Heart pain
-
గుండెపోటుతో మరణించిన 17 ఏళ్ల అమ్మాయి, ఆ లక్షణాలు కనిపిస్తే..
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాల్లో గుండెపోటు వల్ల చనిపోతున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా ఇండోర్‌లో 17 ఏళ్ల అమ్మాయి సంజనా యాదవ్ గుండెపోటుతో మరణించింది. రాత్రి భోజనం తిన్న అనంతరం ఒక్కసారిగా ఛాతిలో నొప్పితో విలవిల్లాడింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, విపరీతంగా చెమటలు పట్టి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజన కుటుంబంలో ఇదివరకు హార్ట్ ఎటాక్ హిస్టరీ కూడా లేదని, అయినా ఇంత చిన్న వయసులో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. సంజనాకు హైపర్‌టెన్షన్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే వీటితో చలికాలంలో పరిస్థితి దిగజారిపోతుందని పేర్కొన్నారు. టైఫాయిడ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే.. 'సంజనకు నాలుగు నెలల క్రితం టైఫాయిడ్. వచ్చింది. ఆ సమయంలో ఆమె హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4 g/dlకి పడిపోయింది.కానీ ఆమె కుటుంసభ్యులు స్పెషల్ కేర్ తీసుకోవడంతో త్వరగానే కోలుకుంది. ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం. ఈ ఘటనతో ఆమె ఫ్యామిలి మెడికల్ హిస్టరీని కూడా ఓసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది' అని వైద్యులు తెలిపారు. ఈ మధ్యకాలంలో యువతలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్‌లోనే గత ఆరు నెలల్లో మొత్తం 1,052 మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య ఉన్నవారే అని ఓ నివేదికలో వెల్లడైంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యువతలో గుండెజబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు గుండె జబ్బులు అంటే వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్ద కాలంగా పరిస్థితి మారింది. యువతలో హార్ట్ ఎటాక్‌కు ప్రధానంగా హైబీపీ, స్మోకింగ్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ హిస్టరీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుండెపోటు లక్షణాలు ఛాతీలో నొప్పిగా అనిపించడమే గుండెపోటుకు పెద్ద ముఖ్యమైన సూచన అని డాక్టర్లు చెబుతున్నారు. గుండె వరకూ రక్తం పూర్తిగా సరఫరా కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. సాధారణంగా ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్తం గుండె వరకు చేరలేదు. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ సమయంలో శ్వాస ఆడకపోవడం, చల్లని చెమట, వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుతో కుప్పకూలినప్పుడు ఎంత త్వరగా సీపీఆర్ చేశామన్నది చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందంచగలిగితే బతికించే ఛాన్సులు మెరుగ్గా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. -
గుండెనొప్పితో పాఠశాల బస్సు డ్రైవర్ మృతి
అద్దంకి: గుండెనొప్పితో తాను చనిపోతానని తెలుసుకున్న డ్రైవర్ నడుపుతున్న బస్సును పక్కకు తీసి ఆపి ప్రాణాలు విడిచిన ఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని మైలవరం గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. అందిన సమాచారం మేరకు అద్దంకి మండలంలోని చక్రాయపాలెం గ్రామానికి చెందిన గుర్రాల ఏడుకొండలు (55) 13 ఏళ్ల నుంచి పట్టణంలోని చైతన్య పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉప్పలపాడు–మైలవరం రూట్లోని పిల్లలను ఎక్కించుకు రావడానికి వెళ్లాడు. పిల్లలను ఎక్కించుకుని వస్తూ అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో బస్సులో ఉన్న పిల్లల ప్రాణాలను రక్షించేందుకు నడుపుతున్న బస్సును పక్కకు తీసి ఆపి తాను ప్రాణాలు విడిచాడు. ఏడుకొండలుకు భార్య, కుమారుడు ఉన్నారు. -
గ్యాస్ట్రిక్ నొప్పికి, గుండె నొప్పికి తేడా తెలుసుకోవడం ఎలా?
-
గ్యాస్ట్రిక్ నొప్పి.. గుండె నొప్పి.. తేడా తెలుసుకోవడం ఎలా?
నవీన్‌కి ఒకరోజున ఉన్నట్టుండి గుండె నొప్పిగా అనిపించింది. కంగారు వేసింది. వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగు తీశాడు. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి భయపడాల్సిన పనేమీ లేదని, గ్యాస్ట్రిక్ ట్రబులేననీ చెప్పి పదిరోజులపాటు రోజూ పొద్దున్నే ఖాళీ కడుపుతో పాంటాప్రజోల్ టాబ్లెట్ ఒకటి వేసుకోమని, కొంతకాలం పాటు పులుపులు, పప్పులు, మసాలాలకు దూరంగా ఉంటే అదే తగ్గిపోతుందని చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే, గుండెనొప్పిలాగా అనిపిస్తుంది కదా. ఈ రెండిటికీ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? దీనికి ప్రథమ చికిత్స ఏమిటి?►గ్యాస్ నొప్పి కూడా ఛాతీ లో రావడం వల్ల గుండె నొప్పి ఏమో అనుకోవడం సహజం. అయితే కొద్దిపాటి పరిశీలనతో తేడాని గుర్తించవచ్చు.►గుండె నొప్పి అయితే ఛాతీతో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్ అంతా ఒకేసారి నొప్పి ఉంటుంది.ఛాతీ అంతా బరువుతో కూడిన నొప్పి ఉంటుంది.►ఇక గ్యాస్ నొప్పి మనం వేలుతో పాయింట్ చేసేంత ప్లేస్లోనే ఉంటుంది. అది కూడా ఓసారి ఓ దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఉంటుంది.►మరొక ముఖ్యమైన విషయం ముందుకు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది.►ఎందుకంటే గ్యాస్ పడుకున్నప్పుడు వెనక్కి వెళ్తుంది. కానీ గుండె నొప్పి పడుకున్నా లేచినా ఒకేచోట ఉంటుంది.►అలా అనిపించినప్పుడు రెండు గ్లాసుల పల్చటి మజ్జిగ తాగాలి. అప్పుడు కడుపులోని గ్యాస్, తేన్పుల రూపంలో బయటకి వస్తుంది.►ఒకవేళ అలా తగ్గకపోతే గ్లాసుడు నీళ్లలో ఈనో పాకెట్ కలుపుకు తాగండి. ఫైబర్ ఎక్కువగా ఉండే బీరకాయల లాంటి కూరగాయలు తినండి. ►పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగుతూ ఉంటే కొద్దిరోజులకు గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.►రోజు పొద్దున్నే పరగడుపున గ్లాసుడు నీళ్లలో అర చెంచాడు జీలకర్ర వేసి మరిగించి, గోరువెచ్చగా అయ్యాక తాగాలి. చదవండి👉🏾: Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
గుండె జబ్బు ముప్పు ముందే తెలిసిపోతుంది!
గుండె జబ్బులను ముందుగా గుర్తించేందుకు ఓ కొత్త మార్గాన్ని కనుక్కున్నారు అమెరికాలోని విస్కాన్సిన్ మెడికల్ కాలేజీ శాస్త్రవేత్తలు. గుండె జబ్బులను ముందుగా గుర్తించేందుకు ఫార్మింగ్ హ్యామ్ రిస్క్ స్కోర్ పరీక్ష మాత్రమే ఉంది. వయసు, రక్తపోటు, కొలెస్ట్రాల్ మోతాదు వంటి అంశాల ఆధారంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను అంచనా వేయడాన్ని ఫార్మింగ్ హ్యామ్ రిస్క్ స్కోర్ పరీక్ష అంటారు. తాజాగా కంప్యూటర్ ఎయిడెడ్ టొమోగ్రఫీ (సీటీ) స్కాన్ల ద్వారా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని ముందుగానే కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గుండె జబ్బు లక్షణాలు లేని సుమారు 829 మందికి 2004–05 మధ్యకాలంలో సీటీ స్కాన్లు తీయగా.. 2011 వచ్చే సరికి సుమారు 156 మంది గుండె జబ్బు లేదా స్ట్రోక్ బారిన పడ్డారన్నారు. శరీరంలోని బృహద్ధమని గోడలపై క్యాల్షియం మోతాదులకూ.. గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని స్టేసీ డి.ఓ కానర్ పేర్కొన్నారు. పరిశోధనలో పాల్గొన్న అందరి బృహద్ధమనిలో క్యాల్షియం మోతాదులు సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని వివరించారు. -
హృదయ బాష
ఉదయం ఐదు గంటలకు అతను తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాడు. అపార్ట్మెంట్ చాలా చిన్నది. పైగా గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉంది. ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక వంట గది, టాయిలెట్, బాత్రూమ్.. ఆ ఇంటిలోని భాగాలు. తలుపులు మూసి గొళ్లెం వేసి తాళం వేశాడు. బయట ఇంకా చీకటిగానే ఉంది. చేతికర్ర ఆసరాగా శబ్దం లేకుండా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతని భుజానికో కాన్వాసు బుట్టా సంచి కూడా ఉంది. అతని పేరేంటో అక్కడెవరికీ తెలియదు. ఆ అపార్ట్మెంట్ అతని సొంతమే. అయితే అతణ్ని అందరూ ఏమని పిలుస్తారు? అందరూ అతణ్ని పిలవరు. అతని గురించి అసలు చర్చించుకోవడం కూడా జరగదు. ఎవరికీ ఇంతవరకూ అతణ్ని పిలవాల్సిన అవసరం రాలేదు కూడా. అయితే అతని వయసు అరవై పైనా డెబ్బయ్కి అటూ ఇటూ ఉండవచ్చు. అతనెలా ఉంటాడంటే.. ఆ వయసుకి తగ్గవాడిలాగే, అతి సాధారణంగా ఉంటాడు. కానీ, ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఒకరోజు మీసం ఉంటే కొన్నాళ్ల తర్వాత అది ఉండదు. ఒకరోజు గుండు తల. మరికొన్నాళ్లకు సాధువులా పొడుగాటి వెంట్రుకలు.అతని వేషధారణ బహు విచిత్రం. పైజామా, లాల్చీ వేసుకుని తలపై ఫారిన్ క్యాప్ ధరిస్తాడు. ఒక్కోసారి ధోవతి ధరించి అంగవస్త్రం కప్పుకుంటాడు. మరోసారి అయ్యవారిలా నామాలు పెట్టుకుంటాడు. సరే.. ఇప్పుడతను ఎటు వెళుతున్నాడు? తిన్నగా పబ్లిక్ గార్డెన్ వైపుకే నడుస్తున్నాడు. అతణ్ని చూసి హెచ్చరికగా మొరగడానికి అక్కడ కుక్కలు లేవు. అతను వెళ్లే దారిలో ఉన్న కుక్కలన్నింటినీ మునిసిపాలిటీ వాళ్లు తీసుకెళ్లిపోయారు. అయితే అది కేవలం అతని కంప్లయింట్ల వల్లనే అని ఆ మునిసిపల్ అధికార్లకి కూడా తెలియదు. అదిగో.. ఎదురుగా పేపర్ అబ్బాయిలు చాలా ఫాస్ట్‌గా సైకిళ్లు తొక్కుతూ వచ్చేస్తున్నారు. ‘అదిగో అద్దాల్ని తీసుకుని వెళుతున్నారు. అద్దాలలో ముఖాలు చూసుకోకపోతే జనాలకి ఏం అర్థం కాదు.. పాపం’ అనుకున్నాడతను. అతనంతే.. పేపర్ని ‘అద్దం’ అని పిలుచుకుంటాడు. ప్రజల మనోభావాలకు అద్దం పట్టేవి. ప్రపంచంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలను అద్దంలా చూపించేవి ఆ దిన పత్రికలే కాబట్టి వాటికి ఆ పేరు పెట్టుకున్నాడు. అతని వ్యవహారమే అంత! అంతా కోడ్ భాషలో ఉంటుంది. అతను రాసుకునే డైరీ కూడా కోడ్‌లో ఉంటుంది. అయితే ఈ అలవాటు అతనికెలా అయిందో ఎవరూ చెప్పలేదు. అతను వీధుల్లో నడవడు. అంతా మెయిన్‌రోడ్ల మీదే. అది కూడా మార్నింగ్ వాక్ లాగానూ, జాగింగ్ లాగానూ, రెండూ మిక్స్ చేసిన విధంగానూ ఉంటుంది. అతనిలా ఎన్నాళ్లనుంచి ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అప్పుడే ఆ మసీదు పక్క మెయిన్‌రోడ్డుపై కాఫీ హోటల్ తెరుస్తున్నారు. తెరిచేశారు కూడా. ‘‘మనం ఇంటి దగ్గర కషాయం తాగక ఎన్నిరోజులైందో కదూ.. వెళ్లి కాస్త పుచ్చుకుందాం’’ అని అంది అతని ఆత్మ. అంతరాత్మ.. హోటల్‌కి పెట్టిన పేరు.. అందులో కూర్చున్నాడు. బేరర్ రాగానే ‘‘కషాయం’’ అన్నాడు. బేరర్‌కి తెలుగు సరిగా రాదు. ఏంటి? అన్నట్టు చేత్తో సైగ చేశాడు. అతను గోడపై తగిలించిన పదార్థాల పట్టిక వద్ద వెళ్లి కాఫీ అన్న చోట వేలు పెట్టి చూపించాడు. ‘‘ఓహో.. కాఫీ..’’ అంటూ నవ్వుకుంటూ వెళ్లాడతను. కాఫీ తాగడమయ్యాక గవ్వలు ఇచ్చేసి బయటికొచ్చాడు. గవ్వలంటే డబ్బులు. జేబులో చిల్లిగవ్వలేదంటుంటారు. అందుకే డబ్బుల్ని గవ్వలంటాడతను. మళ్లీ నడక ప్రారంభించాడు. కొందరు యువకులు టీ షర్టులు, షాట్స్ ధరించి జాగింగ్ చేస్తూ వస్తున్నారు. అతను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ నవ్వుకర్థం ఏమిటో అతనికే తెలియదు. ఒకప్పుడు తానూ వాళ్ల మాదిరిగానే నవయవ్వనంలో తుళ్లిపడే కోడెగిత్తలా పరుగెత్తేవాడిననీ, నేడిలా ‘నీడ’ అంటే వయసుపైబడి అలా పరుగెత్తలేకపోతున్నానని ఒక భావం. రేపు మీరు కూడా ఏదో ఒకనాడు నీడ కమ్ముకోగా నాలాగే అవుతారనే ఎద్దేవాభావం.. ఒకటీ అయి ఉండవచ్చు. పబ్లిక్ గార్డెన్‌కి చేరాడతను. లోపలికి అడుగుపెట్టగానే ఎంత కమ్మని సంగీతం! సంగీతం అక్కడ.. ఆ సమయంలోనా? ఆశ్చర్యపోకండి. ప్రశాంతతకి అతని గ్రామర్‌లో మారుపేరు సంగీతం. ప్రశాంతతకి మించిన కమ్మని సంగీతం ఏదీ ఉండదని అతని గట్టి అభిప్రాయం. పూల చెట్ల మధ్యలో నుంచి వేసిన బండల దారిపై నడుస్తున్నాడు. ‘‘ఈ అమ్మాయిలంతా ఇంకా నిద్దుర లేవలేదు.. పడుకొండి. నిదరపోండి కమ్మగా.. కలలు కనండి హాయిగా. ఓ మైడియర్ స్వీట్గాల్స్’’ అన్నాడతను వాటిని చూసి. అవును మరి.. పూలూ, అమ్మాయిలూ ఒకటే కదా.. ఆ రసాస్వాదకుని హృదయం భాషలో... మరైతే అమ్మాయిలనేమని పిలుస్తాడో అని మీకు సందేహం కదూ? అదిగో.. ఒక చోట ఇద్దరు అమ్మాయిలు స్కిప్పింగ్ చేస్తున్నారు. ‘‘హాయ్ చాక్లేట్స్’’ అన్నాడతను. వాళ్లు ముసి ముసిగా నవ్వుకున్నారు. అమ్మాయిలు చాక్లేట్స్ని ఇష్టపడతారు. అదే వారికతను పెట్టిన తియ్యని పేరు. అప్పటికే అతనికి నడచినడచి కాళ్లు తీపులు పుడుతున్నట్లుగా అనిపించింది. ఒక మంచంపై కూర్చున్నాడు. గార్డెన్‌లోని రాతి సోఫీలన్నీ అతనికి మంచాలు. కళ్లు మూసుకుని కాసేపు ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఆరుగంటలయింది. వెలుగు కిరణాలు పరిసరాల్ని ఆరబెడుతున్నాయి. పది నిమిషాల అనంతరం కళ్లు తెరచి అక్కడినుంచి లేచాడతను. మళ్లీ నడక. తోటలో తిరుగుతూ ఏదో పాట పాడుకుంటున్నాడు. పక్కనే నడుస్తున్న యాభై ఏళ్ల వనిత ఆసక్తిగా అతని కూని రాగాలని వింటోంది. వెన్నే పాయసమూ.. పాయసమే ప్రవాహ అమృతమూ.. వెన్నే పాయసమూ... ఆవిడకేమీ అర్థం కాలేదు. కానీ అది ‘‘అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం..’’ అనే పాత పాటకి పేరడీగా భావించి నోటికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతూ, చకచకా అతణ్ని దాటుకుంటూ వెళ్లిపోయింది. అందం వెన్నలాంటిది.. కరిగిపోతుంటుంది. ఆనందం పాయసంలాంటి అనుభూతి. జీవితం ఒక ప్రవాహం మకరందం అమృతం. ఇవన్నీ ఆయన మనసులోని పదకోశం వివరణలు. తెల్లగా తెల్లవారింది. చలాకీగా నడుస్తున్న అతను ఒక్క క్షణం షాక్ తగిలినట్లుగా ఛాతీపై చేయి వేసుకుని అలాగే శిలలా నిలబడిపోయాడు. అతని గుండెలో ఎవరో పదునైన బల్లెంతో గుచ్చిన అనుభూతి. అది హార్ట్ అటాక్ స్ట్రోక్. మొదటిసారిగా అనుభవిస్తున్నాడు. అతనికి నుదుటిపై చెమట పట్టేసింది. ఒళ్లంతా కరెంట్ ప్రసరిస్తున్న భావన. శరీరం మొద్దుబారిపోతోంది. అలాగే కుప్పకూలిపోయాడు. ఎవరో అతని మొహంపై నీళ్లు చిలకరించి, లేపి కూర్చోబెట్టారు. ఆయన కళ్లు తెరచి ఎదురుగా ఉన్న నడి వయస్కుని మొహంలోకి కృతజ్ఞతగా చూశాడు. ‘‘ధార... ధార..’’ అన్నాడు. ‘‘ఏంటి?’’ అడిగాడా రక్షకుడు. అతని చేతిలోని వాటర్ బాటిల్కేసి చూస్తూ ‘‘ధార’’ అన్నాడు. అర్థం చేసుకున్న వాడిలా ఆ బాటిల్ ఎత్తి నీళ్లని అతని నోట్లో ఉంచసాగాడాయన. గుటకలు వేస్తూ నీళ్లు మింగి తెప్పరిల్లాడు. తన ప్రాణాలు కాపాడిన ఆ మహనీయునికి చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘రత్నాలు’’ అన్నాడు. కృతజ్ఞతలు రత్నాలవంటివని ఆ ఎదుటి మనిషికి తెలియక.. ఇతడిని పిచ్చివాడిని చూసినట్టు చూసి తలాడిస్తూ నవ్వాడతను. మన కథానాయకుడు చేతికర్ర ఊతంగా అలాగే లేచి నిలుచున్నాడు. ఆగంతకుడు ముందుకు సాగిపోయాడు. మళ్లీ నడక మొదలు. అయితే మరింత ఎక్కువసేపు నడవలేదతను. ఒక ఆటో ఆపి, ఎక్కి ‘పద’ అన్నట్లు సైగ చేశాడు. ‘‘ఎక్కడికి?’’ అతను తన జేబులోని విజిటింగ్ కార్డు చూపించాడు. అందులో అతని పేరు లేదు. అది నీలిమా టవర్స్‌కి సంబంధించిన అడ్రస్కార్డు. కాకపోతే పైన ఒక మూలకు పెన్నుతో నెం. 101 అని మాత్రం రాసి ఉంది. ఓ పది నిమిషాల్లో ఆటో అపార్ట్మెంట్ ముందు ఆగగానే, అతను డబ్బులు చెల్లించి తన గదికేసి నడిచాడు. తలుపులు తెరచి లోనికి వెళ్లాలనుకున్నాడు. అంతలో ఏదో గుర్తుకొచ్చింది. వెంటనే వెనక్కి తిరిగాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న టీ హోటలుకేసి నడిచాడు. హోటలు పక్కనే టెలీఫోన్ బూత్ ఉంది. గ్లాస్ డోర్ నెట్టి లోనికి వెళ్లి కూర్చున్నాడు . ఆయాసంతో అతని ఒళ్లు చిన్నగా కంపిస్తోంది. జేబులో చెయ్యి పోనిచ్చి ఏవో కాగితాలు బయటికి తీశాడు. అందులో ఒక ఫోన్ నంబర్ని చూసి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూపించాడు. ఆ పిల్ల ఆ నంబర్ని కాగితంపై నోట్ చేసుకుంది. రింగ్ చేసింది. ఆయన ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. వెంటనే తన విజిటింగ్ కార్డ్ తీసి ఆమెకిచ్చి ‘‘ఈ అడ్రసుకి తొమ్మిది గంటలకు రమ్మని చెప్పు’’ అన్నట్లు సైగ చేశాడు. ఆ పిల్ల అతణ్ని అర్థం చేసుకుంది. ఫోన్ రింగవుతోంది. క్షణం తర్వాత ‘హలో’ అందా పాప. అతను ఆమెవైపే చూస్తున్నాడు. ‘‘హలో.. ఈ ఫోన్ నంబర్ ఎవరిదండీ.. లాయర్ పరమహంసగారిదా? ఇక్కడ నీలిమా టవర్స్, నంబర్ 101కి చెందిన ఒక పెద్దాయన ఫోన్ చేస్తున్నారు. తొమ్మిది గంటలకి తన ఇంటికి రమ్మంటున్నారు.’’ అవతల్నుంచి ‘‘అలాగే’’ అని చెప్పడంతో అమ్మాయి ఫోన్ పెట్టేసి ‘‘వస్తానని చెప్పారు’’ అంది. అతను డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టి ‘‘రత్నాలు, వజ్రాలు’’ అని చెప్పి బయటకొచ్చాడు. ఆ పిల్ల అతనికేసి వింతగానూ, అనూహ్యంగానూ, భయంగానూ, ఇంట్రస్ట్గానూ చూస్తూనే ఉంది. అతను ఇల్లు చేరి తాళం తెరచి లోనికి వెళ్లి తలుపేసుకున్నాడు. లాయరు తప్పక వస్తాడని అతనికి తెలుసు. నిజానికి ఇప్పుడతనికి ఎంతో టెన్షన్‌గా, కంగారుగా ఉంది. తనకు మొదటిసారిగా గుండెనొప్పి వచ్చింది. మళ్లీ ఒకటి రెండు సార్లు వస్తే బతకడం అబద్ధం. అందుకే లాయరుతో పని! చేయవలసిన ముఖ్యమైన పనిని తొందరగా ముగించాలి. అదే అతని ఆత్రుత. సమయం ఎక్కువగా లేదు. తొమ్మిది గంటలకి లాయర్ వస్తాడు. ఈలోగా గుండె నొప్పి మరోసారి రావచ్చు. అందుకే త్వరగా తాను రాయదల్చుకున్నది రాయాలి. కానీ, ఏం రాయాలి? టైం చూశాడు. గోడ గడియారంలో ఎనిమిది అవుతోంది. మరోగంట.. ఈలోగా మరోసారి స్ట్రోక్ వచ్చినా రావచ్చు. అతనిప్పుడు ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాడు. లాయర్‌తో మాట్లాడాలి. అందుకే అతని రాక కోసం ఎదురుచూస్తున్నాడు. క్షణాలు బరువుగా.. నత్తలా నడుస్తున్నాయి. అతను తన పాత ట్రంక్ పెట్టె మూత తీసి, తన పాత జ్ఞాపకాలను స్పృశిస్తున్నాడు. ఏవేవో ఫోటోలు చూస్తున్నాడు. ఏవేవో ఉత్తరాలను గుండెకి హత్తుకుని వలవలా కన్నీళ్లు కారుస్తున్నాడు. టైం గడుస్తోంది. తొమ్మిది గంటలవుతోంది. లాయర్ పరమహంస స్కూటర్ స్టాండ్ వేసి 101 కాలింగ్ బెల్ నొక్కాడు. సమాధానం రాలేదు. డోర్ తెరుచుకోలేదు. ఐదు నిమిషాలు ఆగి తలుపు తోశాడు. అది సునాయాసంగా తెరుచుకుంది. లోపలికి వెళ్లేసరికి వాలుకుర్చీలో కూర్చుని అరమోడ్పు కన్నులతో ఎగశ్వాస పీలుస్తూ అతను... ‘‘హలో సార్..’’ పరమహంస అతని భుజం పెట్టాడు. ‘‘రత్నాలు, వైఢూర్యాలు’’ అంటూ పరమహంస చేతిని అందుకుని, అతను కనురెప్పలు వాల్చాడు. అంతే.. అతనింక కదల్లేదు. పరమహంస బరువుగా నిట్టూర్చాడు. తనని చూశాకగానీ ఈ ముసలాయన తుది శ్వాస విడవలేదు. పాపం.. ఇప్పటివరకూ తన ప్రాణాల్ని ఎలా ఉగ్గబట్టుకున్నాడో! సుమారు రెండు గంటల తర్వాత అక్కడ అనేకమంది పత్రికా విలేకరులూ, టీవీ చానల్స్ ప్రతినిధులూ హాజరై లాయర్ పరమహంస నుండి వివరణల కోసం ఎదురుచూస్తున్నారు. ‘‘ఏంటి సార్.. ఈయన విచిత్రమైన కథ? అసలు ఎవరీయన?’’ ప్రశ్నల పరంపర బిగినైంది. పరమహంస ఒక్క క్షణం భారంగా నిట్టూర్పు విడిచి చెప్పటం ప్రారంభించాడు. ‘‘ఈయన పేరు కార్తికేయ. ఆయనకి తెలియని భారతీయ భాష లేదు. యూనివర్సిటీ నుంచి ఎన్ని యం.ఎ. పట్టాలు పుచ్చుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇతని పుట్టుక ఎక్కడా? ఎవరితో గడిపాడో తెలియదు. కానీ, నిరంతరం భాషల గురించి అ«ధ్యయనం చేయడం ఈయన ప్రవృత్తి. ముఖ్యంగా ఈయన జీవితంలో అది తప్ప వేరే ఆశయం లేనట్లుంది. ఇతను నాకు పది సంవత్సరాల క్రితం వైజాగ్‌లో పరిచయమయ్యాడు. అప్పటికి తాను భాషల గురించి ఎన్నో ముఖ్యమైన సంగతులు సేకరించాననీ, అవన్నీ ఒక పుస్తక రూపంలో తెస్తాననీ అన్నాడు. అయితే వీటన్నింటికీ చెందని కొత్త భాషనొకదానిని తాను కనిపెట్టాలనుకున్నట్లు నాతో చెప్పాడు. అంటే... ఒక పదానికి దాని అర్థంతో సరిపోయే మాటని కొత్తగా చేర్చాలని అతని ఆశయం. ఉదాహరణకి కాఫీని కషాయం అనడం, అంటే జన జీవనంలో నిజమైన అర్థాలనే ప్రాతిపదికగా, ఈ కొత్త భాష ఉండాలని అతగాడి కోరిక. ‘అల్లుడు’ అంటే పరాన్నజీవి అనీ అమ్మాయి అంటే ‘చాక్లెట్’ అని ఇలా వేలాది పదాలకి కొత్త పేర్లు పెట్టేశారు. కానీ, చివరికి తాను చేసిన ప్రయోగమే తనకు విషమ సమస్యగా తయారైంది. ఏ పదం ఏ వస్తువు కోసం వాడుతున్నాడో, ఏ పదం ఏ భావం కోసం మార్చుకున్నాడో.. తానే మర్చిపోయే స్థితికొచ్చాడు. ఒరిజినల్ పదాలు అతనికి గుర్తే లేకుండా పోయాయి. మీరు ‘కుర్చీ’ అంటే అతనికి ‘పదవి’ గుర్తుకొస్తుంది. అతను ‘ధార’ అంటే మనకు ‘నీళ్లు’ అని తెలియదు. ఇలా అతని మెదడంతా విభిన్న పదాలతోనే నిండిపోయింది. ప్రతిక్షణం ఒరిజినల్ పదం కోసం గుర్తు చేసుకుంటూ.. అది స్ఫురణకి రాక బుర్ర బద్ధలు కొట్టుకుంటూ నానా ఇబ్బంది పడసాగాడు. తాను ఏ పదం దేనికి వాడుతున్నాడో మరిచిపోయి బాధపడుతున్నాడు. చివరిగా.. ఈ రోజు అతనికి గుండెనొప్పి వచ్చింది. అతణ్ని ప్రత్యేక శ్రద్ధతో ఏళ్ల తరబడి పరిశీలించడం వల్ల అతని హృదయ భాష కొంతలో కొంత అర్థం చేసుకోగలను కానీ, ఇప్పుడు అతను తన విల్లును కూడా తన ప్రత్యేక భాషలోనే రాసి కన్ను మూశాడు. ఈ విల్లును ఎలా అధ్యయనం చేయాలో అర్థం కావడం లేదు. ఇతని తుది కోరికకి ఎలా న్యాయం చేయాలో అంతకంటే అర్థం కావటం లేదు..’’ అన్నాడు పరమహంస ఎంతో ఆవేదనగా. అంతలో ఒక విలేకరి ముందుకు వచ్చి... ‘‘సార్... ఇంతకీ ఈ విచిత్ర వ్యక్తిత్వం గల మనిషి చరిత్ర ద్వారా ప్రజలకి ఏమైనా చెప్పదలచుకున్నారా? ఈయన కృషికి అర్థం ఉందా?’’ అని అడిగాడు. ‘‘యూ ఆర్ రైట్. మనిషి మేధావి. ఆ మేధస్సుకు పరిమితుల్లేవు. కానీ, ఒక నూతన పరిశోధన ఎప్పుడూ జనానికి ప్రయోజనాత్మకంగా, వారి జీవితాలలో వెలుగుని తెచ్చేదిగా ఉండాలి. అంతే తప్ప పనికిరాని ప్రయోగాలతో కార్తికేయలా ఎవ్వరూ కూడా తమ మేధా సంపత్తిని వృథా చేసుకోరాదం’’టూ ముగించాడు లాయర్ పరమహంస. జనం కరతాళ ధ్వనులతో అతని అభిప్రాయాన్ని ఆమోదించారు. కానీ పరమహంస మాత్రం కార్తికేయ హృదయ భాష గురించే ఆలోచిస్తూ వేదనా భరిత హృదయుడై ఉన్నాడు. -
గ్యాస్ట్రబుల్కూ, గుండెనొప్పికీ తేడా ఏమిటి?
నా వయసు 46 ఏళ్లు. నాకు తరచూ గ్యాస్‌తో ఛాతీమీద మంట వస్తుంటుంది. ప్రతిసారీ ఇది గ్యాస్ నొప్పే కదా అని అనుకుంటూ ఉంటాను. అయితే ఇటీవల నాలో ఒక అనుమానం మొదలైంది. ఒకవేళ నాకు గుండెనొప్పి వస్తే... దాన్ని కూడా ఇలాగే తేలిగ్గా తీసుకుంటానేమోనని సందేహం వచ్చి ఈమధ్య ఆందోళన పడుతున్నాను. గుండెనొప్పికీ, గ్యాస్‌తో వచ్చే ఛాతీనొప్పికి తేడాలు చెప్పండి. – ఎమ్. రాము, కరీంనగర్ ఇటీవల చాలా కేసులను పరిశీలిస్తే... చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. గ్యాస్‌తో వచ్చిన అసౌకర్యానికీ, గుండెపోటుకూ తేడా గుర్తించడానికి ఒక బండగుర్తు ఉంది. అదేమిటంటే... మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ మీరు ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా మీకు ఉపశమనం కలగకపోతే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొందరిలో ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, ఛాతీపైన బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఎక్కడినుంచి వస్తోందో బాధితులు గుర్తించలేరు. ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడల నుంచి కూడా మొదలుకావచ్చు. అసిడిటీ సమస్యలుండే వారిలో ఛాతీలో మంటగా ఉంటుంది. కానీ మీకు వస్తున్న ఆ నొప్పి అసిడిటీ పెరగడం వల్ల వచ్చిన నొప్పి కాదని తేలితే... దాన్ని గుండెనొప్పిగా అనుమానించాలి. వెంటనే ఆసుపత్రికి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. హార్ట్ ఫెయిల్ అయింది జాగ్రత్తలు చెప్పండి నా వయసు 67 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు తీవ్రంగా ఆయాసం వస్తోంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, పాదాల వాపు కనిపించాయి. దాంతో దగ్గర్లోని డాక్టర్‌ను కలిశాను. హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఆయన నాకు కొన్ని పరీక్షలు చేసి జీవనశైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని తెలిపారు. నాలాంటి వారు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. – బి. సీతారామారావు, కోదాడ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి... ఉప్పు: ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనిబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించడం మంచిది. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని – బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ద్రవాహారం: ఒంట్లోకి నీరు చేరుతుంటే ద్రవాహారం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరకపోతే మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. విశ్రాంతి: గుండెవైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి: గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. రోగులు ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. ఈ మందులు వాడకండి: గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. నొప్పులు ఎక్కువగా ఉంటే... మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ వంటి సురక్షిత మందులు వాడుకోవచ్చు. వైద్యపరమైన జాగ్రత్తలు: గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం అవసరం. అందుకే హార్ట్ ఫెయిల్యూర్ అయినవారు తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు తప్పక పాటించాలి. బైపాస్ అంటే ఏమిటి? చేయించాక జాగ్రత్తలేమిటి? నా వయసు 65 ఏళ్లు. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయించాలన్నారు? అంటే ఏమిటి. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – నివేదిత, ఒంగోలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు బైపాస్ సర్జరీ చేస్తారు. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా బైపాస్ సర్జరీ అని పిలిచే ఈ ఆపరేషన్నే... వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని అపోహ పడకూడదు. మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా రోగి కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.డాక్టర్ అనూజ్ కపాడియా, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రోడ్డుపై బస్సు నిలిపి డ్రైవర్ పరార్
♦ ప్రయాణికుల ఇబ్బందులు ♦ గుండెనొప్పితో ఆస్పత్రికి వెళ్లినట్టు అధికారుల వివరణ తిరువొత్తియూరు : కొడైకెనాల్‌కు వెళుతున్న బస్సును అర్ధాంతరంగా రోడ్డుపై నిలిపి డ్రైవర్ వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దిండుకల్ నుంచి కొడైకెనాల్‌కు సోమవారం ఉదయం ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఈ బస్సులో 50మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు బయలుదేరినప్పటి నుంచే డ్రైవర్ అడ్డదిడ్డంగా నడుపుతున్నట్టు తెలిసింది. దీంతో ప్రయాణికులు దిగ్భ్రాంతి చెందారు. ఈ లోపు బస్సు దేవదానపట్టి, గెంగువార్పట్టి ఘాట్‌రోడ్డు వద్ద వెళుతోంది. డ్రైవర్లో మితమైన వేగంతో బస్సును నడపాలని ప్రయాణికులు సూచించారు. తరువాత కూడా డ్రైవర్ బస్సును వేగంగా నడపడంతో ప్రయాణికులు డ్రైవర్‌ను గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా నిలిపి కిందకు దిగి పరుగున్న వెళ్లి ఆ మార్గంగా వస్తున్న మరో ప్రభుత్వ బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై వారు కండక్టర్ వద్ద మొరపెట్టుకోవడంతో అతను రవాణసంస్థ అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ డ్రైవర్‌ను పంపించమని కోరాడు. సుమారు రెండు గంటల తరువాత మరో డ్రైవర్ వచ్చి బస్సును నడిపారు. దీనిపై రవాణ సంస్థ అధికారి మాట్లాడుతూ ఆరోగ్యం సరిలేక పోవడం వల్ల డ్రైవర్ అర్ధాంతరంగా బస్సును రోడ్డుపై నిలిపి వెళ్లాడని, అతనికి ఇంతకుముందు గుండెనొప్పి వచ్చి ఉన్నట్టు తెలిపారు. దీని వల్ల ముందు జాగ్రత్తగా బస్సును నిలిపి మరో బస్సులో ఆసుపత్రికి వెళ్లినట్టు తెలిపారు. -
నాన్న కోసం ఆగిన గుండె
తండ్రి మృతితో తల్లడిల్లిన కుమారుడు గంటల వ్యవధిలోనే కన్నుమూత శ్రీకాళహస్తి రూరల్: చిన్నతనం నుంచి చేయిపట్టి నడిపించిన ఆ చేతులు మట్టిలో కలసిపోతాయనే భావనను జీర్ణించుకోలేని ఓ కుమారుడి గుండె పగిలింది. తండ్రి చనిపోయిన కొద్దిసేపటికే తనయుడూ కన్నుమూసిన ఘటన సోమవారం శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరు దళితవాడలో చోటుచేసుకుంది. తొట్టంబేడు గంగయ్య(67) కమ్మకొత్తూరు దళితకాలనీలో కుమారుడు సుబ్బరాయు లు(45)తో కలిసి జీవించేవాడు. కుమారుడు ప్రతిరోజు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గంగయ్యకు వృద్ధాప్య సమస్యల వల్ల కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించింది. పట్టణంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు. ఆరోగ్యం క్షీణించడటంతో ఆదివారం రాత్రి గంగయ్య మృతి చెందాడు. తండ్రి మరణం జీర్ణించుకోలేక కుమారుడు కుమిలిపోయాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించటానికి స్థానికులు ఏర్పాట్లు చేస్తుండగా సుబ్బరాయులుకు హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే తండ్రి మృతదేహం వద్దనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. తండ్రీతనయుల మృతదేహాలను ఒకే దగ్గర ఉంచి స్థానికులు.. బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. సుబ్బరాయులుకు భార్య, కుమారుడు ఉన్నారు. -
గుండె పోటు వచ్చినా..
* బస్సును ఆపి 50 మందిని * రక్షించిన బస్సు డ్రైవర్ * ఆస్పత్రికి తరలించేటప్పటికే మృతి పలమనేరు: తనకు గుండెనొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను క్షేమంగా కాపాడి తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే మిన్న అని భావించాడో డ్రైవర్. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి. కోటలో గురువారం జరిగింది. కుప్పం నుంచి సాయంత్రం 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు తమిళనాడులోని పేర్నంబట్‌కు బయలుదేరింది. డ్రైవర్ వెంకటేశ్ (45) బస్సును నడుపుతూ వి. కోటకు చేరుకోగానే గుండెనొప్పి వచ్చింది. దీంతో బస్సును పక్కన నిలిపివేసి కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటు వచ్చినా తమ ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ వెంకటేశ్ మృతదేహాన్ని చూసి ప్రయాణికులు సైతం క ంటనీరు పెట్టుకున్నారు. డ్రైవర్ తన ప్రాణాలకన్నా ప్రయాణికుల ప్రాణాలకే విలువనిచ్చాడని, అతని వల్ల తమ ప్రాణాలు దక్కాయని అన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
ఆస్పత్రి వద్ద మృతుడి బంధువుల ఆందోళన పిడుగురాళ్ళ : గుండెనొప్పి వస్తుందని వైద్యశాలకు వెళ్లిన వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యంతో శవమైన సంఘటన పిడుగురాళ్ళ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ పొట్లసిరి సాంబశివరావు(27) పట్టణంలోని కార్పొరేట్ స్థాయి ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం ఏడు గంటల సమయంలో గుండెనొప్పి అని వచ్చాడు. ఆసుపత్రిలో వైద్యుడు రాకముందే కాంపౌండర్లు రక్తపరీక్షలు, ఈసీజీ అంటూ పలు పరీక్షలు చేశారు. వీటికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేశారు. నొప్పి తగ్గేందుకు కాంపౌండర్ ఇంజక్షన్ చేశాడు. చేసిన కొద్దిసేపటికి గుండెనొప్పి మరింత పెరిగి బాధపడుతున్నప్పటికీ,కాంపౌండర్లు ఇంజక్షన్ చేసి మొదట్లో అలాగే ఉంటుందని, తర్వాత నొప్పి తగ్గుతుందన్నారు. చివరకు నొప్పి తట్టుకోలేకపోతున్న రోగిని చూసి బంధువులు సిబ్బందిని నిలదీశారు. తొమ్మిది గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన వైద్యులు రోగి నోట్లో పైపును అమర్చి వైద్యం ప్రారంభించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వెంటనే గుంటూరుకు తీసుకెళ్లాలని తెలపడంతో బంధువులు అంబులెన్స్‌లో రోగిని హుటాహుటిన నోట్లో పైపు అలాగే ఉంచి గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి రోగి చనిపోయి రెండు గంటలు పైగానే అయిందని నిర్థారించారు. దీంతో బంధువులు సాంబశివరావు మృతదేహాన్ని తీసుకుని పిడుగురాళ్ళ పట్టణంలోని వైద్యశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. వైద్యశాల సిబ్బంది మృతుడి బంధువులతో చర్చించి రాజీ మార్గాన్ని కుదిర్చారు. అనంతరం బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి తల్లి దుర్గ, భార్య వెంకటరమణ కుమార్తె లక్ష్మీభవాని, కుమారుడు సాయి గణేష్ ఉన్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : ‘బాపు.. నాకు బతకాలని ఉండేది.. కానీ నా ఆశయం నెరవేరకుండానే చనిపోతున్నందుకు బాధగా ఉంది. నేను చనిపోతున్నందుకు గుండె నొప్పే కారణం..ఆ భారం మీ పై పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నా.. నన్ను క్షమించండి.. అంటూ ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భిక్కనూర్ మండలం, జంగంపల్లికి చెందిన చిట్టబోయిన నర్సింహ ముదిరాజ్, శ్యామలలు వ్యవసాయదారులు. వీరికి ఓం ప్రకాశ్(18), సుమేదలు సంతానం. ఓం ప్రకాశ్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కశాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు.ఆదివారం అర్థరాత్రి వరకు చదువుకున్న ఓం ప్రకాశ్ సోమవారం ఉదయం తన గదిలో టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓం ప్రకాశ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. కాగా తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, తోటి విద్యార్థులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాల యాజమాన్యం మృతుని కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందజేసింది. -
మైదానంలో కుప్పకూలి...
బ్రస్సెల్స్: ఇటీవలి కాలంలో తరచూ క్రికెటర్లు ప్రాణం మీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు చూశాం. ఇప్పుడు తాజాగా ఫుట్‌బాల్ మైదానంలోనూ విషాదం చోటుచేసుకుంది. బెల్జియంకు చెందిన 24 ఏళ్ల గ్రెగరీ మెర్టెన్స్ మ్యాచ్ ఆడుతుండగానే తీవ్ర గుండెనొప్పితో కుప్పకూలాడు. మంగళవారం స్పోర్టింగ్ లోకెరెన్ తరఫున ఆడిన తను బరిలోకి దిగిన 20 నిమిషాల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడిని కోమాలో ఉంచి చికిత్స కొనసాగిస్తుండగా ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. -
గుండెనొప్పి వస్తే గుంటూరుకే!
పెద్దాస్పత్రిలో సౌకర్యాల లేమి అరకొర వైద్యులు, సిబ్బంది మందుల కొనుగోలుకు నిధుల్లేవ్ నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం విజయవాడ : అర్థరాత్రి నిండు గర్భిణీ ప్రసవ వేదనలో ఆస్పత్రికి వస్తే శిశువు ఎలా ఉందో స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో నొప్పులు పడుతూనే చిమ్మచీకటిలో కిరాయి ఆటోలో ప్రవేటు స్కానింగ్ సెంటర్‌కు తరలివెళ్లాల్సి వచ్చింది. వారం రోజుల కిందట ఏబై ఏళ్ల వ్యక్తికి గాయాలు కావడంతో 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి తలకు బలమైన గాయం కావడంతో గుంటూరు తీసుకెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు. అతన్ని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో రోగులు నగరం నుంచి గుంటూరుకు తరలివెళ్తుడంగా, మరికొందరు అప్పుచేసైనా చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. గుండెనొప్పితో నిరుపేద ప్రభుత్వాస్పత్రికి వస్తే వైద్యం అందని దయనీయ స్థితి నెలకొంది. ఆ విభాగంలో వైద్యులు లేకపోవడంతో గుంటూరుకు రిఫర్ చేయడంతో అక్కడకు వళ్లేందుకు అంబులెన్స్‌కు సైతం డబ్బుల్లేక ఎంతో మంది పేదలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిఫరల్ ఆస్పత్రిగా ఉన్న పెద్దాస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో సౌకర్యాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి రోగులు ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రిలో 790 పడకలు వున్నా, ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది,సౌకర్యాలు లేక పోవడంతో వైద్యం అందని దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఎక్స్‌రే మిషన్ పదిహేనురోజుల కిందట పాడైనప్పటికీ, దానిని మరమ్మతు చేసేందుకు నిధులు లేక చేతులెత్తేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ప్రమాదంలో చేయి విరిగి వచ్చిన వారికి కనీసం ఎక్స్‌రే తీయలేని దుస్థితిలో ప్రభుత్వాస్పత్రి ఉంది. బర్న్స వార్డులో సౌకర్యాల లేమి... చికిత్స కోసం ఈ వార్డులో చేరిన రోగి, కాలిన గాయాల కన్నా వార్డులో ఉక్కపోతతోనే మృతి చెందడం తధ్యమని పలువురు వైద్య నిపుణులే అంటున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, నిబంధనల ప్రకారం ఏసీలు, ఒక్కోరోగికి నెట్లు అందించాల్సి ఉండగా, పడకలపై బెడ్షీట్లు సైతం వేయలేని దుస్థితి నెలకొన్నట్లు సిబ్బందే చెపుతున్నారు. కాగా 410 పడకల ఆస్పత్రిగా ఉన్నప్పుడు 8 రేడియో గ్రాఫర్స్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 790 పడకలకు ఆస్పత్రి చేరుకున్నపటికీ రేడియో గ్రాఫర్ మాత్రం ఒక్కరే అందుబాటులో ఉండటం విశేషం. ఒక్క రేడియో గ్రాఫర్‌తో ఎలా ఎక్స్‌రేలు తీస్తారో ఉన్నతాధికారులకే తెలియాలని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల కిందట సీటీ స్కాన్ అందుబాటులోకి వచ్చినా, సీటీ టెక్నీషియన్ పోస్టులు నేటికీ అధికారికంగా కేటాయించలేదు. దీంతో టెంపరరీగా చేసే వారికి సైతం జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఆస్పత్రి అధికారులున్నారు. ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కొంత మొత్తం చెల్లిస్తుండగా ఇద్దరు టెక్నిషియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో సీటీ స్కాన్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మందులు సైతం కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. సమయపాలన పాటించని సిబ్బంది... అరకొర సౌకర్యాలతో పాటు, సిబ్బంది సైతం సమయ పాలన పాటించకపోవడం రోగులకు మరింత శాపంగా మారుతోంది. మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశ పెట్టాలని ఆదేశించినా, నేటికీ అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ విషయాలన్నింటిపై నేడు జరుగబోయే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అమాత్యులు దృష్టి సారిస్తారో లేదో వేచిచూడాల్సిందే.