అయితే ఇటీవల నాలో ఒక అనుమానం మొదలైంది. ఒకవేళ నాకు గుండెనొప్పి వస్తే... దాన్ని కూడా ఇలాగే తేలిగ్గా తీసుకుంటానేమోనని సందేహం వచ్చి ఈమధ్య ఆందోళన పడుతున్నాను.  గుండెనొప్పికీ, గ్యాస్‌తో వచ్చే ఛాతీనొప్పికి తేడాలు చెప్పండి. 
– ఎమ్‌. రాము, కరీంనగర్‌ 

ఇటీవల చాలా కేసులను పరిశీలిస్తే... చాలామంది గుండెపోటును గ్యాస్‌ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. గ్యాస్‌తో వచ్చిన అసౌకర్యానికీ, గుండెపోటుకూ తేడా గుర్తించడానికి ఒక బండగుర్తు ఉంది. అదేమిటంటే... మీరు అజీర్తి లేదా గ్యాస్‌ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్‌ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్‌ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ మీరు ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా మీకు ఉపశమనం కలగకపోతే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొందరిలో ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, ఛాతీపైన బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఎక్కడినుంచి వస్తోందో బాధితులు గుర్తించలేరు. ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్‌ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడల నుంచి కూడా మొదలుకావచ్చు. అసిడిటీ సమస్యలుండే వారిలో ఛాతీలో మంటగా ఉంటుంది. కానీ మీకు వస్తున్న ఆ నొప్పి అసిడిటీ పెరగడం వల్ల వచ్చిన నొప్పి కాదని తేలితే... దాన్ని గుండెనొప్పిగా  అనుమానించాలి. వెంటనే ఆసుపత్రికి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. 

హార్ట్‌ ఫెయిల్‌ అయింది జాగ్రత్తలు చెప్పండి
నా వయసు 67 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు తీవ్రంగా ఆయాసం వస్తోంది.  దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, పాదాల వాపు కనిపించాయి. దాంతో  దగ్గర్లోని డాక్టర్‌ను కలిశాను. హార్ట్‌ ఫెయిల్యూర్‌ అని చెప్పారు. ఆయన నాకు కొన్ని పరీక్షలు చేసి జీవనశైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని తెలిపారు. నాలాంటి వారు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. 
– బి. సీతారామారావు, కోదాడ
 
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి... ఉప్పు: ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనిబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించడం మంచిది. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని – బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్‌ నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్‌ వంటివి ఉపయోగించుకోవచ్చు. 
ద్రవాహారం: ఒంట్లోకి నీరు చేరుతుంటే ద్రవాహారం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరకపోతే మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. 
విశ్రాంతి: గుండెవైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. 
మానసికంగా ప్రశాంతంగా ఉండాలి: గుండెవైఫల్యం (హార్ట్‌ ఫెయిల్యూర్‌), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. రోగులు ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. 
ఈ మందులు వాడకండి: గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. నొప్పులు ఎక్కువగా ఉంటే... మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్‌ వంటి సురక్షిత మందులు వాడుకోవచ్చు. 
వైద్యపరమైన జాగ్రత్తలు: గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం అవసరం.  అందుకే హార్ట్‌ ఫెయిల్యూర్‌ అయినవారు తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు తప్పక పాటించాలి. 

బైపాస్‌ అంటే ఏమిటి?
చేయించాక జాగ్రత్తలేమిటి? 

నా వయసు 65 ఏళ్లు. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు బైపాస్‌ సర్జరీ చేయించాలన్నారు? అంటే ఏమిటి. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. 
– నివేదిత, ఒంగోలు

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు,  రక్తసరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు బైపాస్‌ సర్జరీ చేస్తారు. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా బైపాస్‌ సర్జరీ అని పిలిచే ఈ ఆపరేషన్‌నే... వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్‌. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్‌ మార్గంలో అందించేలా అమర్చుతారు. బైపాస్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్‌ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని అపోహ పడకూడదు. మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా రోగి కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్‌ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్‌ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.డాక్టర్‌ అనూజ్‌ కపాడియా, 
కార్డియాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement