ఆరేళ్ల ఆయిషా ఒళ్లంతా జ్వరంతో కాలిపోతోంది. బిడ్డకు వైద్యం చేయిద్దామంటే ఆమె తల్లి జుబేదా చేతిలో చిల్లిగవ్వ లేదు. భర్తలేని జుబేదా తన తండ్రితో కలిసి ఉంటోంది. అప్పటికే తండ్రీ కూతుళ్లు మూడు రోజుల నుంచి పస్తులుంటున్నారు. కూతురి ఒళ్లు జ్వరంతో కాలిపోతుండటంతో తన వంతు ప్రయత్నంగా ఆమె నుదుటిపై తడిగుడ్డతో తుడుస్తూ ఉంది. ఇక తన బిడ్డను కాపాడగలిగేవాడు అల్లాహ్ ఒక్కడేనని భావిస్తూ, ‘ఓ అల్లాహ్! నా బేటీ జ్వరాన్ని తగ్గించి స్వస్థత కలిగించు’ అంటూ ప్రార్థన చేయసాగింది జుబేదా. అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇంత రాత్రి పూట తమ ఇంటితలుపు తడుతున్నదెవరబ్బా అని తండ్రీ కూతుళ్లు ఆశ్చర్యపోయారు. మెడలో స్టెతస్కోపు, చేతిలో మందుల కిట్టు పట్టుకుని డాక్టర్ లోనికి వస్తూనే, ‘రోగి ఎక్కడ?’ అనడిగారు. డాక్టర్‌ను చూడగానే ఆ జుబేదాకు ప్రాణం వచ్చినట్లయింది. వెంటనే డాక్టర్‌ను జ్వరంతో బాధపడుతున్న కూతురి దగ్గరకు తీసుకెళ్లింది. డాక్టర్ అమ్మాయిని నిశితంగా పరిశీలించి మందుల చీటీని అందిస్తూ తనకు రావాల్సిన ఫీజును అడిగారు. దానికి జుబేదా ‘‘డాక్టర్ గారూ మీకు ఫీజు కట్టడానికి మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు.
మేము ఎన్నోరోజులుగా పస్తులుంటున్నాము’’ అనగానే.. డాక్టర్ కోపంతో ‘‘ఫీజు ఇవ్వడం చేతగానప్పుడు వేళకాని వేళలో ఫోన్ చేసి ఎందుకు పిలిపించారు?’’ అని చీవాట్లు పెట్టాడు. డాక్టర్ గారు పొరబడి తమ ఇంటికొచ్చారని అర్థమైన జుబేదా ధైర్యం కూడగట్టుకొని ‘‘డాక్టర్ గారూ మేము ఫోన్ చేసి మిమ్మల్ని పిలవలేదు. మా ఇంట్లో ఫోన్ లేనేలేదు’’ అని వివరణ ఇచ్చింది. దానికి డాక్టర్ గారు ‘‘ఇది ఫలానా వాళ్ల ఇల్లు కాదా’’ అని అడిగారు. ‘మీరు చెప్పిన పేరుగల వాళ్ల ఇల్లు మా పక్కనే ఉంది’ అని చెప్పింది జుబేదా. తనవల్లే పొరపాటు జరిగిందని తెలుసుకున్న డాక్టర్, అక్కడినుంచి వెళ్లిపోయారు. తిరిగి కాసేపటికే మళ్లీ జుబేదా ఇంటి తలుపుతట్టారు. ‘‘అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను మీ పరిస్థితులను గురించి తెలుసుకోనంతవరకు నేనిక్కడినుంచి ఈ రోజు కదిలేదిలేదు’’ అని డాక్టర్ గారు తండ్రీ కూతుళ్లను పట్టిపట్టి మరీ అడిగారు. అప్పుడు జుబేదా డాక్టర్‌కు తన హృదయ విదారక గాథను వినిపించింది. డాక్టర్ బయటికి వెళ్లి, బజారు నుంచి వారికి భోజనాలు, అమ్మాయి కోసం మందులు, పండ్లు, పాలు తీసుకొని వచ్చారు. ఇక నుంచి నెల నెలా నిత్యావసరాలకు సరిపడా డబ్బును అందజేస్తానని చెప్పి సెలవు తీసుకున్నారు డాక్టరు.
– ముహమ్మద్ ముజాహిద్
పిలవకనే వచ్చిన వైద్యుడు
Published Fri, Aug 24 2018 12:10 AM | Last Updated on Fri, Aug 24 2018 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment