Rajesh Bhushan
-
కోవిడ్ భయాలు.. పండుగ వేళ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగల వేళ కోవిడ్–19 నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని, నాలుగ్గోడల మధ్య వేడుకలు నిర్వహించేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. జిల్లా స్థాయిలో వస్తున్న ఫీవర్ కేసుల్ని కూడా పర్యవేక్షించాలని, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు , జలుబు , జ్వరంతో ఎవరు వచ్చినా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల్లో ఎక్కువ నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ జరపాలని సూచించారు. మరోవైపు శనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఎంపిక చేసిన ప్రయాణికులు, కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని విమానాశ్రయాల్లో సిబ్బందికి కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' కరోనా వ్యాక్సిన్ ప్రచారం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి దేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందువల్ల మళ్లీ ఆ మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా ముందస్తు చర్యగా మరోసారి సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ దిశగా జూన్ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాదు ఇంకా మెదటి, రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవల్సిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడమే కాకుండా అందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. "ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్ డోస్‌లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0' ప్రధాన లక్ష్యాలని తెలిపింది. వ్యాక్సిన్ డ్యూ-లిస్ట్‌ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆసుపత్రులలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికి వ్యాక్సిన్ డోస్‌లు అందేలే సమీక్షించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రకియను సమర్ధవంతంగా నిర్వహించేలా కమ్యూనికేషన్ వ్యూహాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్ సూత్రం ఆధారంగా గడువు ముగిసిపోనున్న బ్యాలెన్స్ వ్యాక్సిన్ మోతాదులను త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వినియోగించిలే క్రియాశీలక పరివేక్షణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్‌కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేశామని చెప్పారు. (చదవండి: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ) -
ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. చదవండి: (ఢిల్లీలో డేంజర్ బెల్స్) -
కరోనా అలర్ట్: నిర్లక్ష్యం వద్దు.. కేంద్రం హెచ్చరిక
దేశంలో కరోనా కథ ముగిసినట్లే కనిపిస్తోంది పరిస్థితి. జన సంచారం మామూలు స్థితికి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియెంట్ బయటపడడం, చైనాలో ఊహించని స్థాయిలో కరోనా విజృంభణ-లాక్డౌన్, అమెరికాతో పాటు దక్షిణాసియా పరిధిలోని కొన్ని దేశాల్లో(దక్షిణ కొరియా, హాంకాంగ్‌లో పరిస్థితి మరీ దారుణం).. కొన్ని యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మన కేంద్రం..రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జనాలు ఇస్టానుసారం తిరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల్లో కేసుల విజృంభణనను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం ఓ లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్. కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ పాటించాలంటూ ఆ లేఖలో కేంద్రం సూచించింది. ఐసీఎంఆర్, ఎన్సీడీసీ National Centre for Disease Control (NCDC) ప్రొటోకాల్స్ పాటిస్తూ.. టెస్టులు చేస్తుండాలని తెలిపింది. అంతేకాదు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఇన్ఫెక్షన్ల తీవ్రత సోకకుండా నియంత్రించాలని సూచించారు లేఖలో. కంటోన్మైట్, క్లస్టర్, డేంజర్ జోన్లను అవసరమైతే ఏర్పాటు చేయాలని కోరింది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, శుభ్రతా తదితర సూచనలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసిన గైడ్‌లెన్స్‌ల గురించి ప్రస్తావించిన కేంద్రం.. పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలంటూ మరోసారి గుర్తు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన మార్చి 16వ తేదీన హై లెవల్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై చర్చించారు. ఆపై మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. కరోనాలో కొవిడ్ కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 149గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 29, 181గా ఉంది. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన యాక్టివ్ కేసుల గణాంకం నమోదు అయ్యింది. భారత్‌లో ఇప్పటిదాకా కరోనా కేసులు 4, 30, 04,005 నమోదు కాగా, మరణాల సంఖ్య 5, 16, 281గా ఉంది. -
తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు సడలింపు
భారత్‌లో కరోనా మహమ్మారి దాదాపు నాలుగు వారాల నుంచి స్థిరమైన క్షీణతను చూపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం జనవరి 21 నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందంటూ అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, నిర్వాహకులకు పంపిన లేఖలో వెల్లడించారు. అంతేకాదు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లావాదేవీలకు అవాంతరం కలగకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద అదనపు ఆంక్షలను తొలగించమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో కరోనా మహమ్మారి ఎపిడెమియాలజీ మారుతున్నందున, కొత్త కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమీకరించి నవీకరించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తదనుగుణంగా ఫిబ్రవరి 10న అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను సవరించిందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడూ కేసుల ఉధృతి, తగ్గుదలను పర్యవేక్షించాల్సిందేనని లేఖలో నొక్కి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, కొత్త కేసులు, సానుకూలత రేటును పరిగణనలోకి తీసుకుని కోవిడ్-19 పరిమితులను సడలించమని కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు. గత వారంలో సగటు రోజువారీ కేసులు 50,476 కాగా, 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయని, రోజువారీ కేసు సానుకూలత రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. (చదవండి: భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!) -
రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల వేగం అనూహ్యంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చేరికలు పెరిగే ప్రమాదం మరింతకానుంది. దీంతో ఆస్పత్రుల్లో కనీసం 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ప్రైవేట్ వైద్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సేవలు అందుబాటులో ఉన్నందున డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే అందుకు అనుగుణంగా సరఫరా ఉండేలా కార్యాచరణను అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ఇన్–పేషెంట్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సేవలందించే కేంద్రాల వద్ద ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ద్రవ ఆక్సిజన్ ట్యాంక్‌లను నింపాలని, రీఫిల్లింగ్ కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, నిండుకుంటే వెంటనే తెప్పించే ఏర్పాట్లూ చేయాలని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ తాజా పరిస్థితిపై గురువారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కేసుల ఉధృతి ఆగటం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ను జలుబుగా లెక్కకట్టొద్దు కరోనా కేసుల్లో వారపు పాజిటివిటీ మూడొందలకుపైగా జిల్లాల్లో ఐదు శాతాన్ని మించడంతో ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని, తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ చెప్పారు. -
ఆస్పత్రిలో చేరే వారు 5–10 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ యాక్టివ్ కేసుల్లో 5–10%కి మాత్రమే ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉంటోందని కేంద్రం తెలిపింది. అయితే, పరిస్థితులు వేగంగా మారే అవకాశాలున్నందున, ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉన్న కేసుల సంఖ్య కూడా పెరగవచ్చని సోమవారం హెచ్చరించింది. అందుకే, హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని రాష్ట్రాలను కోరింది. దేశంలో రెండో వేవ్ సమయంలో యాక్టివ్ కేసుల్లో ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉన్నవి 20–23% వరకు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సోమవారం ఒక లేఖ రాశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ వల్లనే భారీగా కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు. కోవిడ్ సమర్థ యాజమాన్యానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవాలని, ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొత్తం యాక్టివ్ కేసులు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవి, ఆస్పత్రుల్లో ఉన్న కేసులు.. ఇందులో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నవాటిపై సెకండ్ వేవ్ సమయంలో మాదిరిగానే రోజువారీ సమీక్ష జరపాలని రాష్ట్రాలను ఆయన కోరారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారీగా కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలను భూషణ్ ప్రశంసించారు. అయితే, మానవ వనరులు, మౌలిక వసతులకు పరిమితులున్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే కోవిడ్ బాధితుల నుంచి వేర్వేరు వసతులున్న బెడ్లకు వసూలు చేసే ఫీజులు న్యాయబద్ధంగా ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ సెంటర్లు రాత్రి 10 వరకు పనిచేయవచ్చు.. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)ల పనివేళలను నిర్దిష్టంగా నిర్ణయించలేదని కేంద్రం తెలిపింది. -
కోవిడ్‌పై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది. దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. -
కరోనా కేసుల్లో పెరుగుదల.. జాగ్రత్త సుమా!
న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో 8 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఆస్పత్రుల్లో సన్నద్ధతను పటిష్టం చేయాలని కోరింది. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలంది. ఈ మేరకు ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈనెల 29న ∙ఒక లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ప్రయాణా లు, పండగలు, ఉత్సవాల వంటివి పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. ‘ఈ శీతాకాలంలో కాలుష్యం కారణంగా, శ్వాస సంబంధ సమస్యల బారినపడే వారిని క్షుణ్నంగా పరీక్షించాలి. కేసులను సకాలంలో గుర్తిస్తే వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ విషయంలో సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకోవాలి’అని కోరింది. గత వారం కోవిడ్ కేసులతోపాటు పాజిటివిటీ రేటులో పెరుగుదల భారీగా నమోదైన మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌లను ‘స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ కన్సర్న్’గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. గురువారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ ఆక్సిజన్ నిల్వలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
బూస్టర్‌కు డాక్టర్ సర్టిఫికెట్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బూస్టర్ డోసు (ప్రికాషన్ డోసు)ను తీసుకొనేటపుడు.. తమ ఆరోగ్య స్థితిని తెలియజేయడానికి ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. 15–18 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లకు కోవిడ్–19 వ్యాక్సినేషన్, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు వీలుగా జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్ జనవరి 3 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అలాగే బూస్టర్‌డోసును జనవరి 10 తేదీ నుంచి ఇస్తారు. ఈ రెండు కేటగిరీల్లో వారికి విధివిధానాలను వివరిస్తూ రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు... ► 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలున్న వారు బూస్టర్ డోసు కోసం డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన/ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ► వీరు బూస్టర్ తీసుకొనే ముందు తమ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. ► ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణిస్తారు. వీరు కూడా బూస్టర్ డోసుకు అర్హులు. అందరిలాగే రెండోడోసు తీసుకున్న 9 నెలలు/ 39 వారాల తర్వాత బూస్టర్ తీసుకోవచ్చు. ► టీనేజర్ల కోసం ప్రత్యేకంగా కొన్ని టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న టీకా కేంద్రాల్లో కొన్నింటిని టీనేజర్ల కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేసే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ► వయోజనులకు టీకాలు వేస్తున్న రెగ్యులర్ కేంద్రాల్లోనూ టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వారికి ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేయాలి. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లు మిక్స్ కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. ► టీనేజర్లు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 3వ తేదీ నుం చి నేరుగా కేంద్రాలకు వెళ్లి అన్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలిడోసు తీసుకొన్న 28 రోజుల తర్వాత రెండోడోసు తీసుకోవచ్చు. ► టీనేజర్లకు ఇవ్వడానికి ప్రస్తుతం ఒక్క కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉన్నందువల్ల... దీని సరఫరా షెడ్యూల్‌ను రాష్ట్రాలకు త్వరలో కేంద్రం తెలియజేస్తుంది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. కేంద్రానికి ఈసీ కీలక సూచన
ఒమిక్రాన్ భయాందోళనల నడుమ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. 2022 ఏడాది మొదట్లో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి పెరిగే అవకాశాలు ఉండడంతో ఈసీ, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలు, ర్యాలీల నిర్వహణతో కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నడుమ.. సోమవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో భేటీ సందర్భంగా ఈసీ ఈ కీలక సూచన చేసింది. వాయిదా ప్రసక్తే లేదు! ఒమిక్రాన్ విజృంభించే నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే అంశం పరిశీలించాలంటూ ప్రధాని మోదీ, ఈసీని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లపై చీఫ్ ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర స్పందిస్తూ.. యూపీ పరిస్థితుల సమీక్ష తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖతో చర్చలు, ఆయా రాష్ట్రాల్లో పర్యటనకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే సోమవారం చర్చల అనంతరం ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశంలో ఈసీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు వ్యాక్సినేషన్ పెంచాలంటూ కేంద్రంతో చేసిన సూచనలే అందుకు నిదర్శనం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, గోవాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ వంద శాతానికి చేరువైందని, ఉత్తర ప్రదేశ్‌లో 85 శాతం, మణిపూర్ పంజాబ్‌లో 80 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ఈసీ, కేంద్రాన్ని కోరింది. వరుస భేటీలు ఆరోగ్య కార్యదర్శి కాకుండా.. ఇంకోవైపు ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ దళాలను అప్రమత్తం చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఆయా విభాగాల హెడ్లతో సమావేశమవుతోంది. అంతేకాదు పంజాబ్, గోవా ఎన్నికల్లో డ్రగ్స్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్బీఐని సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఈసీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. చదవండి: PM Modi Mann Ki Baat.. స్వీయ అప్రమత్తతే దేశానికి బలం -
ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది: కేంద్రం
ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోందంటూ రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పండుగ-సెలవుల సీజన్ కావడంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఇదివరకే అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పెరుగుతున్న కేసుల వివరాలను వెల్లడిస్తూ.. మరోసారి అప్రమత్తం చేసింది. తాజాగా శుక్రవారం సాయంత్రం దేశంలో నమోదైన Omicron Cases వివరాల్ని యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ ప్రెస్మీట్లో వెల్లడించారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 358 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. ఇందులో 244 యాక్టివ్ కేసులు ఉన్నట్లు, 114 మంది పేషెంట్లు ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో అధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణ 38, తమిళనాడు 34, కర్ణాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్ 22 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. హర్యానా, ఒడిషా, జమ్ము కశ్మీర్, ఏపీ, యూపీ, ఛండీగఢ్, లడక్‌లలో కేసులు నమోదు అయ్యాయి. The top five states with the highest number of active cases, at the moment, are Kerala, Maharashtra, Tamil Nadu, West Bengal and Karnataka: Union Health Secretary Rajesh Bhushan on COVID19 pic.twitter.com/G0fwBQ95f2 — ANI (@ANI) December 24, 2021 ఒక్కరోజులో 122కేసులు రావడం ఆందోళన కలిగించే అంశమని కేంద్రం ప్రకటించింది. వారం కిందట వంద కేసులు, మంగళవారం నాటికి 200 కేసుల మార్క్‌ను చేరుకోగా.. శుక్రవారం నాటికే 350 మార్క్ దాటడం విశేషం. కేసుల్లో 27 శాతం పేషెంట్లు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, స్థానికంగానే వ్యాప్తిచెందిందని వెల్లడించింది. అంతేకాదు 91 శాతం ఒమిక్రాన్ పేషెంట్లు వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లే కావడం గమనార్హం. ఈ తరుణంలో బూస్టర్షాట్ చర్చలు పరిశీలిస్తోంది కేంద్ర ఆరోగ్యశాఖ. ఇక మొత్తం 108 దేశాల్లో లక్షన్నర కేసులు ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించినవి వెలుగుచూశాయి. యూకేలోనే 90వేలు, డెన్మార్క్‌లో 30వేలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఒమిక్రాన్‌కు సంబంధించి 26 మరణాలు నమోదు అయ్యాయి. డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ప్రభావం తక్కువే అయినా.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ఒమిక్రాన్.. యూపీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
Omicron: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. కరోనా నిబంధనలను విధిగా అమలుచేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. 10 రాష్ట్రాల్లోని 27 జిల్లాలో పాజిటివిటి రేటు గత రెండు వారాల్లో పెరుగుతూ వస్తోంది. కేరళ, మిజోరాం, సిక్కింలోని 8 జిల్లాల్లో 10 శాతం పాజిటివిటి రేటు ఉండగా.. మరో 7 రాష్ట్రాల్లో 5 నుంచి 10 పాజిటివిటి రేటు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ అంశాన్ని కూడా పరిశీలించాలని కేంద్రం లేఖలో పేర్కొంది. దవండి: (ఒమిక్రాన్ అలజడి..! భారత్‌ను కుదిపేయనుందా...?) -
కరోనాపై కేంద్రం కీలక ప్రకటన: సెకండ్ వేవ్ ఇంకా పోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటిస్తూ చూసుకోవాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిని వివరించారు. గతవారంతో పోలిస్తే కేరళలో 68శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు.. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కరోనా జాగ్రత్తలు ఇంకా పాటించాలని పండుగలు, ఉత్సవాలు అంటూ గుమికూడొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన వీరు ఏం చేస్తున్నారో తెలుసా? ముఖ్యంగా కేరళలో కరోనా విజృంభణపై రాజేశ్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇది ఇంకా ముగిసిపోలేదని ప్రకటించారు. కాగా దేశంలో కరోనా కేసుల వివరాలు వెల్లడించారు. 24 గంటల్లో 43,263 కొత్తగా కేసులు నమోదయ్యాయని, 338 మంది మృతి చెందారని తెలిపారు. అయితే ఆ కేసుల్లో ఒక్క కేరళలోనే 30,196 పాజిటివ్ కేసులు, 181 మృతులు సంభవించాయని వివరించారు.