వికారాబాద్: పిచ్చికుక్క వీరంగం చేసింది.. బిగ్గరగా మొరుగుతూ (అరుస్తూ) కనిపించిన వాళ్లందరినీ కరుస్తూ భయభ్రాంతులు సృష్టించింది. ఈ సంఘటన గురువారం ఉదయం రేగడిమైలారంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇందిరానగర్ కాలనీలోని పలు ఇళ్లలో దూరిన వీధికుక్క చిన్నారులపై దాడికి పాల్పడింది. ఆరుగురిని కరిచి, తీవ్రంగా గాయ పరిచింది.
వీరి అరుపులు, కేకలతో భయపడిన తల్లిదండ్రులు పరుగున వచ్చి పిల్లలను ఆస్పత్రికి తరలించే టెన్షన్‌లో ఉండగా.. ఒకరి తర్వాత ఒకరిని కరుస్తూ వెళ్లింది. దీని దాడిలో నెల్లి శ్రీనివాస్ కొడుకు ఆదిత్య(ఎల్‌కేజీ), బంటు అంజిలయ్య కూతురు నందిని(యూకేజీ), నెల్లి వెంకటప్ప కూతురు నవ్యశ్రీ(ఎల్‌కేజీ), మంగలి శ్రీనివాస్ కూతురు దివ్యశ్రీ(ఎల్‌కేజీ), మమత, నర్మద గాయపడ్డారు. అలాగే ఇందిరానగర్‌కు చెందిన వృద్ధుడు కుమ్మరి రాములును కరిచిన కుక్క.. అక్కడి నుంచి గ్రామంలోని జాతీయ రహదారిపైకి వచ్చి డీప్లానాయక్ తండాకు చెందిన పూల్‌సింగ్ అనే వ్యక్తిని గాయపర్చింది.
దీనిదాడిలో మొత్తం పది మంది గాయపడ్డారు. వీరందరినీ కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమచికిత్స చేశారు. గాయాలు ఎక్కువగా ఉన్న నలుగురు చిన్నారులను హైదరాబాద్‌లోని నల్లకుంట ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ సంఘటనతో ఊరంతా ఉలిక్కిపడింది. పది మందిపై దాడిచేసిన కుక్క మాత్రం తప్పించుకుపోయింది. దీంతో వీధుల్లో కుక్కలను చూస్తే గ్రామస్తులు హడలిపోతున్నారు. కుక్కలను అరికట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment