Out patient ticket
-
వైద్య ఆరోగ్యశాఖలో ఆధార్ బయోమెట్రిక్ విధానం.. అదుర్స్..!
వికారాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటే ఇక నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఔట్ పేషెంట్లో వైద్య సేవలు పొందాలనుకునే రోగులు రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ యంత్రంలో వేలు పెడితే రోగి వివరాలు, చిరునామా ప్రత్యక్షమవుతాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య ఇక నుంచి పక్కాగా నమోదు కానుంది. గతంలో రోజు వారి ఓపీ వివరాలను ఓ రిజిస్టర్లో రాసి, భాదితుడి ఆరోగ్య సమస్యలను బట్టి ఫలానా డాక్టర్‌ను కలవాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవారు. కొన్ని సార్లు అక్కడి సిబ్బంది ఓపీ సంఖ్యను ఎక్కువ చేసి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మాన్యువల్‌గా తీసుకునే ఓపీ వివరాలను ప్రతీ రోజు ఉన్నతాధికురాలకు పంపించాలంటే సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తేవి. ఈ ఇబ్బందులను తొలగించడంతో పాటు, రోజు వారీగా ఓపీ సేవలు ఎంతమంది పొందుతున్నారనే విషయం తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ చీటీ పొందాలంటే పేషెంట్ పేరు, ఊరు, ఆధార్ నెంబర్ తప్పకుండా చెప్పాల్సిందే. వెంటనే బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పూర్తి వివరాలు నమోదు చేస్తుండటంతో ఓపీ సేవలపై నజర్ వేసేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బయోమెట్రిక్ విధానం ప్రారంభమై వారం రోజులే కావడంతో ఈ సమాచారం తెలియక చాలా మంది ఆధార్ కార్డు లేకుండానే ఓపీ సేవలకు వస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ నెంబర్ చెప్పని వారి వివరాలు నమోదు చేసుకుని ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. రెండోసారి ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ నెంబర్ తీసుకురావాలని సిబ్బంది రోగులకు సూచిస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. అవసరమైతే నిమ్స్ తరహాలో సాయంత్రం వచ్చే రోగుల నుంచి నామమాత్రంగా ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తోంది. ఫలితంగా రోగులకు వైద్య సేవలు విస్తరించడంతో పాటు, వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపై దృష్టిపెట్టకుండా నివారించొచ్చని భావిస్తోంది. అంతేకాదు సాయంత్రం ఓపీ సేవలు విస్తరిస్తే అనేకమంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని సర్కారు భావిస్తోంది. ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులన్నింటిలోనూ ఓపీ సేవలను సాయంత్రం విస్తరించే అంశంపై ఇటీవల వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు షిఫ్ట్‌ల విధానం.. ఉన్న వనరులతోనే ప్రభుత్వ ఆసుపత్రు లను అత్యంత మెరుగ్గా నడపాలని సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం నిమ్స్‌లో మధ్యాహ్నం వరకు ఓపీ ఉంటుంది. సాయంత్రం మళ్లీ ఓపీ నిర్వహిస్తారు. ఉదయం ఓపీ ఉచితం. సాయంత్రం మాత్రం కన్సల్టెంటు ఫీజు కింద ప్రతి రోగి నుంచి రూ.500 వసూలు చేస్తారు. అందులో సగం అంటే రూ.250 డాక్టర్‌కు ఇస్తారు. అయితే మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ మధ్యాహ్నమే ముగుస్తుంది. అందుకే సాయంత్రం ఓపీ సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగుల కోసం సాయంత్రం ఓపీ తెరవాలని గతంలోనే నిర్ణయించారు. కానీ అది అమలు కావట్లేదని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఇతరులకూ సాయంత్రం వైద్య సేవలు అందించేలా, నామమాత్రపు ఫీజు వసూలు చేసేలా చేయాలని భావిస్తున్నారు. అయితే సాయంత్రం ఓపీ పద్ధతిని కొందరు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం ప్రైవేటు ప్రాక్టీసు ఉన్న వైద్యులకు షిఫ్ట్ విధానం ఇబ్బందిగా మారనుంది. -
‘గాంధీ’లో ఓపీ చిట్టీల దందా
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అవుట్‌పేషెంట్ విభాగంలో ఓపీ చిట్టీలు ఇచ్చే సిబ్బంది దురుసు ప్రవర్తన కారణంగా నిరుపేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న రోగులను కాదని సిబ్బంది తమ అనుయాయులు, తెలిసినవారికి క్షణాల్లో ఓపీ చిట్టీలు అందిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకొమ్మంటూ కసురుకుంటున్నారు.సాక్షాత్తు ఓపీ ఇన్చార్జి ఏఆర్ఎంఓ సైతం ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారి సమస్య వినకుండానే కంప్యూటర్ హ్యాంగ్ అయ్యిందట, ఇలాంటి సహజమే అంటూ సదరు సిబ్బందిని వెనకేసుకుకు రావడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జిల్లాలతోపాటు నగరం నలుమూలల నుంచి వేలాదిమంది రోగులు నిత్యం గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగానికి వస్తుంటారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు ఏర్పాటు చేయడంలో ఆస్పత్రి యంత్రాంగం విఫలం కావడంతో చిట్టీల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ఓపీ చిట్టీలు ఇచ్చే సిబ్బందితో చేతులు కలిపి చిట్టీ రూ. 50 నుంచి 100 చొప్పున అమ్మకునేవారు. ఈ ఓపీ చిట్టీల దందాను ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఓపీ చిట్టీల కౌంటర్లకు తాళం వేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ మహిళ కాంట్రాక్టు ఉద్యోగి చిట్టీల కోసం వెళ్లిన వారితో దురుసుగా ప్రవర్తించింది. నేను ఇవ్వను పక్క కౌంటర్లో తీసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గట్టిగా నిలదీయడంతో కంప్యూటర్ హ్యాంగ్ అయ్యిందంటూ తప్పించుకునేందుకు యత్నించింది. అదే సమయంలో తెలిసిన వ్యక్తి వచ్చి అడిగితే క్షణాల్లో ఓపీ చిట్టీ ఇచ్చింది. ఈ తతంగాన్నంతా సదరు వ్యక్తి వీడియో తీసి ఓపీ ఇన్చార్జి ఆర్ఎంఓ ప్రభుకిరణ్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఫిర్యాదు వినకుండానే కంప్యూటర్ హ్యాంగ్ అయ్యిందంటూ సదరు మహిళా ఉద్యోగిని వెనకేసుకురావడం గమనార్హం. తక్షణమే ఆస్పత్రి పాలనయంత్రాంగం స్పందించి చిట్టీల దందాను నివారించాలని, దందాలో ఆర్‌ఎంఓల పాత్రపై సమగ్ర విచారణ చేపట్టాలని, రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై తగిన చర్యలు చేపట్టాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. -
రూపాయి ఖర్చు లేకుండా వైద్యం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ‘ఇటీవల మా బృందం రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడి ఆసుపత్రుల్లో పేద రోగి ఓపీ టికెట్ తీసుకుంటే చాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 350 రకాల మందులు అన్నీ ఆసుపత్రిలోనే సమకూరుతున్నాయి. ఒక్క రూపాయి ఖర్చులేకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వైద్య సేవలు అందుతున్నాయి. అందుకే మన రాష్ట్రంలోనూ ఇలాంటి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం’ అని వైద్య విద్య రాష్ట్ర సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ కె.వెంకటేష్ చెప్పారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రేడియాలజీ విభాగంలో రెండు 500 ఎంఏ ఎక్స్‌రే యూనిట్ ప్లాంట్లు, కార్డియాలజీ విభాగంలో డైకామిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ కె. వెంకటేష్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఇక్కడి వైద్యులతో మాట్లాడి అవసరమైన పరికరాలు, సౌకర్యాలపై నివేదిక తీసుకున్నట్లు చెప్పారు. ఆ మేరకు సౌకర్యాలను సమకూరుస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే మూడు, నాలుగు వారాల సమయం పడుతోందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న కొన్ని గంటల్లోపే రిపోర్ట్ చేతికి అందేలా చూస్తామన్నారు. ఇందుకోసం ఆసుపత్రిలో అదనంగా అత్యాధునిక ఎంఆర్ఐ, సీటీస్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో మల్టిపుల్ అనలైజర్ పరికరాన్ని ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తద్వారా అన్ని రకాల హార్మోన్ టెస్ట్‌లు నిర్వహించే వీలుంటుందన్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం రోగులు అటూఇటూ తిరగకుండా కామన్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఆసుపత్రి, కళాశాలలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ యేడాది ప్రధానంగా వైద్యశాలలో వ్యాధి నిర్ధారణ పరికరాలు, పీజీ సీట్ల పెంపుపైనే దృష్టి సారించామన్నారు. తాను మరోసారి పర్యటనకు వచ్చేలోపు పరికరాలన్నీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైద్యశాలలో పీజీ, హౌస్సర్జన్ల వసతి గృహాల ఆధునీకరణకు నిధులు విడుదల చేస్తామని.. ప్రతి ఒక్కరూ వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రేడియాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్తమాలజీలలో అదనపు పీజీ సీట్లకు డీఎంఈ విశేష కృషి చేశారని అభినందించారు. త్వరలో సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లోనూ డీఎం సీట్లను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో డీఎం సీట్ల మంజూరు, పరికరాల కొరత తీర్చాలని కోరారు. కళాశాల పూర్వ విద్యార్థిగా డీఎంఈ కె.వెంకటేష్ ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ నరసింహరావు, ప్రభాకర్‌రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ జిక్కి, వైద్యులు జోజిరెడ్డి, పి.చంద్రశేఖర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.