న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల వేగం అనూహ్యంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చేరికలు పెరిగే ప్రమాదం మరింతకానుంది. దీంతో ఆస్పత్రుల్లో కనీసం 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ప్రైవేట్ వైద్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సేవలు అందుబాటులో ఉన్నందున డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే అందుకు అనుగుణంగా సరఫరా ఉండేలా కార్యాచరణను అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.
ఇన్–పేషెంట్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సేవలందించే కేంద్రాల వద్ద ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ద్రవ ఆక్సిజన్ ట్యాంక్‌లను నింపాలని, రీఫిల్లింగ్ కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, నిండుకుంటే వెంటనే తెప్పించే ఏర్పాట్లూ చేయాలని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ తాజా పరిస్థితిపై గురువారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కేసుల ఉధృతి ఆగటం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్‌ను జలుబుగా లెక్కకట్టొద్దు
కరోనా కేసుల్లో వారపు పాజిటివిటీ మూడొందలకుపైగా జిల్లాల్లో ఐదు శాతాన్ని మించడంతో ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని, తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment