ఉదయం ఐదు గంటలకు అతను తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చాడు. అపార్ట్‌మెంట్ చాలా చిన్నది. పైగా గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉంది. ఒక హాల్, ఒక బెడ్‌రూమ్, ఒక వంట గది, టాయిలెట్, బాత్‌రూమ్.. ఆ ఇంటిలోని భాగాలు. తలుపులు మూసి గొళ్లెం వేసి తాళం వేశాడు. బయట ఇంకా చీకటిగానే ఉంది. చేతికర్ర ఆసరాగా శబ్దం లేకుండా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతని భుజానికో కాన్వాసు బుట్టా సంచి కూడా ఉంది. అతని పేరేంటో అక్కడెవరికీ తెలియదు. ఆ అపార్ట్‌మెంట్ అతని సొంతమే. అయితే అతణ్ని అందరూ ఏమని పిలుస్తారు? అందరూ అతణ్ని పిలవరు. అతని గురించి అసలు చర్చించుకోవడం కూడా జరగదు. ఎవరికీ ఇంతవరకూ అతణ్ని పిలవాల్సిన అవసరం రాలేదు కూడా. అయితే అతని వయసు అరవై పైనా డెబ్బయ్‌కి అటూ ఇటూ ఉండవచ్చు. అతనెలా ఉంటాడంటే.. ఆ వయసుకి తగ్గవాడిలాగే, అతి సాధారణంగా ఉంటాడు. కానీ, ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఒకరోజు మీసం ఉంటే కొన్నాళ్ల తర్వాత అది ఉండదు. ఒకరోజు గుండు తల. మరికొన్నాళ్లకు సాధువులా పొడుగాటి వెంట్రుకలు.అతని వేషధారణ బహు విచిత్రం. పైజామా, లాల్చీ వేసుకుని తలపై ఫారిన్ క్యాప్ ధరిస్తాడు. ఒక్కోసారి ధోవతి ధరించి అంగవస్త్రం కప్పుకుంటాడు. మరోసారి అయ్యవారిలా నామాలు పెట్టుకుంటాడు.
సరే.. ఇప్పుడతను ఎటు వెళుతున్నాడు? తిన్నగా పబ్లిక్ గార్డెన్ వైపుకే నడుస్తున్నాడు. అతణ్ని చూసి హెచ్చరికగా మొరగడానికి అక్కడ కుక్కలు లేవు. అతను వెళ్లే దారిలో ఉన్న కుక్కలన్నింటినీ మునిసిపాలిటీ వాళ్లు తీసుకెళ్లిపోయారు. అయితే అది కేవలం అతని కంప్లయింట్ల వల్లనే అని ఆ మునిసిపల్ అధికార్లకి కూడా తెలియదు. అదిగో.. ఎదురుగా పేపర్ అబ్బాయిలు చాలా ఫాస్ట్‌గా సైకిళ్లు తొక్కుతూ వచ్చేస్తున్నారు. ‘అదిగో అద్దాల్ని తీసుకుని వెళుతున్నారు. అద్దాలలో ముఖాలు చూసుకోకపోతే జనాలకి ఏం అర్థం కాదు.. పాపం’ అనుకున్నాడతను. అతనంతే.. పేపర్‌ని ‘అద్దం’ అని పిలుచుకుంటాడు. ప్రజల మనోభావాలకు అద్దం పట్టేవి. ప్రపంచంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలను అద్దంలా చూపించేవి ఆ దిన పత్రికలే కాబట్టి వాటికి ఆ పేరు పెట్టుకున్నాడు. అతని వ్యవహారమే అంత! అంతా కోడ్ భాషలో ఉంటుంది. అతను రాసుకునే డైరీ కూడా కోడ్‌లో ఉంటుంది. అయితే ఈ అలవాటు అతనికెలా అయిందో ఎవరూ చెప్పలేదు. అతను వీధుల్లో నడవడు. అంతా మెయిన్‌రోడ్ల మీదే. అది కూడా మార్నింగ్ వాక్ లాగానూ, జాగింగ్ లాగానూ, రెండూ మిక్స్ చేసిన విధంగానూ ఉంటుంది. అతనిలా ఎన్నాళ్లనుంచి ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు.
అప్పుడే ఆ మసీదు పక్క మెయిన్‌రోడ్డుపై కాఫీ హోటల్ తెరుస్తున్నారు. తెరిచేశారు కూడా. ‘‘మనం ఇంటి దగ్గర కషాయం తాగక ఎన్నిరోజులైందో కదూ.. వెళ్లి కాస్త పుచ్చుకుందాం’’ అని అంది అతని ఆత్మ. అంతరాత్మ.. హోటల్‌కి పెట్టిన పేరు.. అందులో కూర్చున్నాడు. బేరర్ రాగానే ‘‘కషాయం’’ అన్నాడు. బేరర్‌కి తెలుగు సరిగా రాదు. ఏంటి? అన్నట్టు చేత్తో సైగ చేశాడు. అతను గోడపై తగిలించిన పదార్థాల పట్టిక వద్ద వెళ్లి కాఫీ అన్న చోట వేలు పెట్టి చూపించాడు. ‘‘ఓహో.. కాఫీ..’’ అంటూ నవ్వుకుంటూ వెళ్లాడతను. కాఫీ తాగడమయ్యాక గవ్వలు ఇచ్చేసి బయటికొచ్చాడు. గవ్వలంటే డబ్బులు. జేబులో చిల్లిగవ్వలేదంటుంటారు. అందుకే డబ్బుల్ని గవ్వలంటాడతను. మళ్లీ నడక ప్రారంభించాడు. కొందరు యువకులు టీ షర్టులు, షాట్స్ ధరించి జాగింగ్ చేస్తూ వస్తున్నారు. అతను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ నవ్వుకర్థం ఏమిటో అతనికే తెలియదు. ఒకప్పుడు తానూ వాళ్ల మాదిరిగానే నవయవ్వనంలో తుళ్లిపడే కోడెగిత్తలా పరుగెత్తేవాడిననీ, నేడిలా ‘నీడ’ అంటే వయసుపైబడి అలా పరుగెత్తలేకపోతున్నానని ఒక భావం. రేపు మీరు కూడా ఏదో ఒకనాడు నీడ కమ్ముకోగా నాలాగే అవుతారనే ఎద్దేవాభావం.. ఒకటీ అయి ఉండవచ్చు.
పబ్లిక్ గార్డెన్‌కి చేరాడతను. లోపలికి అడుగుపెట్టగానే ఎంత కమ్మని సంగీతం! సంగీతం అక్కడ.. ఆ సమయంలోనా? ఆశ్చర్యపోకండి. ప్రశాంతతకి అతని గ్రామర్‌లో మారుపేరు సంగీతం. ప్రశాంతతకి మించిన కమ్మని సంగీతం ఏదీ ఉండదని అతని గట్టి అభిప్రాయం. పూల చెట్ల మధ్యలో నుంచి వేసిన బండల దారిపై నడుస్తున్నాడు. ‘‘ఈ అమ్మాయిలంతా ఇంకా నిద్దుర లేవలేదు.. పడుకొండి. నిదరపోండి కమ్మగా.. కలలు కనండి హాయిగా. ఓ మైడియర్ స్వీట్‌గాల్స్’’ అన్నాడతను వాటిని చూసి. అవును మరి.. పూలూ, అమ్మాయిలూ ఒకటే కదా.. ఆ రసాస్వాదకుని హృదయం భాషలో... మరైతే అమ్మాయిలనేమని పిలుస్తాడో అని మీకు సందేహం కదూ? అదిగో.. ఒక చోట ఇద్దరు అమ్మాయిలు స్కిప్పింగ్ చేస్తున్నారు. ‘‘హాయ్ చాక్లేట్స్’’ అన్నాడతను. వాళ్లు ముసి ముసిగా నవ్వుకున్నారు. అమ్మాయిలు చాక్లేట్స్‌ని ఇష్టపడతారు. అదే వారికతను పెట్టిన తియ్యని పేరు. అప్పటికే అతనికి నడచినడచి కాళ్లు తీపులు పుడుతున్నట్లుగా అనిపించింది. ఒక మంచంపై కూర్చున్నాడు. గార్డెన్‌లోని రాతి సోఫీలన్నీ అతనికి మంచాలు. కళ్లు మూసుకుని కాసేపు ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఆరుగంటలయింది. వెలుగు కిరణాలు పరిసరాల్ని ఆరబెడుతున్నాయి.
పది నిమిషాల అనంతరం కళ్లు తెరచి అక్కడినుంచి లేచాడతను. మళ్లీ నడక. తోటలో తిరుగుతూ ఏదో పాట పాడుకుంటున్నాడు. పక్కనే నడుస్తున్న యాభై ఏళ్ల వనిత ఆసక్తిగా అతని కూని రాగాలని వింటోంది. వెన్నే పాయసమూ.. పాయసమే ప్రవాహ అమృతమూ.. వెన్నే పాయసమూ... ఆవిడకేమీ అర్థం కాలేదు. కానీ అది ‘‘అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం..’’ అనే పాత పాటకి పేరడీగా భావించి నోటికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతూ, చకచకా అతణ్ని దాటుకుంటూ వెళ్లిపోయింది. అందం వెన్నలాంటిది.. కరిగిపోతుంటుంది. ఆనందం పాయసంలాంటి అనుభూతి. జీవితం ఒక ప్రవాహం మకరందం అమృతం. ఇవన్నీ ఆయన మనసులోని పదకోశం వివరణలు. తెల్లగా తెల్లవారింది. చలాకీగా నడుస్తున్న అతను ఒక్క క్షణం షాక్ తగిలినట్లుగా ఛాతీపై చేయి వేసుకుని అలాగే శిలలా నిలబడిపోయాడు. అతని గుండెలో ఎవరో పదునైన బల్లెంతో గుచ్చిన అనుభూతి. అది హార్ట్ అటాక్ స్ట్రోక్. మొదటిసారిగా అనుభవిస్తున్నాడు. అతనికి నుదుటిపై చెమట పట్టేసింది. ఒళ్లంతా కరెంట్ ప్రసరిస్తున్న భావన. శరీరం మొద్దుబారిపోతోంది. అలాగే కుప్పకూలిపోయాడు. ఎవరో అతని మొహంపై నీళ్లు చిలకరించి, లేపి కూర్చోబెట్టారు.
ఆయన కళ్లు తెరచి ఎదురుగా ఉన్న నడి వయస్కుని మొహంలోకి కృతజ్ఞతగా చూశాడు. ‘‘ధార... ధార..’’ అన్నాడు. ‘‘ఏంటి?’’ అడిగాడా రక్షకుడు. అతని చేతిలోని వాటర్ బాటిల్‌కేసి చూస్తూ ‘‘ధార’’ అన్నాడు. అర్థం చేసుకున్న వాడిలా ఆ బాటిల్ ఎత్తి నీళ్లని అతని నోట్లో ఉంచసాగాడాయన. గుటకలు వేస్తూ నీళ్లు మింగి తెప్పరిల్లాడు. తన ప్రాణాలు కాపాడిన ఆ మహనీయునికి చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘రత్నాలు’’ అన్నాడు. కృతజ్ఞతలు రత్నాలవంటివని ఆ ఎదుటి మనిషికి తెలియక.. ఇతడిని పిచ్చివాడిని చూసినట్టు చూసి తలాడిస్తూ నవ్వాడతను. మన కథానాయకుడు చేతికర్ర ఊతంగా అలాగే లేచి నిలుచున్నాడు. ఆగంతకుడు ముందుకు సాగిపోయాడు. మళ్లీ నడక మొదలు. అయితే మరింత ఎక్కువసేపు నడవలేదతను. ఒక ఆటో ఆపి, ఎక్కి ‘పద’ అన్నట్లు సైగ చేశాడు. ‘‘ఎక్కడికి?’’ అతను తన జేబులోని విజిటింగ్ కార్డు చూపించాడు. అందులో అతని పేరు లేదు. అది నీలిమా టవర్స్‌కి సంబంధించిన అడ్రస్‌కార్డు. కాకపోతే పైన ఒక మూలకు పెన్నుతో నెం. 101 అని మాత్రం రాసి ఉంది.
ఓ పది నిమిషాల్లో ఆటో అపార్ట్‌మెంట్ ముందు ఆగగానే, అతను డబ్బులు చెల్లించి తన గదికేసి నడిచాడు. తలుపులు తెరచి లోనికి వెళ్లాలనుకున్నాడు. అంతలో ఏదో గుర్తుకొచ్చింది. వెంటనే వెనక్కి తిరిగాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న టీ హోటలుకేసి నడిచాడు. హోటలు పక్కనే టెలీఫోన్ బూత్ ఉంది. గ్లాస్ డోర్ నెట్టి లోనికి వెళ్లి కూర్చున్నాడు . ఆయాసంతో అతని ఒళ్లు చిన్నగా కంపిస్తోంది. జేబులో చెయ్యి పోనిచ్చి ఏవో కాగితాలు బయటికి తీశాడు. అందులో ఒక ఫోన్ నంబర్‌ని చూసి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూపించాడు. ఆ పిల్ల ఆ నంబర్‌ని కాగితంపై నోట్ చేసుకుంది. రింగ్ చేసింది. ఆయన ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. వెంటనే తన విజిటింగ్ కార్డ్ తీసి ఆమెకిచ్చి ‘‘ఈ అడ్రసుకి తొమ్మిది గంటలకు రమ్మని చెప్పు’’ అన్నట్లు సైగ చేశాడు. ఆ పిల్ల అతణ్ని అర్థం చేసుకుంది. ఫోన్ రింగవుతోంది. క్షణం తర్వాత ‘హలో’ అందా పాప. అతను ఆమెవైపే చూస్తున్నాడు. ‘‘హలో.. ఈ ఫోన్ నంబర్ ఎవరిదండీ.. లాయర్ పరమహంసగారిదా? ఇక్కడ నీలిమా టవర్స్, నంబర్ 101కి చెందిన ఒక పెద్దాయన ఫోన్ చేస్తున్నారు. తొమ్మిది గంటలకి తన ఇంటికి రమ్మంటున్నారు.’’ అవతల్నుంచి ‘‘అలాగే’’ అని చెప్పడంతో అమ్మాయి ఫోన్ పెట్టేసి ‘‘వస్తానని చెప్పారు’’ అంది. అతను డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టి ‘‘రత్నాలు, వజ్రాలు’’ అని చెప్పి బయటకొచ్చాడు.
ఆ పిల్ల అతనికేసి వింతగానూ, అనూహ్యంగానూ, భయంగానూ, ఇంట్రస్ట్‌గానూ చూస్తూనే ఉంది. అతను ఇల్లు చేరి తాళం తెరచి లోనికి వెళ్లి తలుపేసుకున్నాడు. లాయరు తప్పక వస్తాడని అతనికి తెలుసు. నిజానికి ఇప్పుడతనికి ఎంతో టెన్షన్‌గా, కంగారుగా ఉంది. తనకు మొదటిసారిగా గుండెనొప్పి వచ్చింది. మళ్లీ ఒకటి రెండు సార్లు వస్తే బతకడం అబద్ధం. అందుకే లాయరుతో పని! చేయవలసిన ముఖ్యమైన పనిని తొందరగా ముగించాలి. అదే అతని ఆత్రుత. సమయం ఎక్కువగా లేదు. తొమ్మిది గంటలకి లాయర్ వస్తాడు. ఈలోగా గుండె నొప్పి మరోసారి రావచ్చు. అందుకే త్వరగా తాను రాయదల్చుకున్నది రాయాలి. కానీ, ఏం రాయాలి? టైం చూశాడు. గోడ గడియారంలో ఎనిమిది అవుతోంది. మరోగంట.. ఈలోగా మరోసారి స్ట్రోక్ వచ్చినా రావచ్చు. అతనిప్పుడు ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాడు. లాయర్‌తో మాట్లాడాలి. అందుకే అతని రాక కోసం ఎదురుచూస్తున్నాడు. క్షణాలు బరువుగా.. నత్తలా నడుస్తున్నాయి. అతను తన పాత ట్రంక్ పెట్టె మూత తీసి, తన పాత జ్ఞాపకాలను స్పృశిస్తున్నాడు. ఏవేవో ఫోటోలు చూస్తున్నాడు. ఏవేవో ఉత్తరాలను గుండెకి హత్తుకుని వలవలా కన్నీళ్లు కారుస్తున్నాడు.
టైం గడుస్తోంది. తొమ్మిది గంటలవుతోంది. లాయర్ పరమహంస స్కూటర్ స్టాండ్ వేసి 101 కాలింగ్ బెల్ నొక్కాడు. సమాధానం రాలేదు. డోర్ తెరుచుకోలేదు. ఐదు నిమిషాలు ఆగి తలుపు తోశాడు. అది సునాయాసంగా తెరుచుకుంది. లోపలికి వెళ్లేసరికి వాలుకుర్చీలో కూర్చుని అరమోడ్పు కన్నులతో ఎగశ్వాస పీలుస్తూ అతను... ‘‘హలో సార్..’’ పరమహంస అతని భుజం పెట్టాడు. ‘‘రత్నాలు, వైఢూర్యాలు’’ అంటూ పరమహంస చేతిని అందుకుని, అతను కనురెప్పలు వాల్చాడు. అంతే.. అతనింక కదల్లేదు. పరమహంస బరువుగా నిట్టూర్చాడు. తనని చూశాకగానీ ఈ ముసలాయన తుది శ్వాస విడవలేదు. పాపం.. ఇప్పటివరకూ తన ప్రాణాల్ని ఎలా ఉగ్గబట్టుకున్నాడో! సుమారు రెండు గంటల తర్వాత అక్కడ అనేకమంది పత్రికా విలేకరులూ, టీవీ చానల్స్ ప్రతినిధులూ హాజరై లాయర్ పరమహంస నుండి వివరణల కోసం ఎదురుచూస్తున్నారు. ‘‘ఏంటి సార్.. ఈయన విచిత్రమైన కథ? అసలు ఎవరీయన?’’ ప్రశ్నల పరంపర బిగినైంది. పరమహంస ఒక్క క్షణం భారంగా నిట్టూర్పు విడిచి చెప్పటం ప్రారంభించాడు.
‘‘ఈయన పేరు కార్తికేయ. ఆయనకి తెలియని భారతీయ భాష లేదు. యూనివర్సిటీ నుంచి ఎన్ని యం.ఎ. పట్టాలు పుచ్చుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇతని పుట్టుక ఎక్కడా? ఎవరితో గడిపాడో తెలియదు. కానీ, నిరంతరం భాషల గురించి అ«ధ్యయనం చేయడం ఈయన ప్రవృత్తి. ముఖ్యంగా ఈయన జీవితంలో అది తప్ప వేరే ఆశయం లేనట్లుంది. ఇతను నాకు పది సంవత్సరాల క్రితం వైజాగ్‌లో పరిచయమయ్యాడు. అప్పటికి తాను భాషల గురించి ఎన్నో ముఖ్యమైన సంగతులు సేకరించాననీ, అవన్నీ ఒక పుస్తక రూపంలో తెస్తాననీ అన్నాడు. అయితే వీటన్నింటికీ చెందని కొత్త భాషనొకదానిని తాను కనిపెట్టాలనుకున్నట్లు నాతో చెప్పాడు. అంటే... ఒక పదానికి దాని అర్థంతో సరిపోయే మాటని కొత్తగా చేర్చాలని అతని ఆశయం. ఉదాహరణకి కాఫీని కషాయం అనడం, అంటే జన జీవనంలో నిజమైన అర్థాలనే ప్రాతిపదికగా, ఈ కొత్త భాష ఉండాలని అతగాడి కోరిక. ‘అల్లుడు’ అంటే పరాన్నజీవి అనీ అమ్మాయి అంటే ‘చాక్లెట్’ అని ఇలా వేలాది పదాలకి కొత్త పేర్లు పెట్టేశారు.
కానీ, చివరికి తాను చేసిన ప్రయోగమే తనకు విషమ సమస్యగా తయారైంది. ఏ పదం ఏ వస్తువు కోసం వాడుతున్నాడో, ఏ పదం ఏ భావం కోసం మార్చుకున్నాడో.. తానే మర్చిపోయే స్థితికొచ్చాడు. ఒరిజినల్ పదాలు అతనికి గుర్తే లేకుండా పోయాయి. మీరు ‘కుర్చీ’ అంటే అతనికి ‘పదవి’ గుర్తుకొస్తుంది. అతను ‘ధార’ అంటే మనకు ‘నీళ్లు’ అని తెలియదు. ఇలా అతని మెదడంతా విభిన్న పదాలతోనే నిండిపోయింది. ప్రతిక్షణం ఒరిజినల్ పదం కోసం గుర్తు చేసుకుంటూ.. అది స్ఫురణకి రాక బుర్ర బద్ధలు కొట్టుకుంటూ నానా ఇబ్బంది పడసాగాడు. తాను ఏ పదం దేనికి వాడుతున్నాడో మరిచిపోయి బాధపడుతున్నాడు. చివరిగా.. ఈ రోజు అతనికి గుండెనొప్పి వచ్చింది. అతణ్ని ప్రత్యేక శ్రద్ధతో ఏళ్ల తరబడి పరిశీలించడం వల్ల అతని హృదయ భాష కొంతలో కొంత అర్థం చేసుకోగలను కానీ, ఇప్పుడు అతను తన విల్లును కూడా తన ప్రత్యేక భాషలోనే రాసి కన్ను మూశాడు. ఈ విల్లును ఎలా అధ్యయనం చేయాలో అర్థం కావడం లేదు. ఇతని తుది కోరికకి ఎలా న్యాయం చేయాలో అంతకంటే అర్థం కావటం లేదు..’’ అన్నాడు పరమహంస ఎంతో ఆవేదనగా.
అంతలో ఒక విలేకరి ముందుకు వచ్చి... ‘‘సార్... ఇంతకీ ఈ విచిత్ర వ్యక్తిత్వం గల మనిషి చరిత్ర ద్వారా ప్రజలకి ఏమైనా చెప్పదలచుకున్నారా? ఈయన కృషికి అర్థం ఉందా?’’ అని అడిగాడు. ‘‘యూ ఆర్ రైట్. మనిషి మేధావి. ఆ మేధస్సుకు పరిమితుల్లేవు. కానీ, ఒక నూతన పరిశోధన ఎప్పుడూ జనానికి ప్రయోజనాత్మకంగా, వారి జీవితాలలో వెలుగుని తెచ్చేదిగా ఉండాలి. అంతే తప్ప పనికిరాని ప్రయోగాలతో కార్తికేయలా ఎవ్వరూ కూడా తమ మేధా సంపత్తిని వృథా చేసుకోరాదం’’టూ ముగించాడు లాయర్ పరమహంస. జనం కరతాళ ధ్వనులతో అతని అభిప్రాయాన్ని ఆమోదించారు. కానీ పరమహంస మాత్రం కార్తికేయ హృదయ భాష గురించే ఆలోచిస్తూ వేదనా భరిత హృదయుడై ఉన్నాడు.
హృదయ బాష
Published Sun, May 20 2018 12:35 AM | Last Updated on Sun, May 20 2018 12:35 AM
Advertisement
Advertisement