‘బఫర్‌స్టాక్’ భద్రమా?
గోదావరి నది ఉప్పొంగితే దాదాపు పది మండలాల్లో జనజీవనం అతలాకుత లమవుతుంది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తాయి. ఇలాంటి సమయాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మూడు నెలలకు సరిపడా సరుకులు ‘బఫర్‌స్టాక్’ పేరిట నిల్వ చేస్తారు. అయితే విపత్తుల సమయంలో బాధిత ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకులను భద్రపరిచే విషయంలో సంబంధిత శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* భద్రాచలం గోదాములో తడిసి ముద్దయిన బియ్యం
* వాటినే ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలింపు
* నిల్వలపై పూర్తి పర్యవేక్షణ కరువు
భద్రాచలం : గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో ప్రజలకు అందజేసే బఫర్ స్టాక్ నిల్వలపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే ఆరోపణలున్నాయి.
భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసిన బియ్యం ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించే క్రమంలో తడిసిన బియ్యం బస్తాలు వెలుగుచూశాయి. సుమారు వంద బస్తాల వరకూ బియ్యం తడిసిపోయి, బూజు పట్టింది. వీటిలో కొన్ని బస్తాలు పూర్తిగా గడ్డలు కట్టగా, మరికొన్నింటిలో బియ్యం బయటకు రావటంతో వాటిని అక్కడి సిబ్బంది గోదాం కాంపౌండ్ వాల్‌కు సమీపంలో పడేశారు.
ఇలా పడేసిన బియ్యం పందులు, పశువులకు మేతగా మారింది. వీటిని గుర్తించిన సంబంధిత అధికారులు బియ్యాన్ని హడావిడిగా సోమవారం వివిధ మండలాల్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారు. తడిసిపోయిన బియ్యం బస్తాలను కూడా వాటితో పాటుగా తరలించినట్టు సమాచారం. బాగా పాడై బూజు పట్టిన బియ్యాన్ని మహిళా కూలీలతో బాగుచేయించి వాటినే తిరిగి బస్తాల్లో పోశారు. గోదాముల్లో నిల్వ చేసిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఇలా జరిగిందనే విమర్శలు ఉన్నాయి.
ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో బాధిత ప్రజానీకాన్ని ఆదుకునేందుకు గాను ముందుగానే నిత్యావసర సరుకులు నిల్వ చేస్తారు. గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని పది మండలాలతో పాటు, వాగులు పొంగి, దారీతెన్నూ లేని గిరిజన గ్రామాలను ముందుగానే గుర్తించటంతో ఆయా ప్రాంతాల్లో అప్రమత్తత కావాలని కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. భద్రాచలం గోదాములో బియ్యం తడిసిన విషయమై సంబంధిత గోదాం ఇన్చార్జ్ నరసింహారావు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా తడిసిపోయిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
భద్రతపై అనుమానాలు !
గోదావరి నదికి వరదల వచ్చే సమయంలో పంపిణీ చేసేందుకని సిద్ధం చేసిన బఫర్ స్టాక్ భద్రంగానే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలంలోని ఏఎమ్‌సీ గోదాములో నిల్వ చేసిన బియ్యం తడిసిపోగా, మిగతా గోదాముల్లో ఉన్నవాటి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గోదావరి వరదల సమయంలో ప్రజల కోసం మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ముందుగానే ఆయా ప్రాంతాల్లో నిల్వ చేస్తారు.
దమ్మపేటలో 46.077 టన్నులు, పాల్వంచలో 61.596 టన్నులు, ఇల్లెందులో 409.815 టన్నులు, వెంకటాపురంలో 829.983 టన్నులను నిల్వ చేశారు. వీటితో పాటు అదనంగా స్టేజ్ ఒన్ గోదామలుగా ఉన్న భద్రాచలంలో 200 టన్నులు, వెంకటాపురంలో 460 టన్నులు, బూర్గంపాడులో 10 టన్నులను అందుబాటులో ఉంచారు. కానీ భద్రాచలం ఏఎమ్‌సీ గోదాములో ఉన్న బియ్యం బస్తాలు ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే తడిసిపోగా, మిగతా ప్రాంతాల్లో ఉన్న బియ్యం పరిస్థితి ఏంటనే దానిపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
విపత్తుల సమయంలో ఇంత నిర్లక్ష్యమా..?
గోదావరి వరదలు ఈ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకండా చేస్తాయి. అధికారులు సైతం వారికి అందుబాటులో ఉండి రేయింబవళ్లు పనిచేస్తారు. కానీ విపత్తుల సమయంలో బాధిత ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకులను భద్రపరిచే విషయంలో మాత్రం సంబంధిత శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటంపై సర్వ త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను ఉద్యోగులను నియమించినప్పటికీ, వారు విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్నట్లుగా భద్రాచలం ఘటన నిద ర్శనంగా నిలుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ తగిన రీతిలో స్పందించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
గోదాములకు బాధ్యులను నియమించాం
బఫర్ స్టాక్ నిల్వలు ఉంచిన గోదాములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకుగాను బాధ్యులను నియమించాం. భద్రాచలం గోదాములో బియ్యం తడి సిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై వివరాలు తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటాను. - వాణి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్
తడిసిన బియ్యం తీసుకోం
స్టేజ్ వన్‌గా ఉన్న గోదాములతో మాకు సంబంధం లేదు. ఆయా గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన వాటికే మేమే రక్షణగా ఉంటాము. తడిసిన బియ్యం వస్తే తీసుకోం. తమకు సరఫరా అయిన బియ్యాన్ని డిపోలకు చేరవేస్తున్నాము.
- శంకర్, జీసీసీ బ్రాంచ్‌మేనేజర్
వాటితో మాకు సంబంధం లేదు
భద్రాచలం గోదాములో ఉన్న బియ్యం నిల్వలతో మాకెటువంటి సంబంధం లేదు. రేషన్‌డిపోలకు వచ్చినవి భద్రంగా ఉన్నాయా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.
- సైదులు , సివిల్ సప్లై డీటీ