కేన్సర్‌ ముందే గుర్తిస్తే 90 శాతం సేఫ్‌ | Early Cancer Diagnosis Will Be More Safe | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ ముందే గుర్తిస్తే 90 శాతం సేఫ్‌

Published Mon, Oct 7 2019 3:27 AM | Last Updated on Mon, Oct 7 2019 11:18 AM

Early Cancer Diagnosis Will Be More Safe - Sakshi

విమలమ్మ...
81 ఏళ్లవృద్ధురాలు. హైదరాబాద్‌కు చెందిన ఈమె రొమ్ము కేన్సర్‌తో ఆరేళ్ల క్రితం ఎంఎన్‌జే ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు సంపూర్ణంగా వైద్యం చేశారు. ఇప్పుడుఉత్సాహంగా ఉంటోంది.  

కరీంనగర్‌ జిల్లాకు చెందిన వినయ్‌ రాయుడుకు నాలుగేళ్లప్పుడు కేన్సర్‌ వచి్చంది. 2009 ఫిబ్రవరిలో ఎంఎన్‌జేకు తీసుకొచ్చారు. వైద్యులు ఆ బాలుడి కేన్సర్‌ను పూర్తిగా నయం చేశారు. ఇప్పుడతను ఇతర విద్యార్థుల్లానే తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.  

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌ వచ్చినా బయటపడి జీవించొచ్చు అనేందుకు ఇలాంటి వారెందరో ఉదాహరణ. తొలి రెండు దశల్లో కేన్సర్‌ను గుర్తించి వైద్యం చేయించుకున్న వారిలో 10 నుంచి 15 ఏళ్లు బతికినవారు ప్రభుత్వ రికార్డుల్లో చాలా మందే ఉన్నారు. కొన్ని కేన్సర్లు ఏ దశలో ఉన్నా 80% బతికే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కేన్సర్‌ వచ్చినవారు చికిత్స అనంతరం 15 ఏళ్ల వరకు బతకడం సర్వసాధారణం. 

10 శాతం పిల్లలకు... 
మొత్తం కేన్సర్‌ రోగుల్లో 10% మంది పిల్లలు ఉంటున్నారు. పిల్లల్లో ఎక్కువగా ఒకటి నుంచి పదేళ్లలోపు వారే అధికంగా ఉంటా రు. వీరికి రక్త సంబంధిత కేన్సర్‌ అధికంగా వస్తుంటుంది. జెనిటిక్‌ మ్యుటేషన్‌ వల్ల పిల్లల్లో కేన్సర్‌ వస్తుంటుంది. పిల్లలకు వచ్చే కేన్సర్లలో 70 నుంచి 80% వరకు నయం చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో 3వ దశలో వచ్చే కేన్సర్‌ రోగుల్లోనూ సగం మందిని బతికించవచ్చు. నాలుగో దశలో వస్తే 25% మందిని బతికించవచ్చు. అదే ఒకట్రెండు దశల్లో వస్తే 80 నుంచి 90% మంది పిల్లల క్యాన్సర్లను నయం చేయడానికి వీలుంటుంది. 

35 ఏళ్లు దాటితే స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పనిసరి... 
గతంలో 50 ఏళ్లు దాటిన వారిలోనే కేన్సర్‌ను చూసేవారం. ఇప్పుడు 35 ఏళ్లు దాటిన వారిలోనూ ఎక్కువగా వస్తోంది. కేన్సర్‌లో 25 శాతం సరై్వకల్, 25 శాతం రొమ్ము, 40 శాతం పొగాకుతో వచ్చే గొంతు, ఊపరితిత్తులు వంటివి కాగా, 10 శాతం జీవనశైలిలో మార్పుల ద్వారా, జన్యుపరమైన కారణాల ద్వారా వస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ప్రతీ ఏడాది కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్‌ టీకా వేయించడం ద్వారా సరై్వకల్‌ కేన్సర్‌ రాకుండా నియంత్రించవచ్చు. 50 ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ చేయించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్‌ చివరి దశలో ఉండగా ఆసుపత్రులకు వస్తున్నారు. అయినా రాష్ట్రంలో కేన్సర్‌ వచి్చనవారిలో 60 శాతం మందికి నయమై సాధారణ జీవితం అనుభవిస్తున్నారు. 

లక్షణాలివి... 

  • మూడు వారాలకు మించి ఎక్కువ రోజులు జ్వరం ఉండటంతోపాటు తరచుగా రావడం.  
  • ఆకలి లేకపోవడం, బరువు గణనీయంగా తగ్గిపోవడం 
  • ఏదైనా వ్యాధి వస్తే రొటీన్‌ మందులకు తగ్గకపోవడం 
  • నిత్యం దగ్గు రావడం, రక్తం పడటం 
  • రక్తంతో కూడిన వీరేచనాలు 
  • పీరియడ్స్‌ తర్వాతా రక్తస్రావం అవడం 

కేన్సర్‌ను గుర్తించడానికి అవసరమైన స్క్రీనింగ్‌ పరీక్షలు రాష్ట్రంలో ఎక్కడైనా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేమే అన్ని రకాల పరీక్ష పరికరాలను వెంట తీసుకొచ్చి చేస్తాం. వివిధ సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదిస్తే పరీక్షలు చేస్తాం. స్క్రీనింగ్‌తో ముందస్తు గుర్తిస్తే ప్రమాదం ఉండదు.     
– డాక్టర్‌ జయలత, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌. 

థైరాయిడ్‌ కేన్సర్‌ వస్తే పూర్తిగా నయం చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్‌ను మొదటి దశలో తీసుకొస్తే 95% బతికించడానికి వీలుంటుంది. 2వ దశలో 80%, 3వ దశలో 60% వరకు బతికించడానికి వీలుంటుంది.
– డాక్టర్‌ సౌమ్య కోరుకొండ, సర్జికల్‌ ఆంకాలజిస్ట్, యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్‌. 

రొమ్ము కేన్సర్‌ వస్తే గతంలో పూర్తిగా తీసేసేవారు. ఇప్పుడు ఎంతవరకు కేన్సర్‌ సోకిందో అంతవరకే సర్జరీ చేయడం ద్వారా తీసేస్తున్నాం. మూడు నాలుగో దశలోనూ రొమ్ము కేన్సర్‌ను నయం చేయడానికి వీలుంటుంది.
– డాక్టర్‌ ఉమాకాంత్‌గౌడ్, సర్జికల్‌ ఆంకాలజిస్ట్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఎంఎన్‌జే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement