వికారాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటే ఇక నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఔట్ పేషెంట్‌లో వైద్య సేవలు పొందాలనుకునే రోగులు రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ యంత్రంలో వేలు పెడితే రోగి వివరాలు, చిరునామా ప్రత్యక్షమవుతాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య ఇక నుంచి పక్కాగా నమోదు కానుంది.
గతంలో రోజు వారి ఓపీ వివరాలను ఓ రిజిస్టర్‌లో రాసి, భాదితుడి ఆరోగ్య సమస్యలను బట్టి ఫలానా డాక్టర్‌ను కలవాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవారు. కొన్ని సార్లు అక్కడి సిబ్బంది ఓపీ సంఖ్యను ఎక్కువ చేసి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మాన్యువల్‌గా తీసుకునే ఓపీ వివరాలను ప్రతీ రోజు ఉన్నతాధికురాలకు పంపించాలంటే సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తేవి.
ఈ ఇబ్బందులను తొలగించడంతో పాటు, రోజు వారీగా ఓపీ సేవలు ఎంతమంది పొందుతున్నారనే విషయం తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ చీటీ పొందాలంటే పేషెంట్ పేరు, ఊరు, ఆధార్ నెంబర్ తప్పకుండా చెప్పాల్సిందే. వెంటనే బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పూర్తి వివరాలు నమోదు చేస్తుండటంతో ఓపీ సేవలపై నజర్ వేసేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.
ఈ బయోమెట్రిక్ విధానం ప్రారంభమై వారం రోజులే కావడంతో ఈ సమాచారం తెలియక చాలా మంది ఆధార్ కార్డు లేకుండానే ఓపీ సేవలకు వస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ నెంబర్ చెప్పని వారి వివరాలు నమోదు చేసుకుని ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. రెండోసారి ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ నెంబర్ తీసుకురావాలని సిబ్బంది రోగులకు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment