న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో 8 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఆస్పత్రుల్లో సన్నద్ధతను పటిష్టం చేయాలని కోరింది. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలంది. ఈ మేరకు ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈనెల 29న ∙ఒక లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ప్రయాణా లు, పండగలు, ఉత్సవాల వంటివి పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది.
‘ఈ శీతాకాలంలో కాలుష్యం కారణంగా, శ్వాస సంబంధ సమస్యల బారినపడే వారిని క్షుణ్నంగా పరీక్షించాలి. కేసులను సకాలంలో గుర్తిస్తే వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ విషయంలో సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకోవాలి’అని కోరింది. గత వారం కోవిడ్ కేసులతోపాటు పాజిటివిటీ రేటులో పెరుగుదల భారీగా నమోదైన మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌లను ‘స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ కన్సర్న్’గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. గురువారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ ఆక్సిజన్ నిల్వలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment