కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ‘ఇటీవల మా బృందం రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడి ఆసుపత్రుల్లో పేద రోగి ఓపీ టికెట్ తీసుకుంటే చాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 350 రకాల మందులు అన్నీ ఆసుపత్రిలోనే సమకూరుతున్నాయి. ఒక్క రూపాయి ఖర్చులేకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వైద్య సేవలు అందుతున్నాయి. అందుకే మన రాష్ట్రంలోనూ ఇలాంటి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం’ అని వైద్య విద్య రాష్ట్ర సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ కె.వెంకటేష్ చెప్పారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రేడియాలజీ విభాగంలో రెండు 500 ఎంఏ ఎక్స్‌రే యూనిట్ ప్లాంట్లు, కార్డియాలజీ విభాగంలో డైకామిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ కె. వెంకటేష్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఇక్కడి వైద్యులతో మాట్లాడి అవసరమైన పరికరాలు, సౌకర్యాలపై నివేదిక తీసుకున్నట్లు చెప్పారు. ఆ మేరకు సౌకర్యాలను సమకూరుస్తున్నామన్నారు.
ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే మూడు, నాలుగు వారాల సమయం పడుతోందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న కొన్ని గంటల్లోపే రిపోర్ట్ చేతికి అందేలా చూస్తామన్నారు. ఇందుకోసం ఆసుపత్రిలో అదనంగా అత్యాధునిక ఎంఆర్‌ఐ, సీటీస్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో మల్టిపుల్ అనలైజర్ పరికరాన్ని ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
తద్వారా అన్ని రకాల హార్మోన్ టెస్ట్‌లు నిర్వహించే వీలుంటుందన్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం రోగులు అటూఇటూ తిరగకుండా కామన్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఆసుపత్రి, కళాశాలలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ యేడాది ప్రధానంగా వైద్యశాలలో వ్యాధి నిర్ధారణ పరికరాలు, పీజీ సీట్ల పెంపుపైనే దృష్టి సారించామన్నారు. తాను మరోసారి పర్యటనకు వచ్చేలోపు పరికరాలన్నీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైద్యశాలలో పీజీ, హౌస్‌సర్జన్ల వసతి గృహాల ఆధునీకరణకు నిధులు విడుదల చేస్తామని.. ప్రతి ఒక్కరూ వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రేడియాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్తమాలజీలలో అదనపు పీజీ సీట్లకు డీఎంఈ విశేష కృషి చేశారని అభినందించారు. త్వరలో సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లోనూ డీఎం సీట్లను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో డీఎం సీట్ల మంజూరు, పరికరాల కొరత తీర్చాలని కోరారు. కళాశాల పూర్వ విద్యార్థిగా డీఎంఈ కె.వెంకటేష్ ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ నరసింహరావు, ప్రభాకర్‌రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ జిక్కి, వైద్యులు జోజిరెడ్డి, పి.చంద్రశేఖర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
రూపాయి ఖర్చు లేకుండా వైద్యం
Published Tue, Feb 4 2014 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:32 PM
Advertisement
Advertisement