వికారాబాద్: పనిచేసిన యజమాని ఇంటికే కన్నం వేశాడు ఓ వ్యక్తి.. ఇంట్లో భారీగా నగదు ఉందనే పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల తాండూరు పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.19లక్షలను రికవరీ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
బుధవారం ఎస్పీ కోటిరెడ్డి తాండూరు పట్టణ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వ్యాపారి ఎండీ వాజీద్ ఇటీవల ప్లాట్ విక్రయించగా రూ. 20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇంట్లో పెట్టి ఈ నెల 14న హైదరాబాద్‌లో బంధువుల వివాహానికి వెళ్లాడు. తరువాతి రోజు ఇంట్లో చోరీ జరిగింది.
రూ. 20లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.
తెలిసిన వ్యక్తి పనే..
వాజీద్ వద్ద అబూబాకర్ ఖురేషి అనే వ్యక్తి గతంలో పనిచేశాడు. ఇంట్లో డబ్బు ఉందన్న సమాచారంతో దొంగతానికి ప్లాన్ చేశాడు. తన పెద్దమ్మ కొడుకు అబూ సోఫియాన్ ఖురేషికి విషయాన్ని చెప్పాడు. అదే కాలనీలో ఉంటున్న ఖలీల్, తౌసిఫ్, దీపక్ అలియాస్ కిట్టుతో కలసి ప్లాన్ వేశాడు. ఈ నెల 15న రాత్రి అబూబాకర్, ఖలీల్‌లు రాడ్‌తో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.
మిగిలిన ముగ్గురు బయటనే ఉండి పరిసరాలను గమనిస్తూ ఉన్నారు. బీరువాలో ఉన్న రూ. 20 లక్షలను ఎత్తుకెళ్లారు. అందులో రూ.లక్షను మొదట అందరూ పంచుకున్నారు. మిగిలిన రూ. 19 లక్షలను యాదిరెడ్డి చౌక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఉన్న చెత్తకుప్పలో దాచి పెట్టారు. తరువాత వచ్చి నగదును తీసుకెళ్లి పంచుకుందామనుకున్నారు.
సీసీ కెమెరాలే పట్టించాయి
బాధితుడి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను, పలు ముఖ్య కూడళ్లలోని కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే మాణిక్ నగర్ వద్ద ఉన్న కెమెరాలో అబూబాకర్ ఖురేషి అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అబూ సోఫియాన్ ఖురేషిని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.
ఈ కేసు ఛేదనకు సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషించాయన్నారు. 72 గంటల్లోనే నిందితుల అరెస్టులో కీలకపాత్ర వహించిన కానిస్టేబుళ్లు అమ్జద్, శివ, సాయికుమార్, షబీల్‌అహ్మద్‌లను ఎస్పీ అభినందించి, రివార్డు అందజేశారు. పట్టుబడిన నిందితులు ఇద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులు ఉపయోగించిన ఆటో, బైక్‌ను సీజ్ చేశామన్నారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment