ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాల్లో గుండెపోటు వల్ల చనిపోతున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా ఇండోర్‌లో 17 ఏళ్ల అమ్మాయి సంజనా యాదవ్ గుండెపోటుతో మరణించింది. రాత్రి భోజనం తిన్న అనంతరం ఒక్కసారిగా ఛాతిలో నొప్పితో విలవిల్లాడింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, విపరీతంగా చెమటలు పట్టి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది.
వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజన కుటుంబంలో ఇదివరకు హార్ట్ ఎటాక్ హిస్టరీ కూడా లేదని, అయినా ఇంత చిన్న వయసులో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. సంజనాకు హైపర్‌టెన్షన్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే వీటితో చలికాలంలో పరిస్థితి దిగజారిపోతుందని పేర్కొన్నారు.
టైఫాయిడ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే..
'సంజనకు నాలుగు నెలల క్రితం టైఫాయిడ్. వచ్చింది. ఆ సమయంలో ఆమె హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4 g/dlకి పడిపోయింది.కానీ ఆమె కుటుంసభ్యులు స్పెషల్ కేర్ తీసుకోవడంతో త్వరగానే కోలుకుంది. ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం. ఈ ఘటనతో ఆమె ఫ్యామిలి మెడికల్ హిస్టరీని కూడా ఓసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది' అని వైద్యులు తెలిపారు. ఈ మధ్యకాలంలో యువతలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్‌లోనే గత ఆరు నెలల్లో మొత్తం 1,052 మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య ఉన్నవారే అని ఓ నివేదికలో వెల్లడైంది.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యువతలో గుండెజబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు గుండె జబ్బులు అంటే వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్ద కాలంగా పరిస్థితి మారింది. యువతలో హార్ట్ ఎటాక్‌కు ప్రధానంగా హైబీపీ, స్మోకింగ్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ హిస్టరీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
గుండెపోటు లక్షణాలు
ఛాతీలో నొప్పిగా అనిపించడమే గుండెపోటుకు పెద్ద ముఖ్యమైన సూచన అని డాక్టర్లు చెబుతున్నారు. గుండె వరకూ రక్తం పూర్తిగా సరఫరా కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. సాధారణంగా ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్తం గుండె వరకు చేరలేదు. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ సమయంలో శ్వాస ఆడకపోవడం, చల్లని చెమట, వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుతో కుప్పకూలినప్పుడు ఎంత త్వరగా సీపీఆర్ చేశామన్నది చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందంచగలిగితే బతికించే ఛాన్సులు మెరుగ్గా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment