Aisha
-
శ్వాసే.. ఆ‘ఐ’శ !
వికారాబాద్: పిల్లలకు చిన్న గాయమైతేనే కన్నపేగు అల్లాడిపోతుంది.. అలాంటిది ఏడేళ్లుగా నయం కాని వ్యాధితో చిన్నారి కళ్ల ముందు నేలకే పరిమితమైతే ఆ తల్లిదండ్రుల బాధ, వ్యథ చెప్పడానికి కూడా వీలుకాదు.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చౌడాపూర్ మండలంలోని అబ్దుల్ ఉస్మాన్ కుటుంబం. మందిపల్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఐదేళ్ల వరకు పెద్ద కూతురు అబ్దుల్ ఐశ(15) ఎంతో ఆరోగ్యంగా ఉండేది. రెండో తరగతి చదువుకునే సమయంలో ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది. అప్పుడు సర్జరీ చేశారు. అప్పటి నుంచి బాలికలో ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు క్యాల్షియం లోపం వెంటాడింది. ఐశను గట్టిగా పట్టుకున్నా ఎముకలు విరిగిపోయేవి. దీంతో తల్లిదండ్రులు బాలికను పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ ఫలితం కనిపించలేదు. పేద కుటుంబ కావడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఐశ ఆరోగ్యం మరింత దెబ్బతింది. దీంతో రెండు నెలల పాటు ఆస్పత్రిలో ఉంచారు. ఖర్చులు ఎక్కువ కావడంతో ఇటీవలే ఇంటికి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె ఆక్సిజన్‌పై నెట్టుకొస్తోంది. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆటో నడిస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితిలో కూతురి వైద్యం కోసం నెలకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని అబ్దుల్ ఉస్మాన్ తెలిపారు. ఇన్వర్టర్, కరెంటు బిల్లు రూ. 2వేలు, వాతావరణం వేడిగా ఉండడం కోసం ఓ యంత్రం, ఆక్సిజన్ మిషన్‌కు నెలకు రూ. 6 వేలు, ఇతర ఖర్చులు మరో రెండు వేలు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. ఐశ స్వతహాగా ఏ పని చేసుకోలేదని, భోజనం కూడా తినిపించాలి ఉంటుందని, ధ్రవ పదార్థాలే ఎక్కువ ఇస్తున్నట్లు తెలిపారు. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఎవరో ఒకరు పక్కనే ఉండి చూసుకోవాలని తల్లి తెలిపింది. ఆక్సిజన్ మిషన్ పెట్టడం వల్ల కరెంటు పోకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మూడు గంటలపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఐశను సబ్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడే పడుకోవాల్సి వచ్చిందని బోరున విలపించారు. ప్రస్తుతం వికలాంగ పింఛను రూ.3,016 వస్తోందని చెప్పారు. కొంత కాలం పాటు మందులు వాడితే బాలిక ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు బాలిక తల్లిదండ్రులు అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. బాలిక తండ్రి ఫోన్ నంబర్ 7036042976. -
అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్ పోలీసులు
కోచి: దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొం టున్న సినీ దర్శకురాలు అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. బీజేపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కవరట్టి పోలీసులు ఆది, బుధ, గురు వారాల్లో ఆమెను ప్రశ్నించారు. గురువారం దాదాపు మూడు గంటలపాటు జరిగిన విచారణ అనంతరం అయేషా సుల్తానా మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయం ముగిసింది. కోచి తిరిగి వెళ్తానని పోలీసులకు చెప్పాను. రేపు లేదా ఎల్లుండి కోచికి చేరుకుంటాను’అని అన్నారు. బుధవారం దాదాపు 8 గంటలపాటు జరిగిన విచారణలో తనకు విదేశాలతో ఏవైనా సంబంధాలున్నాయా అంటూ పోలీసులు ప్రశ్నించారని అంతకుముందు అయేషా చెప్పారు. తన వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారన్నారు. ఆదివారం పోలీసులు అయేషాను మూడు గంటలపాటు విచారించారు. ‘మలయాళం వార్తా చానెల్ జూన్ 7వ తేదీన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగించిందని ఆరోపించారంటూ బీజేపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు! -
దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్
కొచ్చి: లక్షద్వీప్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు ఊరట లభించింది. ఈ కేసులో ఒకవేళ అమెను అరెస్టు చేస్తే వారంరోజులపాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయేషా సుల్తానా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం జూన్ 20న తమ ఎదుట హాజరు కావాలంటూ లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయేషా సుల్తానాకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మీనన్ సూచించారు. రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరి హామీతో ఆయేషా సుల్తానాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని తెలిపారు. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగిస్తోందని జూన్ 7న ఆరోపించిన ఆయేషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
Aisha Sultana: అయిషాపై దేశద్రోహం కేసు.. అదిరిపోయే ట్విస్ట్
లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. న్యూఢిల్లీ: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్ మేకర్. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయిషాకు మద్దతుగా లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్ ఖాదర్ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్, జిల్లా కలెక్టర్ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు. ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్ పటేల్ రాకముందు లక్షద్వీప్‌లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: నీటి అడుగున నిరసన చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు -
ఓటీటీకి సైన్ చేసింది, ఫేమ్ తెచ్చుకుంది
అయేషా అహ్మద్.. సిరీస్ కన్నా ముందు టీవీ కమర్షియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన మోడల్. రూపంతోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు వెబ్ సిరీస్‌తో వీక్షకుల మనసుల్లో స్థిరపడిపోయింది. పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లి.. రుక్సర్.. జన్మనిచ్చిన తండ్రి.. అసద్ అహ్మద్. తర్వాత రుక్సర్ .. అసద్‌కు విడాకులిచ్చి ఫిల్మ్‌మేకర్ ఫారూక్ కబీర్‌ను పెళ్లి చేసుకోవడంతో అయేషా అతని సంరక్షణలోనే పెరిగింది. అయేషా తల్లి రుక్సర్ కూడా నటే. సర్కార్, గాడ్ తుస్సీ గ్రేట్ హో, పీకే వంటి సినిమాల్లో కీలక పాత్రల్లోనే నటించింది. అలా నటనను తల్లి నుంచి(రుక్సర్ అహ్మద్ నటీమణి) , ఆఫ్ స్క్రీన్ టెక్నిక్స్ సవతి తండ్రి నుంచి నేర్చుకుంది అయేషా. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ముందు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ పని చేసింది. ఆ సమయంలోనే అంటే 2016లో ‘తుమ్ బిన్ 2’ సినిమాలో చాన్స్ రావడంతో నటిగా పరిచయం అయింది. అదే సంవత్సరం రూబరూ అనే సినిమాలోనూ నటించింది. 2018లో ‘త్రీ స్టోరీస్’తో రేణుక సహానే, షీబా చద్దా వంటి మేటి నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకుంది అయేషా. అడల్టింగ్ అనే సిరీస్ (2020)తో ఓటీటీకీ సైన్ చేసింది.. ఫేమ్ సంపాదించుకుంది. యూట్యూబ్ వీడియోలతోనూ నేమ్ తెచ్చుకుంటోంది. కొంచెం టైమ్ దొరికినా జిమ్‌కి వెళ్లిపోతుంది. ఏ కాస్త వెసులుబాటు ఉన్నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంది. -
ఆయేషా మృతదేహానికి నేడు రీ పోస్ట్‌మార్టం
సాక్షి, అమరావతి/తెనాలి రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్ ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. హత్య జరిగిన 12 ఏళ్ల అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి, శవ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరు నెలల క్రితమే రీ పోస్ట్‌మార్టం చేయడానికి సీబీఐ అధికారులు సిద్ధపడగా, మత పెద్దలు అంగీకరించడం లేదని ఆయేషా తల్లిదండ్రులు చెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. కోర్టు ఉత్తర్వులతో చేపడతామని అప్పట్లో సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయేషా తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా, రీ పోస్ట్‌మార్టం చేయడానికి కోర్టు నుంచి అనుమతి లభించింది. 14న రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు తమకు సహకరించాలని సీబీఐ అధికారులు తెనాలి సబ్ కలెక్టర్‌కు ఈ నెల 12న లేఖ రాశారు. తెనాలి చెంచుపేటలోని ఈద్గా మైదానాన్ని శుక్రవారం తహసీల్దార్ కె.రవిబాబు, ఇతర అధికారులు, పోలీసులు పరిశీలించి ఆయేషా సమాధిని గుర్తించారు. -
పిలవకనే వచ్చిన వైద్యుడు
ఆరేళ్ల ఆయిషా ఒళ్లంతా జ్వరంతో కాలిపోతోంది. బిడ్డకు వైద్యం చేయిద్దామంటే ఆమె తల్లి జుబేదా చేతిలో చిల్లిగవ్వ లేదు. భర్తలేని జుబేదా తన తండ్రితో కలిసి ఉంటోంది. అప్పటికే తండ్రీ కూతుళ్లు మూడు రోజుల నుంచి పస్తులుంటున్నారు. కూతురి ఒళ్లు జ్వరంతో కాలిపోతుండటంతో తన వంతు ప్రయత్నంగా ఆమె నుదుటిపై తడిగుడ్డతో తుడుస్తూ ఉంది. ఇక తన బిడ్డను కాపాడగలిగేవాడు అల్లాహ్ ఒక్కడేనని భావిస్తూ, ‘ఓ అల్లాహ్! నా బేటీ జ్వరాన్ని తగ్గించి స్వస్థత కలిగించు’ అంటూ ప్రార్థన చేయసాగింది జుబేదా. అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇంత రాత్రి పూట తమ ఇంటితలుపు తడుతున్నదెవరబ్బా అని తండ్రీ కూతుళ్లు ఆశ్చర్యపోయారు. మెడలో స్టెతస్కోపు, చేతిలో మందుల కిట్టు పట్టుకుని డాక్టర్ లోనికి వస్తూనే, ‘రోగి ఎక్కడ?’ అనడిగారు. డాక్టర్‌ను చూడగానే ఆ జుబేదాకు ప్రాణం వచ్చినట్లయింది. వెంటనే డాక్టర్‌ను జ్వరంతో బాధపడుతున్న కూతురి దగ్గరకు తీసుకెళ్లింది. డాక్టర్ అమ్మాయిని నిశితంగా పరిశీలించి మందుల చీటీని అందిస్తూ తనకు రావాల్సిన ఫీజును అడిగారు. దానికి జుబేదా ‘‘డాక్టర్ గారూ మీకు ఫీజు కట్టడానికి మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. మేము ఎన్నోరోజులుగా పస్తులుంటున్నాము’’ అనగానే.. డాక్టర్ కోపంతో ‘‘ఫీజు ఇవ్వడం చేతగానప్పుడు వేళకాని వేళలో ఫోన్ చేసి ఎందుకు పిలిపించారు?’’ అని చీవాట్లు పెట్టాడు. డాక్టర్ గారు పొరబడి తమ ఇంటికొచ్చారని అర్థమైన జుబేదా ధైర్యం కూడగట్టుకొని ‘‘డాక్టర్ గారూ మేము ఫోన్ చేసి మిమ్మల్ని పిలవలేదు. మా ఇంట్లో ఫోన్ లేనేలేదు’’ అని వివరణ ఇచ్చింది. దానికి డాక్టర్ గారు ‘‘ఇది ఫలానా వాళ్ల ఇల్లు కాదా’’ అని అడిగారు. ‘మీరు చెప్పిన పేరుగల వాళ్ల ఇల్లు మా పక్కనే ఉంది’ అని చెప్పింది జుబేదా. తనవల్లే పొరపాటు జరిగిందని తెలుసుకున్న డాక్టర్, అక్కడినుంచి వెళ్లిపోయారు. తిరిగి కాసేపటికే మళ్లీ జుబేదా ఇంటి తలుపుతట్టారు. ‘‘అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను మీ పరిస్థితులను గురించి తెలుసుకోనంతవరకు నేనిక్కడినుంచి ఈ రోజు కదిలేదిలేదు’’ అని డాక్టర్ గారు తండ్రీ కూతుళ్లను పట్టిపట్టి మరీ అడిగారు. అప్పుడు జుబేదా డాక్టర్‌కు తన హృదయ విదారక గాథను వినిపించింది. డాక్టర్ బయటికి వెళ్లి, బజారు నుంచి వారికి భోజనాలు, అమ్మాయి కోసం మందులు, పండ్లు, పాలు తీసుకొని వచ్చారు. ఇక నుంచి నెల నెలా నిత్యావసరాలకు సరిపడా డబ్బును అందజేస్తానని చెప్పి సెలవు తీసుకున్నారు డాక్టరు. – ముహమ్మద్ ముజాహిద్ -
కష్టం ఫలించె.. కొలువు వరించె
గ్రూప్స్‌లో విజేత కావాలన్న ‘ఆశ’కు ఓ అవకాశం వచ్చింది.. నలుగురిలో ఒకరిగా నిలబడాలన్న కసికి భర్త ప్రోత్సాహం తోడైంది.. ఇంకేముంది పట్టుదల ముందు లక్ష్యం తలవంచింది. కష్టానికి ఫలితం దక్కింది.. విజయం సలాం అంటూ ఆమె ఒడిలోకి వచ్చి వాలింది. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మైదుకూరుకు చెందిన ఆయేషా గ్రూప్స్‌లో బీసీ–ఈ మహిళా విభాగంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి శభాష్ అనిపించారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. సాక్షి, కడప: ఎంతకష్టమైనా గ్రూప్స్‌లో విజయం సాధించాలన్న పట్టుదలే ఆయేషాను ముందుకు నడిపించింది. ఎదురుగా కొండంత లక్ష్యం కనిపిస్తున్నా.. మార్గంలో అనేక అడ్డంకులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి విజయం సాధించేలా చేసింది. గ్రూప్స్ విజేతగా నిలిచి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్‌గా కొలువు ఒడిసిపట్టిన ఓ మధ్య తరగతి యువతి విజయ గాథ ఇదీ. ఆది నుంచి చదువులో అగ్రస్థానం మైదుకూరు పట్టణంలోని సాయినాథపురానికి చెందిన ఖలీల్‌బాషా ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. ఖలీల్‌బాషా పెద్ద కుమార్తె ఆయేషా. తల్లి ఖాజాబి గృహిణి. ఆయేషా 1 నుంచి 10వ తరగతి వరకు మైదుకూరులోని శారద విద్యామందిర్‌లో చదువుకున్నారు. 2003లో పదో తరగతిలో 505 మార్కులు, ఇంటర్మీడియేట్ మేధా జూనియర్ కళాశాలలో బైపీసీ విభాగంలో 889 మార్కులు సాధించారు. అనంతరం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీ గ్రూపులో 70.9 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం తిరుపతిలోని గేట్ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చదివి 74.9 శాతం మార్కులతో నిలిచారు. కళాశాలలో చిగురించిన ప్రేమ.... తిరుపతి గేట్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న సమయంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన, ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఎస్.మోహన్ సుబ్రమణి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించి పెళ్లి వరకు తీసుకెళ్లింది. మతాలు వేరైనా ఇద్దరూ అన్యోనంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్ బెంగుళూరులో యూపీఎస్ బ్యాటరీల షోరూం నిర్వహిస్తున్నారు. తొలుత చిన్న ఉద్యోగంలో చేరి... 2012లో తిరుపతిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఆయేషా ఉద్యోగం లో చేరారు. తర్వాత 2013లో వివాహమైన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 2014–15,2015–16లో రెండుమార్లు సివిల్స్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో 2016లో ఏపీపీఎస్సీ గ్రూప్స్‌కు ప్రయత్నించారు. అందులో భాగంగా గ్రూప్–1లో బీసీ–ఈ మహిళా విభాగంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకున్నారు. గృహిణిగా ఉంటూ....ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ.... బెంగళూరులోని కేఆర్‌పురంలో ఉంటున్న ఆయేషా గృహిణిగానే ఉంటూ ఇంట్లోనే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యారు. ‘సాక్షి’లో వచ్చే భవిత, ఇతర మెటీరియల్ బాగా చదివారు. ప్రత్యేకంగా తన విజయానికి ‘సాక్షి’ దినపత్రిక ఎంతగానో ఉపయోగపడిందని ఆమె స్పష్టం చేశా రు. ప్రతిరోజు ఫలానా సమయం అని లేకుండా....వీలు దొరికినపుడల్లా ఆన్లైన్ ద్వారా శిక్షణ తీసుకున్నానని వివరించారు. అబ్దుల్‌కలాం స్ఫూర్తి... మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఏ విధంగా పైకి వచ్చారో...అదే స్ఫూర్తితో తాను చదివినానని ఆయేషా తెలిపారు.. తన భర్త మోహన్ ప్రోత్సాహం, నానమ్మ రూతమ్మ స్ఫూర్తి కూడా తనకెంతో ఉపయోగపడిందని ఆమె తెలియజేశారు. అలాగే తన భర్త మోహన్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్–2017లో గ్రూప్స్ రాశారని, ప్రస్తుతం గ్రూప్–1కు సంబంధించి మెయిన్స్‌లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కష్టపడితే ఏదైనా సాధ్యమే యువత లక్ష్యాలను నిర్ణయించుకుని.. అందుకు అనుగుణంగా కష్టపడి చదివితే ఎలాంటి ఫలితాలనైనా సులభంగా సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ చదువుకుంటూనే జీవితానికి ఒక గోల్ పెట్టుకుని ముందుకు సాగాలి. మనం చదువుతున్నప్పుడు కష్టం మన కళ్ల ముందు కనపడుతుంటే.. కచ్చితంగా లక్ష్యం కూడా చిన్నదే అవుతుంది. – ఆయేషా, గ్రూప్–1 విజేత -
నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి
నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిందో తల్లి. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం గ్రామంలోని హిదాయత్‌నగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రహ్మాన్, జరీన(30) దంపతులకు నలుగురు పిల్లలు. బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురైన జరీన నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తల్లితో పాటు కూతుర్లు ఆయెషా(13), అంజుమ్(6) మృతిచెందగా.. మహ్మద్(10), నాగుర్(8) తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు చిన్నారులను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.