సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
వికారాబాద్: ఐదేళ్లపాటు పార్టీ పదవులు పొంది ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ను వీడటం దారుణమని, ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కొంతమంది నాయకులు బీఆర్‌ఎస్‌లో పదవులు పొంది కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు.
ఇటీవల పార్టీని వీడిన వారిని పరుష పదజాలంతో దూషించారు. అవకాశం మించిపోలేదని పార్టీ నుంచి వెళ్లిన వారు తిరిగి వస్తే ఆదరిస్తామని అన్నారు. అలా కాకుండా పార్టీకి నష్టం కలిగిస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీకి బుద్ధి చెప్పానని గుర్తు చేశారు. ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిందన్నారు.
దేశంలో ఎవరూ చేయలేని సాహసం తాను చేశానని అన్నారు. తాండూరు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాను గతంలో పార్టీ మారినట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి ఆగరాదనే తాను, మంత్రి మహేందర్‌రెడ్డి కలవడం జరిగిందన్నారు.
ప్రజలు తన వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వీణా, పీఏసీఎస్ చైర్మన్లు రవిగౌడ్, సురేందర్‌రెడ్డి, వెంకట్రామ్‌రెడ్డి, పార్టీ యాలాల మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు కరణం పురుషోత్తంరావు, అజయ్ ప్రసాద్, శ్రీనివాస్, శ్రీనివాసాచారి, శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment