Diagnosis tests
-
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్
సాక్షి, నేషనల్ డెస్క్: క్యాన్సర్ ప్రాణాంతక రోగమని, మొదట్లోనే గుర్తించకుంటే బతకడం కష్టమని అందరికీ తెలుసు. కొన్నిసార్లు వ్యాధిని గుర్తించేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. కొన్నిరకాల క్యాన్సర్లను కనిపెట్టేందుకు పరీక్షలు కూడా లేవు. అయితే ఒకే ఒక రక్తపరీక్షతో చాలారకాల క్యాన్సర్లను ఇట్టే కనిపెట్టేయొచ్చంటే? హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కదా. సరిగ్గా అలాంటి మల్టీ క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) రక్తపరీక్షను సైంటిస్టులు కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించగలగడం ఇందులో పెద్ద విశేషం. ఊపిరి పీల్చుకోదగ్గ విషయం కూడా! ఒకరకంగా ఎంసీఈడీ పరీక్షను వైద్యశాస్త్రంలో, ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కొత్త విధానాలను కనుగొనేందుకు కృషి చేస్తున్న గ్రెయిల్ అనే హెల్త్ కేర్ సంస్థ ఈ సరికొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. వీళ్లంతా 50, అంతకన్నా ఎక్కువ వయసు వ్యక్తులే కావడం గమనార్హం. ప్యారిస్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ (ఈస్‌ఎంఓ) కాంగ్రెస్‌లో గ్రెయిల్ తమ పరిశోధన వివరాలను సమర్పించింది. ఆరువేల పై చిలుకు మందిపై పరీక్ష నిర్వహిస్తే వారిలో దాదాపు ఒక శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీటిలో కొన్ని ఇప్పటిదాకా పరీక్షలకు దొరకని క్యాన్సర్ రకాలు కూడా ఉండటం విశేషం. దీన్ని క్యాన్సర్ పరిశోధనలను సమూలంగా మార్చివేసే పరీక్ష విధానంగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అయిన గాలెరీ (ఎంసీఈడీ–ఈ)ని మరింతగా ఆధునీకరించి వ్యాధిని మరింత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు. గాలెరీ పరీక్ష ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుంది. వాటిలో లక్షణాలు కనపడని క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంసీఈడీ పరీక్ష పద్ధతిలో దాదాపు రెట్టింపు స్థాయిలో క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే వీలుంది. గాలెరీ పరీక్ష ద్వారానే కాలేయం, చిన్న పేగు, యుటెరస్, పాంక్రియాటిక్ స్టేజ్–2, బోన్ క్యాన్సర్ వంటివాటిని లక్షణాలు లేని స్థాయిలోనే గుర్తించే వీలుంది. అయితే కొత్త పద్ధతి మరిన్ని రకాల క్యాన్సర్లను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. కొత్త పరీక్ష (ఎంసీఈడీ)లో 92 మందిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించారు. పైగా 97 శాతం కచ్చితత్వముంది. ఇలా గుర్తించిన 36 రకాల క్యాన్సర్లలో 71 శాతం క్యాన్సర్లను నిర్ధారించే అవకాశం ఇప్పటిదాకా ఉండేది కాదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్సా విధానంలో కూడా పెను మార్పులు రానున్నాయి. అయితే ఇది క్లినికల్‌గా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్ -
కరోనా కేసుల్లో పెరుగుదల.. జాగ్రత్త సుమా!
న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో 8 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఆస్పత్రుల్లో సన్నద్ధతను పటిష్టం చేయాలని కోరింది. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలంది. ఈ మేరకు ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈనెల 29న ∙ఒక లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ప్రయాణా లు, పండగలు, ఉత్సవాల వంటివి పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. ‘ఈ శీతాకాలంలో కాలుష్యం కారణంగా, శ్వాస సంబంధ సమస్యల బారినపడే వారిని క్షుణ్నంగా పరీక్షించాలి. కేసులను సకాలంలో గుర్తిస్తే వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ విషయంలో సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకోవాలి’అని కోరింది. గత వారం కోవిడ్ కేసులతోపాటు పాజిటివిటీ రేటులో పెరుగుదల భారీగా నమోదైన మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌లను ‘స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ కన్సర్న్’గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. గురువారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ ఆక్సిజన్ నిల్వలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
గంటలోపే స్వైన్‌ఫ్లూ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయని, అయితే కరోనా (కోవిడ్) వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకున్న ముందస్తు ప్రణాళికలను కూడా తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడిన రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సహాయం అందడం లేదని నగరానికి చెందిన డాక్టర్ కరుణ, మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో పాటు, న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. స్వైన్‌ఫ్లూ పరీక్షా కేంద్రాలు మూడు మాత్రమే ఉన్నాయని, మరో 14 చోట్ల ఏర్పాటు చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్తు వివరించారు. మార్చి నెలాఖరులోగా ఈ యంత్రాలు వినియోగంలోకి వస్తాయని, ఇవి వస్తే ఒక చిప్ ద్వారా అనుమానితుడిని పరీక్షించి ఒక్క గంట వ్యవధిలోనే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెలువరించ వచ్చునని తెలిపారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించే యం త్రాలు నారాయణ గూడలోని ఐపీఎం, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రుల్లోనే ఉన్నాయని చెప్పారు. కొత్తగా కొనుగోలు చేయ బోయే యంత్రాలను కింగ్ కోఠి, ఖమ్మం, గద్వాల, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రులు, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, భువనగిరి ఏరియా ఆస్పత్రులు, బార్కాస్, హుజూరాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, శామీర్‌పేట, పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 187 స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ ప్రభుత్వాసుపత్రుల్లో 253 స్వైన్‌ఫ్లూ నమూనాలను పరీక్షిస్తే 26 మందికి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1,200 నమూనాలను పరీక్షిస్తే 161 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్వైన్‌ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. స్వైన్‌ఫ్లూ సాంకేతిక కమిటీ గత జనవరి 2న సమావేశమైందని, జిల్లా స్థాయిలో అవగాహనా సమావేశాల నిర్వహణ, నమూనాల సేకరణ, ఇతర అంశాలపై శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల పోస్టర్లు, 15 లక్షల కరపత్రాలను ముద్రించామని, ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డీఈవోలను ఆదేశించామన్నారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. వాదనల అనంతరం కోవిడ్‌పై తీసుకున్న జాగ్రత్తలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ మార్చి 6కి వాయిదా వేసింది. -
కేన్సర్ ముందే గుర్తిస్తే 90 శాతం సేఫ్
విమలమ్మ... 81 ఏళ్లవృద్ధురాలు. హైదరాబాద్‌కు చెందిన ఈమె రొమ్ము కేన్సర్‌తో ఆరేళ్ల క్రితం ఎంఎన్‌జే ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు సంపూర్ణంగా వైద్యం చేశారు. ఇప్పుడుఉత్సాహంగా ఉంటోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన వినయ్ రాయుడుకు నాలుగేళ్లప్పుడు కేన్సర్ వచి్చంది. 2009 ఫిబ్రవరిలో ఎంఎన్‌జేకు తీసుకొచ్చారు. వైద్యులు ఆ బాలుడి కేన్సర్‌ను పూర్తిగా నయం చేశారు. ఇప్పుడతను ఇతర విద్యార్థుల్లానే తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వచ్చినా బయటపడి జీవించొచ్చు అనేందుకు ఇలాంటి వారెందరో ఉదాహరణ. తొలి రెండు దశల్లో కేన్సర్‌ను గుర్తించి వైద్యం చేయించుకున్న వారిలో 10 నుంచి 15 ఏళ్లు బతికినవారు ప్రభుత్వ రికార్డుల్లో చాలా మందే ఉన్నారు. కొన్ని కేన్సర్లు ఏ దశలో ఉన్నా 80% బతికే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కేన్సర్ వచ్చినవారు చికిత్స అనంతరం 15 ఏళ్ల వరకు బతకడం సర్వసాధారణం. 10 శాతం పిల్లలకు... మొత్తం కేన్సర్ రోగుల్లో 10% మంది పిల్లలు ఉంటున్నారు. పిల్లల్లో ఎక్కువగా ఒకటి నుంచి పదేళ్లలోపు వారే అధికంగా ఉంటా రు. వీరికి రక్త సంబంధిత కేన్సర్ అధికంగా వస్తుంటుంది. జెనిటిక్ మ్యుటేషన్ వల్ల పిల్లల్లో కేన్సర్ వస్తుంటుంది. పిల్లలకు వచ్చే కేన్సర్లలో 70 నుంచి 80% వరకు నయం చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో 3వ దశలో వచ్చే కేన్సర్ రోగుల్లోనూ సగం మందిని బతికించవచ్చు. నాలుగో దశలో వస్తే 25% మందిని బతికించవచ్చు. అదే ఒకట్రెండు దశల్లో వస్తే 80 నుంచి 90% మంది పిల్లల క్యాన్సర్లను నయం చేయడానికి వీలుంటుంది. 35 ఏళ్లు దాటితే స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి... గతంలో 50 ఏళ్లు దాటిన వారిలోనే కేన్సర్‌ను చూసేవారం. ఇప్పుడు 35 ఏళ్లు దాటిన వారిలోనూ ఎక్కువగా వస్తోంది. కేన్సర్‌లో 25 శాతం సరై్వకల్, 25 శాతం రొమ్ము, 40 శాతం పొగాకుతో వచ్చే గొంతు, ఊపరితిత్తులు వంటివి కాగా, 10 శాతం జీవనశైలిలో మార్పుల ద్వారా, జన్యుపరమైన కారణాల ద్వారా వస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ప్రతీ ఏడాది కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ టీకా వేయించడం ద్వారా సరై్వకల్ కేన్సర్ రాకుండా నియంత్రించవచ్చు. 50 ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ చేయించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా ఆసుపత్రులకు వస్తున్నారు. అయినా రాష్ట్రంలో కేన్సర్ వచి్చనవారిలో 60 శాతం మందికి నయమై సాధారణ జీవితం అనుభవిస్తున్నారు. లక్షణాలివి... మూడు వారాలకు మించి ఎక్కువ రోజులు జ్వరం ఉండటంతోపాటు తరచుగా రావడం. ఆకలి లేకపోవడం, బరువు గణనీయంగా తగ్గిపోవడం ఏదైనా వ్యాధి వస్తే రొటీన్ మందులకు తగ్గకపోవడం నిత్యం దగ్గు రావడం, రక్తం పడటం రక్తంతో కూడిన వీరేచనాలు పీరియడ్స్ తర్వాతా రక్తస్రావం అవడం కేన్సర్‌ను గుర్తించడానికి అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు రాష్ట్రంలో ఎక్కడైనా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేమే అన్ని రకాల పరీక్ష పరికరాలను వెంట తీసుకొచ్చి చేస్తాం. వివిధ సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదిస్తే పరీక్షలు చేస్తాం. స్క్రీనింగ్‌తో ముందస్తు గుర్తిస్తే ప్రమాదం ఉండదు. – డాక్టర్ జయలత, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, హైదరాబాద్. థైరాయిడ్ కేన్సర్ వస్తే పూర్తిగా నయం చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్‌ను మొదటి దశలో తీసుకొస్తే 95% బతికించడానికి వీలుంటుంది. 2వ దశలో 80%, 3వ దశలో 60% వరకు బతికించడానికి వీలుంటుంది. – డాక్టర్ సౌమ్య కోరుకొండ, సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్. రొమ్ము కేన్సర్ వస్తే గతంలో పూర్తిగా తీసేసేవారు. ఇప్పుడు ఎంతవరకు కేన్సర్ సోకిందో అంతవరకే సర్జరీ చేయడం ద్వారా తీసేస్తున్నాం. మూడు నాలుగో దశలోనూ రొమ్ము కేన్సర్‌ను నయం చేయడానికి వీలుంటుంది. – డాక్టర్ ఉమాకాంత్‌గౌడ్, సర్జికల్ ఆంకాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంఎన్‌జే. -
త్వరలో ఎలక్ట్రానిక్ ద్రావణాలు
లండన్: వ్యాధి నిర్ధారణకు త్వరలోనే ఓ వినూత్నమైన విధానం అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా రూపంలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సెన్సర్లు కలిగిన ద్రావణాన్ని తాగడం ద్వారా అనారోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్లు పరిమాణంలో ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఫ్రాన్స్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌కు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు ఇది అందుబాటులోకి వస్తే కేన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణా పద్ధతులు సులువవుతాయని పేర్కొన్నారు. -
రూపాయి ఖర్చు లేకుండా వైద్యం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ‘ఇటీవల మా బృందం రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడి ఆసుపత్రుల్లో పేద రోగి ఓపీ టికెట్ తీసుకుంటే చాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 350 రకాల మందులు అన్నీ ఆసుపత్రిలోనే సమకూరుతున్నాయి. ఒక్క రూపాయి ఖర్చులేకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వైద్య సేవలు అందుతున్నాయి. అందుకే మన రాష్ట్రంలోనూ ఇలాంటి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం’ అని వైద్య విద్య రాష్ట్ర సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ కె.వెంకటేష్ చెప్పారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రేడియాలజీ విభాగంలో రెండు 500 ఎంఏ ఎక్స్‌రే యూనిట్ ప్లాంట్లు, కార్డియాలజీ విభాగంలో డైకామిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ కె. వెంకటేష్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఇక్కడి వైద్యులతో మాట్లాడి అవసరమైన పరికరాలు, సౌకర్యాలపై నివేదిక తీసుకున్నట్లు చెప్పారు. ఆ మేరకు సౌకర్యాలను సమకూరుస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే మూడు, నాలుగు వారాల సమయం పడుతోందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న కొన్ని గంటల్లోపే రిపోర్ట్ చేతికి అందేలా చూస్తామన్నారు. ఇందుకోసం ఆసుపత్రిలో అదనంగా అత్యాధునిక ఎంఆర్ఐ, సీటీస్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో మల్టిపుల్ అనలైజర్ పరికరాన్ని ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తద్వారా అన్ని రకాల హార్మోన్ టెస్ట్‌లు నిర్వహించే వీలుంటుందన్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం రోగులు అటూఇటూ తిరగకుండా కామన్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఆసుపత్రి, కళాశాలలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ యేడాది ప్రధానంగా వైద్యశాలలో వ్యాధి నిర్ధారణ పరికరాలు, పీజీ సీట్ల పెంపుపైనే దృష్టి సారించామన్నారు. తాను మరోసారి పర్యటనకు వచ్చేలోపు పరికరాలన్నీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైద్యశాలలో పీజీ, హౌస్సర్జన్ల వసతి గృహాల ఆధునీకరణకు నిధులు విడుదల చేస్తామని.. ప్రతి ఒక్కరూ వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రేడియాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్తమాలజీలలో అదనపు పీజీ సీట్లకు డీఎంఈ విశేష కృషి చేశారని అభినందించారు. త్వరలో సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లోనూ డీఎం సీట్లను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో డీఎం సీట్ల మంజూరు, పరికరాల కొరత తీర్చాలని కోరారు. కళాశాల పూర్వ విద్యార్థిగా డీఎంఈ కె.వెంకటేష్ ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ నరసింహరావు, ప్రభాకర్‌రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ జిక్కి, వైద్యులు జోజిరెడ్డి, పి.చంద్రశేఖర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.