కష్టం ఫలించె.. కొలువు వరించె | Success Story Of Kadapa Women | Sakshi
Sakshi News home page

కష్టం ఫలించె.. కొలువు వరించె

Published Sun, May 20 2018 11:05 AM | Last Updated on Sun, May 20 2018 11:05 AM

Success Story Of Kadapa Women - Sakshi

గ్రూప్స్‌లో విజేత కావాలన్న ‘ఆశ’కు ఓ అవకాశం వచ్చింది.. నలుగురిలో ఒకరిగా నిలబడాలన్న కసికి భర్త ప్రోత్సాహం తోడైంది.. ఇంకేముంది పట్టుదల ముందు లక్ష్యం తలవంచింది. కష్టానికి ఫలితం దక్కింది.. విజయం సలాం అంటూ ఆమె ఒడిలోకి వచ్చి వాలింది. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మైదుకూరుకు చెందిన ఆయేషా గ్రూప్స్‌లో బీసీ–ఈ మహిళా విభాగంలో  రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి శభాష్‌ అనిపించారు. యువతకు ఆదర్శంగా నిలిచారు.

సాక్షి, కడప: ఎంతకష్టమైనా గ్రూప్స్‌లో విజయం సాధించాలన్న పట్టుదలే ఆయేషాను ముందుకు నడిపించింది. ఎదురుగా కొండంత లక్ష్యం కనిపిస్తున్నా.. మార్గంలో అనేక అడ్డంకులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి విజయం సాధించేలా చేసింది. గ్రూప్స్‌ విజేతగా నిలిచి ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌గా కొలువు ఒడిసిపట్టిన ఓ మధ్య తరగతి యువతి విజయ గాథ ఇదీ.

ఆది నుంచి చదువులో అగ్రస్థానం
మైదుకూరు పట్టణంలోని సాయినాథపురానికి చెందిన ఖలీల్‌బాషా  ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ రిటైర్డ్‌ అయ్యారు. ఖలీల్‌బాషా పెద్ద కుమార్తె ఆయేషా.  తల్లి ఖాజాబి గృహిణి. ఆయేషా 1 నుంచి 10వ తరగతి వరకు మైదుకూరులోని శారద విద్యామందిర్‌లో చదువుకున్నారు. 2003లో పదో తరగతిలో 505 మార్కులు, ఇంటర్మీడియేట్‌ మేధా జూనియర్‌ కళాశాలలో బైపీసీ విభాగంలో 889 మార్కులు సాధించారు. అనంతరం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీ గ్రూపులో 70.9 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం తిరుపతిలోని గేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ చదివి 74.9 శాతం మార్కులతో నిలిచారు.

కళాశాలలో చిగురించిన ప్రేమ....
తిరుపతి గేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న సమయంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన, ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఎస్‌.మోహన్‌ సుబ్రమణి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించి పెళ్లి వరకు తీసుకెళ్లింది. మతాలు వేరైనా ఇద్దరూ  అన్యోనంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్‌ బెంగుళూరులో యూపీఎస్‌ బ్యాటరీల షోరూం నిర్వహిస్తున్నారు.

తొలుత చిన్న ఉద్యోగంలో చేరి... 
2012లో తిరుపతిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ శాఖలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఆయేషా ఉద్యోగం లో చేరారు. తర్వాత 2013లో వివాహమైన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 2014–15,2015–16లో రెండుమార్లు సివిల్స్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో 2016లో ఏపీపీఎస్‌సీ గ్రూప్స్‌కు ప్రయత్నించారు. అందులో భాగంగా గ్రూప్‌–1లో బీసీ–ఈ మహిళా విభాగంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి శభాష్‌ అనిపించుకున్నారు.

గృహిణిగా ఉంటూ....ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకుంటూ....
బెంగళూరులోని కేఆర్‌పురంలో ఉంటున్న ఆయేషా గృహిణిగానే ఉంటూ ఇంట్లోనే ఆన్‌లైన్‌ కోచింగ్‌  తీసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యారు. ‘సాక్షి’లో వచ్చే భవిత, ఇతర మెటీరియల్‌ బాగా చదివారు. ప్రత్యేకంగా తన విజయానికి ‘సాక్షి’ దినపత్రిక ఎంతగానో ఉపయోగపడిందని ఆమె స్పష్టం చేశా రు. ప్రతిరోజు ఫలానా సమయం అని లేకుండా....వీలు దొరికినపుడల్లా ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తీసుకున్నానని వివరించారు. 

అబ్దుల్‌కలాం స్ఫూర్తి... 
మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం ఏ విధంగా పైకి వచ్చారో...అదే స్ఫూర్తితో తాను చదివినానని ఆయేషా తెలిపారు.. తన భర్త మోహన్‌ ప్రోత్సాహం,  నానమ్మ రూతమ్మ స్ఫూర్తి కూడా తనకెంతో ఉపయోగపడిందని ఆమె తెలియజేశారు. అలాగే తన భర్త మోహన్‌ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌–2017లో గ్రూప్స్‌ రాశారని, ప్రస్తుతం గ్రూప్‌–1కు సంబంధించి మెయిన్స్‌లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

కష్టపడితే ఏదైనా సాధ్యమే
యువత లక్ష్యాలను నిర్ణయించుకుని.. అందుకు అనుగుణంగా కష్టపడి చదివితే ఎలాంటి ఫలితాలనైనా సులభంగా సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ చదువుకుంటూనే జీవితానికి ఒక గోల్‌ పెట్టుకుని ముందుకు సాగాలి. మనం చదువుతున్నప్పుడు కష్టం మన కళ్ల ముందు కనపడుతుంటే.. కచ్చితంగా లక్ష్యం కూడా చిన్నదే అవుతుంది.
– ఆయేషా, గ్రూప్‌–1 విజేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement