వికారాబాద్: పిల్లలకు చిన్న గాయమైతేనే కన్నపేగు అల్లాడిపోతుంది.. అలాంటిది ఏడేళ్లుగా నయం కాని వ్యాధితో చిన్నారి కళ్ల ముందు నేలకే పరిమితమైతే ఆ తల్లిదండ్రుల బాధ, వ్యథ చెప్పడానికి కూడా వీలుకాదు.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చౌడాపూర్ మండలంలోని అబ్దుల్ ఉస్మాన్ కుటుంబం.
మందిపల్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఐదేళ్ల వరకు పెద్ద కూతురు అబ్దుల్ ఐశ(15) ఎంతో ఆరోగ్యంగా ఉండేది. రెండో తరగతి చదువుకునే సమయంలో ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది. అప్పుడు సర్జరీ చేశారు. అప్పటి నుంచి బాలికలో ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు క్యాల్షియం లోపం వెంటాడింది. ఐశను గట్టిగా పట్టుకున్నా ఎముకలు విరిగిపోయేవి.
దీంతో తల్లిదండ్రులు బాలికను పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ ఫలితం కనిపించలేదు. పేద కుటుంబ కావడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఐశ ఆరోగ్యం మరింత దెబ్బతింది. దీంతో రెండు నెలల పాటు ఆస్పత్రిలో ఉంచారు. ఖర్చులు ఎక్కువ కావడంతో ఇటీవలే ఇంటికి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె ఆక్సిజన్‌పై నెట్టుకొస్తోంది. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆటో నడిస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితిలో కూతురి వైద్యం కోసం నెలకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని అబ్దుల్ ఉస్మాన్ తెలిపారు. ఇన్వర్టర్, కరెంటు బిల్లు రూ. 2వేలు, వాతావరణం వేడిగా ఉండడం కోసం ఓ యంత్రం, ఆక్సిజన్ మిషన్‌కు నెలకు రూ. 6 వేలు, ఇతర ఖర్చులు మరో రెండు వేలు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు.
ఐశ స్వతహాగా ఏ పని చేసుకోలేదని, భోజనం కూడా తినిపించాలి ఉంటుందని, ధ్రవ పదార్థాలే ఎక్కువ ఇస్తున్నట్లు తెలిపారు. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఎవరో ఒకరు పక్కనే ఉండి చూసుకోవాలని తల్లి తెలిపింది. ఆక్సిజన్ మిషన్ పెట్టడం వల్ల కరెంటు పోకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మూడు గంటలపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఐశను సబ్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడే పడుకోవాల్సి వచ్చిందని బోరున విలపించారు.
ప్రస్తుతం వికలాంగ పింఛను రూ.3,016 వస్తోందని చెప్పారు. కొంత కాలం పాటు మందులు వాడితే బాలిక ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు బాలిక తల్లిదండ్రులు అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. బాలిక తండ్రి ఫోన్ నంబర్ 7036042976.
Comments
Please login to add a commentAdd a comment