సాలూరు రూరల్: మండలంలోని బాగువలస గ్రామంలో జ్వరాలు ప్రబలాయి. ప్రతి ఇంటిలో ఒకరో.. ఇద్దరో మంచం పట్టారు. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, తల బరువుగా ఉంటోం దని రోగులు చెబుతున్నారు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉన్నప్పటికీ రెగ్యులర్ డాక్టర్ లేరు. ఇన్‌చార్జి వైద్యుడు ఎప్పుడు వస్తారో తెలియదు. ఉన్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించడం తప్ప పూర్తి స్థాయిలో వైద్యం చేయలేకపోతున్నారు. దీంతో బాధితు లు సంచి వైద్యులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలో ప్రస్తుతం ఆమిటి ఆదినారాయణ, దుండాల అప్పలనర్సమ్మ, బొత్స సత్యవతి, మత్స బోడమ్మ, జామి సింహాలు, బొత్స సరోజినమ్మ, బొత్స. సూర్యనారాయణ, కొడగళ్ల సోమమ్మ, బెల్లంకి శ్యామ్, జాని క్రిష్ణ, గేదెల చిన్న తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు.
రెగ్యులర్ వైద్యుడు అవసరం
గ్రామంలో పరిస్థితిపై జెడ్పీటీసీ సభ్యురాలు రెడ్డి పద్మావతి మాట్లాడుతూ పదుల సంఖ్యలో రోగులు ఉన్నా వైద్యాధికారులు పట్టించుకోవటం లేదన్నారు. బాగువలస పీహెచ్‌సీ పరిధిలో పెదపధం, నారళ్లవలస, పురోహితునివలస, అన్నంరాజువలస, బోరబంద, బొబ్బిలి మండలానికి చెందిన నాలుగు గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఈ గ్రామాల్లో ఉంటున్న ప్రజల్లో ఎక్కువ మంది గిరిజనులేనని, వీరికి వైద్యం అందించేందుకు రెగ్యులర్ వైద్యుడు ఎంతో అవసరమని అన్నారు. పీహెచ్‌సీకి రోజూ దాదాపు 200 మంది రోగులు వస్తున్నారని, వీరిని పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పెదపధం గ్రామంలో కూడా ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్నారని చెప్పారు. బాగువలస పీహెచ్‌సీలో వైద్యుడు లేకపోవటంతో చాలామంది సాలూరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
అప్పటికప్పుడు వైద్యశిబిరం నిర్వహణ
బాగువలస గ్రామంలో పరిస్థితిని సాక్షి పరిశీలించినట్టు తెలుసుకున్న వెంటే పీహెచ్‌సీ ఇన్‌చార్జి డాక్టర్ సురేష్ చంద్రదేవ్, వైద్యసిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో దాదాపు 20 మంది జ్వరాలుతో బాధపడుతున్నట్టు గుర్తించామని సిబ్బంది శ్రీనువాసరావు తెలిపారు. వీరికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
పచ్చకామెర్లతో గర్భిణి మృతి
జామి: జామిలోని జంఘాల కాలనీకి చెందిన 9 నెలల గర్భిణి పి.వెంకటలక్ష్మి (21) పచ్చెకామెర్లతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్‌లో మరణించారు. నిడదవోలులో ఉంటున్న ఆమె ప్రసవం నిమిత్తం గత నెలలో పుట్టింటికి వచ్చారు. ఈ నెల 6న స్థానిక పీహెచ్‌సీకి వెళ్లగా వైద్యాధికారి జగదీష్ రక్త పరీక్షలు చేసి కామెర్లు సోకినట్టు గుర్తించారు. ఆమెను విజయనగరం ఘోషాస్పత్రికి పంపారు. పరిస్థితి విషమించటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందారు. కేజిహెచ్‌లో సక్రమంగా వైద్యం అందించకపోవడం వల్లే తన కుమార్తె మరణించిందిని మృతురాలి తండ్రి భూపతి ఆరోపించారు.
జ్వరం, కామెర్లతో యువకుడి మృతి
సాలూరు: పట్టణంలోని 14వ వార్డు పరిధి బంగారమ్మ కాలనీకి చెందిన సొంపి శ్రీను అనే 25 ఏళ్ల గిరిజన యువకుడు జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతూ ఆదివారం అర్ధరాత్రి విశాఖ కేజీహెచ్‌లో కన్నుమూశాడు. సకాలంలో వైద్యం చేయించుకోకపోవటంతో అతడు మరణించాడని బంధువులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీను లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. ఇటీవల జ్వరం వచ్చినా కొద్దిరోజులు చికిత్స చేయించుకోలేదు. జ్వరం తీవ్రమవటంతో ఆర్‌ఎంపీ వైద్యుడిచ్చిన మందులు వాడాడు. జ్వరంతోపాటు కామెర్లు కూడా రావటంతో స్థానికులు జోక్యం చేసుకుని శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు శనివారం విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను మరణించాడు. సోమవారం ఉదయం అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇక తనకు దిక్కెవరంటూ భార్య మంగ బోరున విలపించటం స్థానికులను కలచివేసింది.
గతంలో ఇద్దరు బిడ్డలను కోల్పోయారు..
రెండేళ్ల కిందట శ్రీను భార్య మంగకు ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. కానీ తీవ్ర రక్తహీనత కారణంగా వారిద్దరూ జన్మించిన వెంటనే మరణించారు. ఆ బాధ నుండి కుటుంబ సభ్యులు తేరుకుంటుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
బాగువలసలో ప్రబలిన జ్వరాలు
Published Tue, Aug 11 2015 1:39 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement
Advertisement